వామ్మో ప్రై‘వేటు’
► అదుపులేకుండా ఫీజుల వసూలు
► ప్రతిదీ ఇక్కడే కొనాలని హుకూం
► అడ్డగోలు రేట్లతో అమ్మకం
► తడిసిమోపెడవుతున్న వైనం
► దడ పుట్టిస్తున్న పాఠశాలలు
► స్పందించని విద్యాశాఖ
కరీంనగర్‌ఎడ్యుకేషన్: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రుల్లో దడ పుట్టిస్తున్నాయి. నియంత్రణ లేకుండా ఫీజులు వసూలు చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాణ్యమైన విద్య అందుతుందనే అభిప్రాయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తుండడాన్ని అవకాశంగా తీసుకుంటూ.. అడ్మిషన్.. మెయింటనెన్స్.. స్పెషల్ ఫీజుల పేరిట దోపిడీకి తెరలేపాయి. పెన్సిల్ నుంచి నోట్‌బుక్కుల వరకు ప్రతిదీ సదరు పాఠశాలల్లోనే కొనాలని హుకూం జారీ చేస్తున్నాయి. ఈ ఖర్చులు సామాన్యుడికి తడిసి మోపెడవుతున్నాయి. తమ పాఠశాల పేర్లతో ఉన్న బ్యాగులను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నాయి. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పాఠశాలలు పునఃప్రారంభమై వారం కావస్తోంది. ప్రైవేటు పాఠశాలలు నియంత్రణ లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సిన విద్యాశాఖ నిద్రపోతోంది. ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరిపై సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు లేకున్నా.. కార్పొరేట్ లేబుల్ పెట్టుకుని వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. టెక్ట్స్, నోట్‌బుక్స్ మొదలు పెన్సిల్‌వరకు అన్నీ తమ పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టాయి. దీంతో ఆ స్కూల్‌లోనే అన్ని వస్తువులు కొనుగోలు చేయడం అనివార్యమైంది. బ్యాగులు, టై, బూట్లకు విపరీతంగా ధరలు వసూలు చేస్తున్నాయి.
పుస్తకాల ధరలు పైపైకి...
బయట షాపుల్లో రూ.15 ఉన్న పుస్తకాన్ని ప్రైవేటు పాఠశాలల్లో రూ.18 నుంచి రూ.20కి విక్రయిస్తున్నారు. ‘కార్పొరేట్’గా చెప్పుకునే ఇంకొన్ని పాఠశాలల్లో అయితే.. ఆ ధర రూ.30కి పైగా ఉంటోంది. ఒకటో తరగతి సంబంధించి 11 టెక్టŠస్‌బుక్స్‌కు రూ.915 వసూలు చేస్తున్నారు. ఇక 13 నోట్‌బుక్కులకు రూ.260, రెండో తరగతి 11 టెక్టŠస్‌బుక్స్‌కు రూ.1450, 21 నోట్‌బుక్కులకు రూ.420, మూడో తరగతి 10 టెక్టŠస్‌బుక్స్‌కు రూ.1128, 22 నోట్‌బుక్స్‌కు రూ.240 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రభుత్వం సరఫరా చేసే టెక్టŠస్‌బుక్ కాకుండానే. వీటికి తోడు పెన్నులు, పెన్సిళ్లు, కవర్లు అంటూ రెట్టింపు ధరలకు అంటగడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల యజమానులకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండడంతో ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆకాశంలో బ్యాగుల ధరలు
నర్సరీ నుంచి పదో తరగతి వరకే కాకుండా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సైతం చదువు‘కొనా’లంటే బ్యాగు తప్పనిసరైంది. ప్రస్తుతం చాలా కంపెనీలు విద్యార్థులను ఆకర్షించేలా వారి అవసరాలకు తగ్గట్టుగా అనేక మోడల్స్‌లో బ్యాగులను విడుదల చేస్తున్నాయి. కళ్లు చెదిరే డిజైన్‌లు, రంగులతో చాలారకాల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి వరకు కొన్నిపుస్తకాలే ఉంటాయి. కానీ ఆరో తరగతి నుంచి పదోతరగతి వారికి నాణ్యమైన బ్యాగు లేనిదే ముందుకు కదలని పరిస్థితి. చిన్నపిల్లల బ్యాగులు దాదాపు రూ.120 నుంచి రూ.500 వరకు, ఆరో తరగతి చదివే పిల్లలకు రూ.వెయ్యి వరకు ఉన్నాయి. మోడల్స్, నాణ్యతను బట్టి ధరలు పెంచుతున్నారు. ప్రస్తుతం బ్యాగుల ధరలు గతంలో పోల్చితే రూ.100 నుంచి రూ.120 వరకు పెరిగాయి.
మండుతున్న బూట్ల ధరలు
పాఠశాల విద్య అంటేనే క్రమశిక్షణతో కూడుకున్నది. ప్రతి పాఠశాలలో యూనిఫాం.. దానికి తగ్గట్టు బూట్లు (బ్లాక్, వైట్ కలర్) తప్పనిసరి. వీటి రేట్లు ఏటా పరుగులు తీస్తూనే ఉన్నాయి. పలు పాఠశాలలు తప్పనిసరిగా బ్రాండెడ్‌వే కొనాలని చెబుతున్నాయి. గతేడాది పలు కంపెనీలకు చెందిని బూట్లు రూ.250 నుంచి రూ.300వరకు ఉండగా.. ఇప్పడు 20శాతం పెరిగి రూ.500కు చేరాయి.
యూనిఫాంలూ అంతే..
జిల్లా కేంద్రంలో దాదాపు వందల సంఖ్యలో పాఠశాలలు వీధికొకటి ఏర్పడ్డాయి. విద్యార్థులు తప్పనిసరిగా యాజమాన్యం సూచించిన యూనిఫాంలనే ధరించాల్సి ఉంటుంది. ఏటా తప్పనిసరిగా కొత్త యూనిఫాం ఉండాల్సిన అవసరం ఉంది. వీటి ధరలూ గతేడాదితో పోల్చితే చాలా పెరిగాయి. నర్సరీ పిల్లలకు కావాల్సిన స్కూల్ యూనిఫాం గతేడాది రూ.300 నుంచి రూ.350 ఉండగా.. ఇప్పుడవి రూ.400 నుంచి రూ.450 చేరాయి. అబ్బాయిల ప్యాంట్‌షర్ట్, అమ్మాయిల యూనిఫాంలు ఒకే ధరకు లభిస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంలు లేకుంటే ఇబ్బందే. జిల్లా కేంద్రంలో చాలా దుకాణాల్లో రెడీమేడ్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. కొంత మంది రెడీమేడ్ దుస్తులను వాడితే మరి కొంత మంది కొనుక్కొని కుట్టించుకుంటున్నారు.