సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజు దందా సాగే విధంగా విద్యను వ్యాపారంగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. యాజమాన్యాల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో ప్రతి ఏడాది 10 శాతం రుసుములు పెంచుకోవచ్చని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫారసు చేసిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రతి మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఫీజులు పెంచుకునేలా ఉత్తర్వులున్నాయని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే అడ్డగోలుగా ఉన్న ఫీజుల తగ్గింపునకు చర్యలు తీసుకోని ప్రభుత్వం జోనల్ ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసి 10 శాతం కంటే ఎక్కువగా పెంచుకోవచ్చని చెబుతోందన్నారు. విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవటంతో సుమారు 162 ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అపరిమితంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఇటీవల కాగ్ వెల్లడించిందని గుర్తు చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని నియంత్రించడానికి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment