నల్లగొండ: జిల్లా వ్యాప్తంగా అమతిలేని ప్రైవేటు పాఠశాలు అసలే లేవట...! ప్రస్తుతం కొనసాగుతున్న స్కూళ్లన్నింటికీ గుర్తింపు ఉందట...! జీఓ నంబర్ ఒకటి ప్రకారం అన్ని స్కూళ్లలో అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయట.. సమస్యలు ఉన్న ప్రైవేటు స్కూలు ఒక్కటీ లేదంట...! ఇవీ మండల విద్యాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నిర్ధారించిన అంశాలు. అసలు జీఓ నంబర్ 1లో ఏముందో తెలుసుకున్నారో లేదో గానీ...ఎంఈఓలు మాత్రం ప్రైవేటు పాఠశాలలకు బాసటగా నిలిచారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసి గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు...అట్టి జాబితాను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపాల్సిందిగా ఎంఈఓలకు గత నెలలో నిర్వహించిన సమావేశంలో అధికారులు సూచించారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి జాబితా కూడా డీఈఓ కార్యాలయానికి చేరలేదు. దీంతో జిల్లాలో గుర్తింపు లేని స్కూళ్లు లేవన్న నిర్ధారణకు జిల్లా విద్యాశాఖ అధికారి వచ్చేశారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ...ఈ టెక్నో, టెక్నో, ఒలంపియాడ్, ఇంటర్నేషనల్, ప్లే స్కూల్, ఐఐటీ, కాన్సెప్ట్ పేర్లతో కొనసాగుతున్న స్కూళ్లకు పేర్లు మార్చుకోవాలని నోటీసులు జారీ చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఆదేశాలు బేఖాతర్..
జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి (గుర్తింపు) లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలను గుర్తించి ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. జీఓ నంబర్ ఒకటి ప్రకారం అన్ని వసతులు ఉన్నాయో...లేవో...పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. అయినా ఇంత వరకు ఏ ఒక్క మండలం నుంచి నివేదికలు డీఈఓకు అందలేదు. ఇంతవరకు ఏ ఒక్క పాఠశాలకు నోటీసులు జారీ చేయలేదు. ప్రస్తుతం జిల్లాలో 1400 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో గతేడాది లెక్కల ప్రకారం 30 పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయని గుర్తించారు. కానీ ఇప్పుడు ఆ పాఠశాలలు అనుమతి తీసుకున్నాయా...! లేదా.. ? అనే సమాచారం కూడా విద్యాశాఖ వద్ద లేదు. అనుమతి పొంది కొనసాగుతున్న పాఠశాలల్లో కనీస వసతులు కూడా కరువయ్యాయి.
పంపకాల పంచాయితీ..
ప్రైవేటు పాఠశాలలకు 1 నుంచి 7 తరగతి వరకు ఎంఈఓలు, 6 నుంచి 10 తరగతి వరకు డిప్యూటీ డీఈఓల ఆమోదంతో డీఈఓ కార్యాలయానికి పంపాలి. సీజ్ చేసిన పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం, కొత్త పాఠశాలలకు అనుమతులు మంజూరు చేయడంలో వేల రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పాఠశాలకు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు ముట్టచెప్పిందే పనిజరగడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కింది నుంచి పై స్థాయి వరకు ఒక్కో రేటు ఫిక్స్ చేసుకుని మరీ వసూళ్లకు పాల్పప డుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని జీర్ణించుకోలేని కొందరు ఉద్యోగులు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలతో వీధికెక్కారు. మూడు డివిజన్‌లకు రెగ్యులర్ డిప్యూటీ డీఈఓలు లేకపోవడం, 58 మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈఓలే ఉండటంతో స్కూళ్ల అనుమతులు జారీ చేయడలో పెత్తనమంతా విద్యాశాఖదే అయింది.
మొక్కుబడి తనిఖీలు...
అనుమతి లేని పాఠశాలలు ప్రచారం చేస్తున్నాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే గానీ స్వతహాగా అధికారులు స్పందించడం లేదు. దామరచర్ల, కోదాడ, నాగార్జునసాగర్, చండూరు మండలాల్లో గుర్తింపు లేని పాఠశాలలు అడ్మిషన్లు తీసుకుంటున్నాయని ఫిర్యాదు చేయడంతో వాటిని అధికారులు సీజ్ చేశారు. వసతుల విషయానికొస్తే.. సరిపడా తరగతి గదులు, భవన నిర్మాణ నాణ్యత ధ్రువీకరణ పత్రం, ఆటస్థలం, లైబ్రరీ, ప్రహరీ, అగ్నిమాపక శాఖ జారీ చేసిన నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స, కంప్యూటర్ గది, సిబ్బంది గదులు, విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేకంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు కచ్చితంగా ఉండాలి. ఆ పాఠశాలలకే అనుమతి ఇవ్వాలని జీఓ నంబర్ 1 చెబుతోంది. దీంతో పాటు స్కూల్ భవనం ఒకటికి మించి పై అంతస్తులు ఉంటే గ్రిల్స్ ఏర్పాటు చేశారా..? లేదా..?అని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. జీఓ ఎం.ఎస్ నం.1, సెక్షన్ (1) 82 ప్రకారం అనుమతి లేకుండా విద్యాసంస్థల ప్రారంభం, ప్రచారం నేరం. విద్యాహక్కు చట్టం మేరకైతే అనుమతిలేని పాఠశాలలు ప్రచారం చేసినా, నిర్వహించినా కనీసం ఆరు నెలల జైలు శిక్ష, లక్ష రూపాయాల వరకు జరిమానా విధించాలి. కానీ జిల్లాలో ఈ స్థాయిలో ఇప్పటి వరకు సీజ్ చేసిన పాఠశాలల పై ఆ విధమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
అనుమతి లేని పాఠశాలలు లేవు : విశ్వనాథరావు, డీఈఓ
జిల్లాలో అనుమతి (గుర్తింపు) లేని ప్రైవేటు పాఠశాలలు లేవు. అలా ఏమైనా ఉంటే వాటిపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలల్లో అన్ని రకాల వసతులను పరిశీలించి రిపోర్ట్ పంపాల్సిన బాధ్యత ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓల పైనే ఉంది. డీఈఓ కార్యాలయంలో స్కూళ్ల అనుమతికి లంచాలు తీసుకుంటున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. అలా ఎవరైనా ప్రవ ర్తించినట్లు నాకు ఫిర్యాదు చేసినట్లయితే వారి పై తక్షణ మే చర్య తీసుకుంటాం.
అన్నిటికీ.. ఓకే..!
Published Sun, Jun 21 2015 11:57 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement