తక్కువ పన్ను విధానాన్ని పరిశీలించండి
* ‘నల్లధనం నియంత్రణ’పై లోక్‌సభలో కేంద్రానికి ఎంపీ పొంగులేటి సూచన
* ‘నల్లధనం’పై దర్యాప్తు సంస్థలను పటిష్టం చేయాలి
* పోలవరం ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించండి
* అక్కడి ఎమ్మెల్యేలను ఇరు రాష్ట్రాల ఎమ్మెల్యేలుగా పరిగణించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశం నుంచి సంపద తరలిపోకుండా ఉండేందుకు ‘తక్కువ పన్ను’ విధానాలను అమలుచేసే అవకాశాన్ని పరిశీలించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సమాజంలో సంపద సక్రమంగా పంపిణీ జరగని పక్షంలో అంతరాలు పెరుగుతాయని, అందువల్ల నల్లధనం నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించాలని ఆయన కోరారు. అలాగే పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండింట్లోనూ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
గురువారం లోక్‌సభలో నల్లధనం అంశంపై జరిగిన చర్చలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ‘‘అధ్యక్షా.. నల్లధనం అంశాన్ని మనం రెండు కోణాల్లో చూడాలి. దేశంలో ఉన్న నల్లధనం, విదేశాలకు తరలిపోయిన నల్లధనం.. బయటకు తరలిపోయిన నల్లధనమంటే అది పన్ను ఎగవేత వేసినది. ఇక్కడ పన్ను ఎగవేత ఒక్కటే కాదు.. దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన సంపదను బయటకు తరలించడం దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే అవుతుంది.
ప్రస్తుతం నల్లధనం అంశంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. అయితే నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఈ దిశగా ప్రయత్నాలు జరగలేదు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం 1948 నుంచి 2008 వరకు దాదాపు రూ. 30 లక్షల కోట్ల సొమ్ము దేశం నుంచి బయటకు వెళ్లిపోయింది. ముఖ్యంగా సరళీకరణ ఆర్థిక విధానాలు అవలంబించడం ప్రారంభించాక ఇది మరింత ఎక్కువైంది.
మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. స్విట్జర్లాండ్, సైప్రస్ వంటి దేశాలు తక్కువ పన్ను వసూలు చేసే దేశాలుగా ఉన్నాయి? అదే తరహాలో మన దేశంలో ఎందుకు పన్నులు తక్కువగా ఉండకూడదు? తక్కువ పన్నులు ఉండేలా చట్టాలు చేయండి.. నల్లధనం వెనక్కివచ్చేలా ప్రోత్సహించండి.. దానిని దేశ అభివృద్ధికి వినియోగించండి.. చట్టపరంగా నల్లధనం వెనక్కి తెప్పించడంలో వివిధ దేశాల్లో అనేక ఉదంతాలు ఉన్నాయి. మన దేశంలో కూడా అది అసాధ్యమేమీ కాదు. అయితే దర్యాప్తు సంస్థలు పటిష్టంగా ఉండాలి. సంపద సక్రమంగా పంపిణీ జరగని పక్షంలో సమాజంలో అంతరాలు పెరుగుతాయి. అందువల్ల నల్లధనంపై నియంత్రణ ఉండేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. పన్ను ఎగవేత కేసులను సత్వరం పరిష్కరించాలి..’’ అని పొంగులేటి పేర్కొన్నారు.
వారి సమస్యను ఎవరు పరిష్కరించాలి..
పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలను.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండింటిలోనూ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘ఏడు మండలాల్లో 211 గ్రామాలు, 34 వేల కుటుంబాలు ఉన్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు, వి.ఆర్.పురం, చింతూరు, కూనవరం, భద్రాచలం (ఆలయం మినహా), బూర్గంపాడు మండలాలను రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో విలీనం చేశారు.
ఈ ప్రాంతాలు ఇప్పుడు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఈ ప్రాంతాలు తెలంగాణలో ఉండడంతో ఇక్కడ ఎన్నికైన ఎమ్మెల్యేలు.. విభజన అనంతరం తెలంగాణకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ తర్వాత ఈ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యాయి. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వేలేరుపాడు నివాసి.. ఏడు ముంపు మండలాల్లో ఈ వేలేరుపాడు కూడా ఒకటి. ఆ ఏడు మండలాల ప్రజలు ప్రస్తుతం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల వద్దకు వారి విన్నపాలు తెస్తున్నారు. కానీ ఆ ప్రాంతాలు ఏపీలో ఉన్నాయి.
మరి వీరి సమస్యలను ఎవరు పరిష్కరించాలి? ఎన్నికల సంఘం ముందుకు ఇలాంటి సమస్య ఎప్పుడూ రాకపోయి ఉండొచ్చు కూడా. ముంపు ప్రజల కోసం ఆ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలను 2019 వరకు ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎమ్మెల్యేగా పరిగణించాలని కోరుతున్నా.’’ అని పొంగులేటి పేర్కొన్నారు.
వేధింపులపై చర్యలేవి?
పాఠశాలల్లో, యూనివర్సిటీల్లో విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేమిటని పొంగులేటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సంబంధించి గత మూడేళ్లలో నమోదైన కేసులు ఎన్నో తెలియజేయాలని లోక్‌సభలో కోరారు. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి రాంశంకర్ కథేరియా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. పాఠశాలలు, వర్సిటీల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులు పెరుగుతున్నట్టు తమకు ఎలాంటి నివేదికలు అందలేదని కథేరియా చెప్పారు.
ఢిల్లీలో విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ ఘటన తర్వాత అన్ని కళాశాలల్లో లైంగిక వివక్షపై చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని యూజీసీ నిర్ణయించిందన్నారు. అదేవిధంగా ఖాదీ అమ్మకాలకు సంబంధించి పొంగులేటి అడిగిన ప్రశ్నకు.. కేంద్ర సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్‌సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ భారత ఖాదీకి సంబంధించి అంతర్జాతీయ ట్రేడ్‌మార్క్ కోసం ఎలాంటి దరఖాస్తు చేయలేదని వెల్లడించారు.