'బ్లాక్ మనీ ఎంతుందో మాకూ తెలియదు'
'బ్లాక్ మనీ ఎంతుందో మాకూ తెలియదు'
Published Fri, Apr 7 2017 7:37 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
న్యూఢిల్లీ : బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రయిక్ ప్రకటిస్తూ ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కానీ రూ.500, రూ.1000 రద్దు అనంతరం ఎంత మొత్తంలో బ్లాక్ మనీ డిపాజిట్ కాకుండా బయటనే ఆగిపోయిందో తెలియదని ప్రభుత్వం ప్రకటించింది. నోట్ల రద్దు కాలంలో బ్యాంకుల్లో డిపాజిట్ కాని బ్లాక్ మనీ మొత్తం ఎంతన్నది అధికారిక అంచనాలు ఏమీ లేవని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ శుక్రవారం పార్లమెంట్ తెలిపారు. లోక్ సభకు రాతపూర్వక సమాధానంగా ఈ విషయాన్ని చెప్పారు.
2016 నవంబర్ 8 నుంచి 2016 డిసెంబర్ 30 మధ్యలో కాలంలో 23.87 లక్షల అకౌంట్లలో 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ అయినట్టు వెల్లడించారు. పాత, కొత్త కరెన్సీ నోట్ల డిపాజిట్ల వివరాలను వేరువేరుగా పొందపర్చలేదని పేర్కొన్నారు. అకౌంట్ బుక్స్ కరెక్ట్ చేయాలని ఏ బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీచేయలేదని మంత్రి చెప్పారు. 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లను ప్రీపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నోట్ల సప్లై విషయంలో ఏ బ్యాంకుకు తమ అసమర్థత చూపలేదని, నగదు ఇవ్వమని ఏ రోజు చెప్పన్నట్టు కూడా ఆర్బీఐ తెలిపినట్టు సంతోష్ కుమార్ గంగ్వార్ చెప్పారు.
Advertisement