మోదీ రె‘ఢీ’!
- పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో మాట్లాడుతారు
- క్లారిటీ ఇచ్చిన రాజ్‌నాథ్.. వెనుకకు తగ్గని ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు విషయమై పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిష్టంభన తొలగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రతిపక్షాలు కోరుకుంటే పార్లమెంటులో పెద్దనోట్ల రద్దుపై మాట్లాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సిద్ధంగా ఉన్నారని సంకేతాలు ఇచ్చింది. అయినా ప్రతిపక్షాలు ఈ ప్రకటనతో సంతృప్తి చెందలేదు. దీంతో లోక్‌సభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రధాని మోదీ సభకు రావాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం ప్రతిపక్ష సభ్యులైన మల్లిఖార్జున్ ఖర్గే (కాంగ్రెస్), సుదీప్ బందోపాధ్యాయ్ (టీఎంసీ), ములాయంసింగ్ యాదవ్ (ఎస్పీ) తదితరులు లోక్‌సభలో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుపై ఓటింగ్‌తో కూడిన వాయిదా తీర్మానాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే, అధికార పక్షం మాత్రం ఓటింగ్ లేని తీర్మానానికి మాత్రమే ఓకే చెప్తామని తెలిపింది. ఈ క్రమంలో లోక్‌సభలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ ఉద్దేశాన్ని ఎవరూ తప్పుబట్టడంగానీ, దురుద్దేశాలు ఉన్నాయనిగానీ ఎవరూ పేర్కొనడం లేదని అన్నారు.
అయితే, పెద్దనోట్ల రద్దు అమలు విషయంలో పలు పార్టీలు ఫిర్యాదులు, సూచనలు చేయాలని భావిస్తున్నాయని, వాటిని వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు కోరితే.. ప్రధాని సభకు వచ్చి చర్చలో జోక్యం చేసుకుంటారని రాజ్‌నాథ్ భరోసా ఇచ్చారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్‌పై దిగిరాకపోవడంతో సభ మంగళవారానికి వాయిదా పడింది.