మునుగోడు : గ్రామంలోని సమస్యలను వెలికితీసేందుకే గ్రామసదస్సులు నిర్వహిస్తున్నామని, గుర్తించిన సమస్యలను పరిష్కరించేంత వరకు విశ్రమించబోనని పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి చొల్లేటి ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని 7, 8, 9, 10 వార్డుల్లోని ప్రజలకు ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కోరారు. అప్పుడే గ్రామం ఆదర్శంగా మారుతుందన్నారు. ఎవరి కోసమే ఎదురుచూడకుండా తమ కోసం తాము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఉపాధిహమీ జాబ్‌కార్డు ఉండి మరుగుదొడ్డి లేనివారు నిర్మించుకుంటే వారికి ప్రభుత్వం నుంచి 9500 రూపాయలు అందిస్తామని చెప్పారు. జిల్లాలోనే మునుగోడు గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిద్దిదేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పలు చోట్ల మురుగు కాల్వలను పరిశీలించారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి ఎలాంటి దుర్వాసన రాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పందుల నర్సింహ, ఎంపీటీసీ సభ్యుడు పందుల భాస్కర్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ అన్వర్, ఏపీఓ బి.సుధాకర్, పీఆర్‌ఏఈ ఫ్రేజి, వార్డు సభ్యురాలు రావిరాల వనజ, పందుల మల్లేష్, గ్రామ కార్యదర్శి మురళి ఉన్నారు.