చుక్క నీటికీ చిక్కే!
⇒తాగునీటికి అల్లాడుతున్న గిరిజన తండాలు
⇒వర్షాలు లేక అడుగంటిన భూగర్భ జలాలు
⇒వేసవికి ముందే తాగునీటికి కటకట
కుల్కచర్ల: తండాల్లో అప్పుడే తాగునీటి ఎద్దడి మొదలైంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గిరిజనులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. కిలోమీటర్లకొద్దీ నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.కోట్లు విడుదల చేస్తున్నా.. సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉంటోంది. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో సుమారు పది గిరిజన తండాలు ఉండగా అందులో సగానికి పైగా తండాల్లో నీటి సమస్య ఉంది.
పరిగి నియోజకవర్గం పరిధిలో 150 వరకు గిరిజన తండాలు ఉండగా 100కు పైగా తండాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఈ నియోజకవర్గంలోని కుల్కచర్ల మండలంలో సుమారు 105కుపైగా తండాలున్నాయి. దాదాపు అన్ని తండాల్లో నీటి సమస్య ఉంది. తాండూరు పరిధిలో సుమారు 58 తండాలు ఉండగా 25 తండాల్లో తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో 11 తండాలు ఉండగా నాలుగు తండాలు, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో సుమారు 50 తండాలు ఉండగా 15 తండాలు, ఇబ్రహీంపట్నం నియోజక వర్గం పరిధిలో 29 తండాలు ఉండగా 12 తండాలు, వికారాబాద్ నియోజక వర్గం పరిధిలోని 65 తండాల్లో 19 తండాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
గుక్కెడు నీటికి ఎన్ని కష్టాలో..!
కుల్కచర్ల మండలంలో 29 గ్రామ పంచాయతీలు, 10 అనుబంధ గ్రామాలు, గుర్తింపు పొందిన తండాలు సుమారు 75, అధికారుల రికార్డుల్లో లేనివి 30 తండాల వరకు ఉన్నాయి. తాగునీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. పదేళ్లుగా స్వజల ధార పథకం కింద మినీ ట్యాంకులు, ఓవర్‌హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఒక్కో తండాలో రూ.3లక్షల నుంచి రూ. 6లక్షల వరకు వెచ్చించి ట్యాంకులను ఏర్పాటు చేసి, బోర్లు కూడా వేశారు. పైపులైన్లు లేకపోవడంతో ఈ ట్యాంకులు వృథాగా మారాయి.
ట్యాంకులకు కనెక్షన్లు ఇవ్వాలని గిరిజనులు అధికారుల చుట్టూ ఏళ్లతరబడి తిరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరికొన్ని తండాల్లో బోర్లు వెసి సింగల్ ఫేజ్ మోటార్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యుత్ ఉంటేనే నీళ్లు.. లేదంటే అంతే సంగతులు. ఎక్కడా చేతిపంపులు పనిచేయడం లేదు. నీటి కోసం వ్యవసాయ బావులు, చెరువులను ఆశ్రయించాల్సి వస్తోంది. కలుషిత నీరు తాగి ఇటీవల అడివి వెంకటాపూర్, చిన్నరామయ్య తండా, బింద్యంగడ్డ, చెరుముందలి తండా, గొరిగడ్డ, వెంకటాపూర్ తండా, నేర్లేల కుంట తండాల్లో ప్రజలు రోగాల బారిన పడ్డారు. చాలా తండాల్లో డెరైక్ట్ పంపింగ్ ఏర్పాటు చేశారు.
పగలు విద్యుత్ లేక పోవడం రాత్రుళ్లు తాగునీటి కోసం బోర్ల దగ్గరకు వెళ్లి విద్యుదాఘాతానికి గురవుతున్నారు. ఇటీవల కుస్మసముద్రం పంచాయితీ పరిధిలోని నాగమ్మగడ్డ తండాలో దేవేందర్ అనే విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. వేసవి కాలం రానేలేదు.. ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.