మున్సిపల్‌ పోరు: మీ పేరు ఉందా..? | The Process Of Getting A Voter ID Card For Municipal Elections | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ పోరు: మీ పేరు ఉందా..?

Published Thu, Jan 2 2020 8:34 AM | Last Updated on Thu, Jan 2 2020 8:34 AM

The Process Of Getting A Voter ID Card For Municipal Elections - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌తో పాటు ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా, కుల గణన ముసాయిదా జాబితాను ప్రకటించారు. వెంటనే జాబితాలో మీ పేరు ఉందా లేదా చూసుకోండి.. శాసన సభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేశాం కదా.. ఎక్కడికి పోతుందిలే అని అనుకోవద్దు.. ఇప్పటికే అనేక సార్లు ఓటరు సర్వే చేశారు. మీ పేరు తొలగించి ఉండవచ్చు. మున్సిపల్‌ ఎన్నికల్లో మీరు ఓటు వేయాలంటే మీకు ఓటు ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి.. వీటితో పాటు కొత్త వారికి ఓటు నమోదుకు కొంత సమయం ఉంది. వెంటనే నమోదు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. కొత్తగా ఓటర్‌ నమోదు చేసుకోవాలంటే ఈ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండితే చాలు. ఓటు నమోదు చేసుకుని ఈనెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పొందవచ్చు.

జనవరి 7 వరకు..
కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఈనెల 7న ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు నమోదు చేసుకుకే అవకాశం ఉంది. www. nvcp.in, www.ceotelangana.nic.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓటర్‌గా నమోదు చేసుకోచ్చు. దీనికి గాను ఫారం నంబర్‌–6ను పూరించి అప్‌లోడ్‌ చేయాలి. గత నెల 30వ తేదీన మున్సిపాలిటీల్లో ఓటర్‌ ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. వీటికి గత నెల 31 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 3వ తేదీన అభ్యంతరాలకు సమాధానాలు, వివరణ ఇస్తారు. 4న తుది జాబితా ప్రకటించి, 7న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఈలోపు ఓటర్‌గా నమోదు చేసుకోవడం మన ఓటు గల్లంతు అయితే వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకుంటనే వాటిని సరి చేస్తారు. గత ఓటర్ల జాబితా ప్రకటన సందర్భంగా పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని అరోపణలు వచ్చాయి. ఇంటి నంబర్లు ఒక డివిజన్‌లో ఉండి మీ ఓటు మరో డివిజన్‌లో ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకుని వస్తే సరిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.  2014వ ఎన్నికల సమయంలో 2,28,872 మంది ఓటర్లు ఉండగా 2019 ఎన్నికలు వచ్చే సరికి 2,72,194 మందికి పెరిగిపోయారు. గడిచిని 5 ఏళ్లలో 43,322 మంది ఓటర్లు కొత్తగా పెరిగారు. పార్లమెంట్‌ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 20,825 ఓటర్లు పెరిగారు. డివిజన్ల పునర్వీభజన ప్రకటించిన నాటి నుంచి 14,408 మంది ఓటర్లు పెరిగినట్లు గణనాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల నాటికి మరికొంత మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 

పోలింగ్‌ కేంద్రాలు మారినా..
సరాసరి ఒక పోలింగ్‌ కేంద్రంలో 800 ఓటర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇప్పటికే కరీంనగర్‌కు 1050, హుజూరాబాద్‌కు 150, జమ్మికుంటకు 150, చొప్పదండికి 66,  కొత్తపల్లికి 44 బ్యాలెట్‌ బాక్స్‌లు చేరుకున్నాయి. పోలింగ్‌ కేంద్రాల ముసాయిదాను 4న ప్రకటిస్తారు. 5 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తారు. అభ్యంతరాలను 9న ప్రకటించి మరునాడు పోలింగ్‌ కేంద్రాలకు కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తారు. తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాను 13న ప్రకటిస్తారు. 22న ఎన్నికలు నిర్వహించి 25న ఫలితాలు ప్రకటిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement