చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ప్రజల ఊపిరి అని, దాని భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని...
• ఓయూ భూములపై ఔటా అధ్యక్షుడు
• ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ప్రజల ఊపిరి అని, దాని భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వాటిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(ఔటా) పేర్కొంది. గురువారం ఇక్కడ ఓయూ గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, సభ్యులు సీనియర్ ప్రొఫెసర్ శేషగిరిరావు, మనోహర్‌రావు మాట్లాడారు. విజ్ఞాన దేవాలయంగా భాసిల్లుతున్న వర్సిటీ భూముల్లో ఒక అంగుళాన్నీ వదులుకోబోమని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాదిలో ప్రారంభంకానున్న వర్సిటీ శత వసంతాల ఉత్సవాల నేపథ్యంలో అన్యాక్రాంతమైన భూములంటినీ స్వాధీనం చేసుకుని తిరిగి వర్సిటీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘వర్సిటీకి అనుబంధంగా ఉన్న నిజామియా అబ్జర్వేటరీ భూమిలో సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నారు. ఈ భూమిని వర్సిటీ ఇవ్వలేదు. దీన్ని పరిరక్షించాల్సింది పోరుు.. నిర్మాణాలు చేపట్టడం ఏంటి?’ అని ప్రశ్నించారు. తక్షణమే అక్కడ నిర్మాణ పనులు నిలిపివేసి భూమిని వర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ‘ఓయూని రక్షిద్దాం - తెలంగాణను కాపాడుదాం’ నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు.