
మంగళవారం ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాలో మాట్లాడుతున్న కోదండరాం. చిత్రంలో మల్లు రవి
• రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
• సర్పంచుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
• ఆందోళనకు మద్దతు ప్రకటించిన సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు
సాక్షి, హైదరాబాద్: గ్రామ సర్పంచులకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన నిధులు, విధులు, అధికారాలను తక్షణం బదలాయిం చాలని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పంచాయితీ పెట్టుకోవడం తమ అభిమతం కాదని, ప్రజలకు సమస్యలు ఎదురైనప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత విద్యావంతులపై ఉందని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటను తాము అనుసరిస్తున్నామని చెప్పారు. తమ హక్కుల సాధన కోసం సర్పంచులు ఐక్యవేదికగా ఏర్పడి మంగళవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులను నమ్మినట్లే సర్పంచులను కూడా నమ్మి ప్రజలు ఎన్నుకున్నారని, ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను ప్రభుత్వంలో ఉన్నవాళ్లు దొంగలుగా చిత్రీకరించడమేమిటని ప్రశ్నిం చారు. సర్పంచులకు గతంలో ఎంతో గౌరవం ఉండేదని, వారికి ఉండాల్సిన నిధులు, విధులు, అధికారాలను ప్రభుత్వం కల్పించకపోవడంతో పరిస్థితి హీనంగా మారిందన్నారు. కేంద్రం ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు అంద కుండా చేయడం సరికాదన్నారు. కాగి తాలపై ఇచ్చినట్లు చూపి, నీటి సరఫరా, విద్యుత్ బిల్లుల పేరిట ప్రభుత్వమే నిధులను వెనక్కి లాక్కుంటోందన్నారు.
ఆందోళనకు దిగిన సర్పంచులను ప్రభుత్వం పిలిచి మాట్లాడితే బాగుండేదని, లేకుంటే ప్రభుత్వ ప్రతిష్టే దిగజారుతుందని అన్నారు. సర్పంచులకు ప్రభుత్వమిచ్చే రూ.5 వేల గౌరవ వేతనం నెలనెలా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముంపు గ్రామాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఈ నెల 29న రాజకీయ జేఏసీ తలపెట్టిన మహాధర్నాను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
గతంలో కన్నా ఎక్కువ ధర్నాలు...
తాము అధికారంలోకి వచ్చాక «ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదని సీఎం కేసీఆర్ అన్నారని, అయితే గత ప్రభుత్వాల హయాంలో కంటే ఇప్పుడే ఎక్కువగా ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. అధికారాలను సర్పంచులకు ఇవ్వకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ చేతుల్లోకి తీసుకుంటే గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గద్దె నెక్కిన ప్రభుత్వం ప్రజలను మర్చిపోయిం దని, ఫలితంగా ప్రజల మధ్య ఉండాల్సిన సర్పంచులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. గ్రామజ్యోతి పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ అభూతకల్పనను సృష్టించారని, గ్రామా నికి రూ.10 కోట్ల చొప్పున ఇస్తానని నేటికీ నయాపైసా ఇవ్వలేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను, ప్రజాప్రతినిధులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమంటే ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేయడమేన న్నారు. సర్పంచుల ఐక్యవేదిక ఆందోళ నకు తెలంగాణ జెడ్పీటీసీల ఫోరం మద్ధతు ఇస్తోందని గౌరవాధ్యక్షుడు ఏనుగు జంగా రెడ్డి ప్రకటించారు.
గ్రామానికి రూ.యాభై లక్షలా.. ఎక్కడ ఈటల సారూ..
రాష్ట్రంలో గ్రామానికి రూ.50 లక్షల చొప్పున నిధులను అందించామని ఆర్థిక మంత్రి ప్రకటించి అసెంబ్లీని సైతం తప్పు దోవ పట్టించారు. ఈ విషయమై విపక్షా లకు ఈటల విసిరిన సవాల్‌ను మేం స్వీకరిస్తాం. మంత్రి నియోజకవర్గంలో నైనా, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ఏ గ్రామ పంచాయతీౖకైనా ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు కాదు కదా.. రూ.200 వచ్చాయోమో నిరూపిస్తారా.
– ఆందోల్ క్రిష్ణ, సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు