హైదరాబాద్: సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర బహుజన నాయకులు, ఆర్య వైశ్య నాయకుల మధ్య విజయవాడలో జరిగిన ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. ఆదివారం ఇక్కడ టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐలయ్య మాట్లాడుతూ ‘సామాజిక స్మగ్లర్లు– కోమటోళ్లు’పుస్తకం టైటిల్ మారుస్తానని, అభ్యంతరకర విషయాలను తొలగిస్తానని, పుస్తకం రాసినందుకు క్షమాపణ చెబుతానని, భవిష్యత్తులో కులం గురించి విమర్శలు చేయబోనని ఒప్పందం కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను తాను ఖండిస్తున్నానని చెప్పారు.
ఈ పుస్తకంపై అక్టోబర్ 13న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎటువంటి చర్చకు ఆస్కారంలేదని అన్నారు. ఈ నెల 28న విజయవాడలో తలపెట్టిన కంచ ఐలయ్య సంఘీభావ, సామాజిక జేఏసీ సభకు వస్తున్నవారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభకు అనుమతి ఇవ్వకపోవటం భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవటమేనని విమర్శించారు.
సామాజికవేత్త ఉ.సాంబశివరావు మాట్లాడుతూ విజయవాడలో జరిగిన ఒప్పందానికి కంచ ఐలయ్య సంఘీభావ, సామాజిక జేఏసీకి ఎలాంటి సంబంధం లేదని, వారు చేసుకున్న ఒప్పందంలో జేఏసీ నాయకులు ఎవరూ లేరని అన్నారు. టీ మాస్ ఫోరం కన్వీనర్ జాన్‌వెస్లీ మాట్లాడుతూ కంచ ఐలయ్యకు సంఘీభావంగా తలపెట్టిన సభకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకుండా గృహనిర్బంధం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ఐలయ్య పుస్తకంపై మరోసారి సుప్రీంకు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్యవైశ్యులను కించపరిచేలా ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ సంఘం నేతలు వెల్లడించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా పుస్తకాన్ని రచించిన ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలువురు ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద ఆదివారం ధర్నా చేపట్టారు. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాయడం భావప్రకటన కిందకు రాదని, ఈ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment