కాజీపేట అర్బన్: నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతోనే అభివృద్ధి సాధ్యమని డీఎస్టీ మాజీ సెక్రటరీ డాక్టర్ టి.రామస్వామి తెలిపారు. కాజీపేటలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్‌లోని ఆడిటోరియంలో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్, నిట్ వరంగల్ సంయుక్తంగా ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు టీఎస్‌ఎస్‌సీ–18 సదస్సును నిర్వహిస్తున్నారు. తొలిరోజు సదస్సుకు ముఖ్య అతిథిగా రామస్వామి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ సైన్స్ కాంగ్రెస్–18 తోడ్పడుతోందని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీతో సమాజ మనుగడ సాధ్యమని.. విద్యార్థులకు సైన్స్‌పై మక్కువను పెంచేందుకు టీఏఎస్ కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు శాస్త్రవేత్తల పరిశోధనలపై అవగాహన కల్పిస్తూ.. ఆవిష్కరణలకు నాంది పలికే విధంగా వారికి స్ఫూర్తినందించాలని సూచించారు.
నూతన పరిశోధనలకు నాంది: నిట్ డైరెక్టర్
నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ నిట్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న టీఎస్‌ఎస్‌సీ–18లో నూతన పరిశోధనలకు నాంది పలికే విధంగా వివిధ దేశాల శాస్త్రవేత్తలతో పరిశోధనలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మీట్ ది సైంటిస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు, టీఎల్‌సీ ప్రొఫెసర్ అప్పారావు, ఇండో యూఎస్ అసుపత్రి వైద్యుడు ప్రసాదరావు హాజరై శాస్త్రవేత్తల పరిశోధనలపై స్ఫూర్తినిచ్చే సందేశాన్ని అందించారు. కాగా, టీఎస్‌ఎస్‌సీ–18 సావ నీర్, రిటైర్డ్ ప్రొఫెసర్ చాగంటి కృష్ణకుమారి రచించిన వీరి వీరి గుమ్మడి పండు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సదస్సులో టీఏఎస్ అధ్యక్షుడు కె.నరసింహారెడ్డి, సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్, నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్, డీన్‌లు కేవీ జయకుమార్, ఎల్‌ఆర్జీ రెడ్డి, ప్రొఫెసర్లు లక్ష్మారెడ్డి, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
పరిశోధనలతోనే ప్రగతి
Published Sun, Dec 23 2018 2:16 AM | Last Updated on Sun, Dec 23 2018 2:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment