పుష్కరస్నానాలకు ఇబ్బందులు ఏర్పడకుండా రాష్ట్రంలోని ప్రాజెక్టులనుంచి నీటిని విడుదల చేయనున్నామని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, జోగు రామన్న అన్నారు.
గోదావరిఖని/ధర్మపురి : పుష్కరస్నానాలకు ఇబ్బందులు ఏర్పడకుండా రాష్ట్రంలోని ప్రాజెక్టులనుంచి నీటిని విడుదల చేయనున్నామని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, జోగు రామన్న అన్నారు. గోదావరిఖని, ధర్మపురిలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. ధర్మపురిలో వీఐపీ పుష్కరఘాట్ పనులు రాత్రికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ రూ.600 కోట్లతో 106 చోట్ల పుష్కరఘాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పుష్కర స్నానాల కోసం గోదావరిలో నీరు తగినంత లేనందున ఎస్సారెస్పీ నుంచి 3 వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి 2వేల క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కులు నీరు విడుదల చేయనున్నామని వెల్లడించారు. మహారాష్ట్రలోని జైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవిస్‌తో సీఎం కేసీఆర్ చర్చించారన్నారు. గత పుష్కరాలకు 3 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని, ఈసారి 6 నుంచి 8 కోట్ల మంది హాజరయ్యే అవకాశముందని తెలిపారు. పనులు తుదిదశకు చేరుకున్నాయని, ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ 14న ఉదయం 6.21 గంటలకు ధర్మపురిలో పుష్కరస్నానం చేసి గోదావరి పుష్కరాలు ప్రారంభిస్తారని తెలిపారు.
‘హరిత ’ ప్రారంభం
టూరిజం శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి గోదావరి ఒడ్డున ఉన్న పాత సోమవిహార్ గెస్ట్ హౌస్ స్థలంలో కొత్తగా నిర్మించిన హరిత హోటల్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి మంత్రులు ప్రారంభించారు. రూ.3 కోట్లతో ఈ హోటల్ నిర్మించారు.
‘పున్నమి’ ప్రారంభం
వేములవాడ అర్బన్ : వేములవాడలో భక్తుల సౌకర్యార్థం రూ.3 కోట్లతో నిర్మించిన పున్నమి గెస్ట్‌హౌస్‌ను మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, టూరిజం శాఖ చైర్మన్ పేర్వారం రాములు శనివారం ప్రారంభించారు. తిప్పాపూర్‌లో దేవస్థానానికి చెందిన 13 ఎకరాల స్థలంలో ఈ గెస్ట్‌హౌస్ నిర్మించారు. ఇందులో నాలుగు సాధారణ, నాలుగు ఏసీ గదులు, రెండు డార్మెటరీ హాళ్లున్నాయి.
ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, పర్యాటకశాఖ ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య, ఎండీ క్రిస్టియానా జడ్‌చాంగ్డూ, పర్యాటక అధికారి సమ్మయ్య, ఇన్‌చార్జి ఈడీ మనోహర్, క్రాంతిబాయి, సుమిత్‌సింగ్, ఎంపీపీ మమత, అయ్యోరి రాజేశ్, సంగి సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.