అంగన్‌వాడీ టీచర్లు
అశ్వాపురం : ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పదోన్నతులపై ప్రకటన చేయడంతో అంగన్‌వాడీ టీచర్లలో ఆశలు చిగురించాయి. సీనియారిటీ ఉండి డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంటర్, పదో తరగతి విద్యార్హత ఉన్న అంగన్‌వాడీ టీచర్లు.. సూపర్‌వైజర్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం(ఐసీడీఎస్)లో సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లలో సీనియారిటీ, అర్హత ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు గ్రేడ్–2 సూపర్‌వైజర్లుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్య కార్యదర్శి శాంతికుమారిలతో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పదోన్నతులకు ఆమోదం తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో టీచర్లకున్న అనుభవాన్ని వినియోగించుకోవాలని, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం జీఓ కూడా జారీ చేసింది.
గ్రేడ్–2 సూపర్‌వైజర్లుగా..
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,434 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 626 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. మొత్తం 2,060 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 1,859 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 70 సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్‌వాడీ టీచర్‌గా పది సంవత్సరాలకు పైగా సర్వీసు ఉండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్హత ఉన్న వారికి గ్రేడ్–2 సూపర్‌వైజర్‌గా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 150 మంది అంగన్‌వాడీ టీచర్లు పది సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకొని డిగ్రీ ఆపైన చదువుకున్న వారు ఉన్నారు. సుమారుగా 1500 మంది అంగన్‌వాడీ టీచర్లు 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకొని పదో తరగతి ఆపైన చదువుకొని ఉన్నారు. ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియ చేపడితే జిల్లాలో వందల మంది అంగన్‌వాడీ టీచర్లకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది.
పదో తరగతి విద్యార్హత ఉన్నవారు అర్హులే
గతంలో అంగన్‌వాడీ టీచర్లు సూపర్‌వైజర్లుగా పదోన్నతులు పొందాలంటే సీనియారిటి ఉండి డిగ్రీ విద్యార్హత ఉండేది. దీంతో ఎంతో మంది టీచర్లు పదోన్నతులకు రాక టీచర్లుగానే కొనసాగుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా డిగ్రీ విద్యార్హతతోనే అంగన్‌వాడీ టీచర్లకు ప్రమోషన్లు కల్పించాలనుకున్నా...అంగన్‌వాడీ టీచర్లు, యూనియన్ల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పదో తరగతి విద్యార్హత ఉన్న వారిని పదోన్నతులకు అర్హులుగా అవకాశం కల్పిస్తూ జీఓ జారీ చేసింది. సీనియారిటీ ఉండి పదో తరగతి విద్యార్హత ఉన్న వారు కూడా గ్రేడ్–2 సూపర్‌వైజర్ పోస్టుల అర్హత పరీక్షకు హాజరుకావచ్చు. టెన్త్ విద్యార్హతతో గ్రేడ్–2 సూపర్‌వైజర్‌గా ఎంపికైన వారు ఎంపికైనప్పటి నుంచి ఐదేళ్లలోపు డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. సూపర్‌వైజర్‌గా ఎంపికైన తర్వాత డిగ్రీ ఉత్తీర్ణత అయ్యేలా ప్రభుత్వం అవకాశం కల్పించడంపై అంగన్‌వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయలేదు. ప్రమోషన్లకు సంబంధించి జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి, సీడీపీఓలకు ఎటువంటి సమాచారం లేదు.
ఆదేశాలు రాలేదు
అంగన్‌వాడీ టీచర్లకు పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఇటీవల ప్రభుత్వం అంగన్‌వాడీల పదోన్నతులకు జీఓ జారీ చేసింది. ప్రభు త్వం మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు జిల్లాలో అంగన్‌వాడీల పదోన్నతుల ప్రక్రియ చేపడతాం.
–ఝాన్సీలక్ష్మీబాయి, స్త్రీ శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment