చిట్యాల : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకంపై లబ్ధిదారులు విసుగెత్తి పోతున్నారు. నెలనెలకు పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో విమర్శ లకు తావిస్తోంది. ప్రతి నెల 5లోపు ఫించన్లు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో ఆమలు చేయడం లేదు. డబ్బుల కోసం ప్రతి రోజు పొస్టాపీసు చుట్టు తిరిగి లబ్ధిదారులు వేసారి పోతున్నారు. పింఛన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. మండలంలోని 60 గ్రామాలలో 588 మంది ఆసరాపథకంలో పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. మార్చి, ఏఫ్రిల్ నెల పింఛన్లు ఇప్పుడు ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. అలాగే వేలి ముద్ర వేసేందుకు గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని వికలాం గులు, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేసుకున్నారు.
రేగొండ : ప్రభుత్వం అసరా పథకంలో అందిస్తున్న పింఛన్ల కోసం వృద్ధులు, వికలంగాలు ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. పింఛన్లను పోస్టాఫీసు ద్వారా అందించడంతో వివిధ గ్రామాల నుంచి పోస్టాఫీసుకు చేరుకోవాలంటే తంటాలు పడాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గణపురం : ప్రతి నెల మొదటి వారంలో రావల్సిన పింఛన్లు నేలాఖరు కూడా రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటి వారం నుంచి చివరివారం వరకు ప్రతిరోజు పోస్టాఫీసు ముందు లబ్ధిదారులు మకాం వేస్తున్నారు. సకాలంలొ పింఛన్ల డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. మూడు నాలుగు నెలలు పింఛన్ల కోసం లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొత్తమందికి రెండు మూడు నెల డబ్బులు అందలేదు. ప్రతినెల మొదటి వారంలో పింఛన్లు పంపిణీ జరిగేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
ఒకటో తేదీనే పింఛన్ డబ్బులివ్వాలి
ప్రతినెల ఒకటో తేదీనే పింఛన్ల డబ్బులు ఇయ్యాలి. రోజుల తరబడి వృద్ధులను, వికలాంగులను తిప్పించుకోవద్దు. నాలుగు నెలల నుంచి పింఛన్ల కోసం చాలా కష్టాలు పడుతున్నాం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బంది ఉంది. - చాతరాజు రాంచంద్రయ్య, గణపురం
పింఛన్‌కు ఎండలో వెళ్తున్నాం
ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ సక్రమంగా అందించక పోవడంతో పింఛన్ వచ్చిందా లేదా అని తెలుసుకునేందుకు పోస్టాఫీసు అధికారుల వద్దకు ఎండను లెక్క చేయకుండా 2కి.మీ వెళుతున్నాం. పింఛన్ వస్తే తెచ్చుకుంటున్నాం. లేకుంటే వెనుతిరుగుతున్నాం. -పున్నం కొమురమ్మ, రావులపల్లి (రేగొండ)
ఐదో తారీఖు లోపే ఇవ్వాలి
ఫించన్ డబ్బుల కోసం చాల ఇబ్బందులు పడుతున్నాం. నెల తప్పినెల డబ్బులు వస్తున్నాయి. వచ్చె డబ్బులు కూడ నెల చివరి వారంలో వస్తున్నాయి. డబ్బుల కోసం పొస్టాఫీసు కు ప్రతి రోజు పోయి వస్తున్నాం. మాకు ఫించన్ డబ్బులు ప్రతి నెల 5న ఇవ్వాలి.
- భీమారం ఓదెలు, అంధుడు, చిట్యాల