Support scheme
-
ఒంటరి స్త్రీలకూ ‘ఆసరా’!
నేడు అసెంబ్లీలో సీఎం ప్రకటించే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒంటరి స్త్రీలకు కూడా ‘ఆసరా’పథకం కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శాసనసభలో విధానపరమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎటువంటి ఆదరణకు నోచుకోని జోగినులు, విడాకులు పొందిన వారు, పెళ్లికాని మహిళలు.. ఒంటరి స్త్రీల కేటగిరీలోకి వస్తారు. ఇటువంటి వారికి ఆసరా పథకాన్ని వర్తింపజేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నందున, గత కొన్ని నెలలుగా కసరత్తు చేసిన అనంతరం ప్రభుత్వం సాను కూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు ఒంటరి స్త్రీలు సుమారు 4లక్షల మంది వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. వీరందరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందిస్తే, ప్రస్తుతం ఆసరా పథకానికి వెచ్చిస్తున్న రూ.394కోట్లకు తోడు మరో రూ.40కోట్ల భారం పడనుందని అధికారులు లెక్కలు తేల్చారు. -
‘ఆసరా’ అస్తవ్యస్తం
చిట్యాల : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకంపై లబ్ధిదారులు విసుగెత్తి పోతున్నారు. నెలనెలకు పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో విమర్శ లకు తావిస్తోంది. ప్రతి నెల 5లోపు ఫించన్లు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో ఆమలు చేయడం లేదు. డబ్బుల కోసం ప్రతి రోజు పొస్టాపీసు చుట్టు తిరిగి లబ్ధిదారులు వేసారి పోతున్నారు. పింఛన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. మండలంలోని 60 గ్రామాలలో 588 మంది ఆసరాపథకంలో పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. మార్చి, ఏఫ్రిల్ నెల పింఛన్లు ఇప్పుడు ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. అలాగే వేలి ముద్ర వేసేందుకు గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని వికలాం గులు, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. రేగొండ : ప్రభుత్వం అసరా పథకంలో అందిస్తున్న పింఛన్ల కోసం వృద్ధులు, వికలంగాలు ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. పింఛన్లను పోస్టాఫీసు ద్వారా అందించడంతో వివిధ గ్రామాల నుంచి పోస్టాఫీసుకు చేరుకోవాలంటే తంటాలు పడాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గణపురం : ప్రతి నెల మొదటి వారంలో రావల్సిన పింఛన్లు నేలాఖరు కూడా రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటి వారం నుంచి చివరివారం వరకు ప్రతిరోజు పోస్టాఫీసు ముందు లబ్ధిదారులు మకాం వేస్తున్నారు. సకాలంలొ పింఛన్ల డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. మూడు నాలుగు నెలలు పింఛన్ల కోసం లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొత్తమందికి రెండు మూడు నెల డబ్బులు అందలేదు. ప్రతినెల మొదటి వారంలో పింఛన్లు పంపిణీ జరిగేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకటో తేదీనే పింఛన్ డబ్బులివ్వాలి ప్రతినెల ఒకటో తేదీనే పింఛన్ల డబ్బులు ఇయ్యాలి. రోజుల తరబడి వృద్ధులను, వికలాంగులను తిప్పించుకోవద్దు. నాలుగు నెలల నుంచి పింఛన్ల కోసం చాలా కష్టాలు పడుతున్నాం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బంది ఉంది. - చాతరాజు రాంచంద్రయ్య, గణపురం పింఛన్‌కు ఎండలో వెళ్తున్నాం ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ సక్రమంగా అందించక పోవడంతో పింఛన్ వచ్చిందా లేదా అని తెలుసుకునేందుకు పోస్టాఫీసు అధికారుల వద్దకు ఎండను లెక్క చేయకుండా 2కి.మీ వెళుతున్నాం. పింఛన్ వస్తే తెచ్చుకుంటున్నాం. లేకుంటే వెనుతిరుగుతున్నాం. -పున్నం కొమురమ్మ, రావులపల్లి (రేగొండ) ఐదో తారీఖు లోపే ఇవ్వాలి ఫించన్ డబ్బుల కోసం చాల ఇబ్బందులు పడుతున్నాం. నెల తప్పినెల డబ్బులు వస్తున్నాయి. వచ్చె డబ్బులు కూడ నెల చివరి వారంలో వస్తున్నాయి. డబ్బుల కోసం పొస్టాఫీసు కు ప్రతి రోజు పోయి వస్తున్నాం. మాకు ఫించన్ డబ్బులు ప్రతి నెల 5న ఇవ్వాలి. - భీమారం ఓదెలు, అంధుడు, చిట్యాల -
ఆసరా అభాసుపాలు!
* పథకం అమల్లో భారీ అవకతవకలు, అక్రమాలు * 30 లక్షల మందికి మంజూరైనా అర్హులు ఇంకా లక్షల్లోనే * గత ప్రభుత్వంలో పింఛన్ల లబ్ధిదారులు.. 29.11 లక్షలు * ‘ఆసరా’కు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు.. 39.62 లక్షలు * ఇప్పటివరకూ మంజూరైన పింఛన్లు.. 30.76 లక్షలు * ఇందులో అనర్హుల సంఖ్య 20 % (దాదాపు 6.15 లక్షలు) * ఒక్క కరీంనగర్ జిల్లాలో బోగస్ లబ్ధిదారులు.. 11,908 రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆసరా’ పథకం నిండా అభాసుపాలవుతోంది. ఇంతకుముందు కంటే ఎక్కువ మందికి ‘ఆసరా’ కల్పిస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంటున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. సిబ్బంది కక్కుర్తి, సాంకేతిక తప్పిదాలు, స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో అసలైన అర్హులకు పింఛన్లు అందడం లేదు. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో అనర్హులు పింఛన్లు పొందుతున్నారు. పింఛన్ల మంజూరు, పంపిణీలోనూ తీవ్రంగా అవకతవకలు చోటుచేసుకొంటున్నాయి. తప్పుడు సదరం ధ్రువపత్రాలు ఇస్తూ ప్రభుత్వ వైద్యులూ ఈ అక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ఇప్పటివరకూ 30 లక్షలకుపైగా పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసినా... ఇంకా లక్షల మంది అర్హులకు పింఛన్లు అందకపోవడం పరిస్థితి కళ్లకు కడుతోంది. - సాక్షి నెట్వర్క్ రాష్ట్రంలో ఆసరా పథకం నిండా లోటుపాట్లతో కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అనర్హులు పింఛన్ తీసుకుంటున్నారు. అన్ని అర్హతలున్న వారికి మాత్రం ‘ఆసరా’ అందడం లేదు. దీనిని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలుపుతున్నారు. కొందరైతే కడుపు మండి అధికారులపై దాడులకు దిగుతున్నారు. తనకు పింఛన్ రాకపోవడానికి గ్రామ కారోబారే కారణమంటూ కరీంనగర్ జిల్లా ఖమ్మంపల్లికి చెందిన చంద్రయ్య శివరాత్రి రోజున ఆ కారోబార్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. దీనినిబట్టే పింఛన్ల మంజూరులో గందరగోళం, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లమవుతోంది. ‘ఆసరా’లో తప్పులు దొర్లాయని, తనిఖీ నిర్వహిస్తే 20 శాతానికిపైగా పింఛన్లు పోవడం ఖాయమని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే... మెదక్ జిల్లా ములుగు మండలం తున్కిబొల్లారం గ్రామానికి చెందిన మేకల రాములమ్మ భర్త చాలా ఏళ్ల కిందటే చనిపోయాడు. బంధువుల ఇంట్లో వితంతు పింఛన్ ఆధారంగా బతుకు వెళ్లదీస్తోంది. తాజాగా పింఛన్ కోసం వెళ్లిన ఆమెకు పంచాయతీ సిబ్బంది రూ. వెయ్యిలో రూ. 600 తగ్గించుకుని రూ. 400 ఇచ్చారు. ఇదేమిటని అడిగితే ‘ఇంటి పన్ను వసూలు జేసినం.. రశీదు ఇదిగో’ అంటూ చూపారు. అసలు ‘నాకు సొంతిల్లు లేదు.. బంధువుల ఇంట్లో ఉంటున్న గదా?..’ అంటే అధికారులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పరిస్థితి ఇది. ప్రజాప్రతినిధుల జోక్యం.. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తీవ్రంగా ఒత్తిడి వస్తుండటంతో విచారణ అధికారులు అనర్హుల తొలగింపుపై తర్జనభర్జన పడుతున్నారు. ప్రజా ప్రతినిధుల జోక్యాన్ని తగ్గిస్తే 20 శాతానికిపైగా అనర్హులను తొలగించవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు అందజేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సమస్యలివీ! ఆధార్‌కార్డుల్లో తప్పులు.. లింకేజీ సమస్య సమగ్ర సర్వేలో దొర్లిన పొరపాట్లు సిబ్బంది కక్కుర్తి.. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లు భారీ సంఖ్యలో అనర్హులకూ పింఛన్లు పన్నుల కింద జమచేసుకుంటున్న అధికారులు బయోమెట్రిక్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడం ఎన్నో అవకతవకలు.. పింఛన్ల పంపిణీలో చాలా చోట్ల అవకతవకలు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పింఛన్లో కొంత మినహాయించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డిసెంబర్, జనవరికి సంబంధించి రెండు నెలల పింఛన్‌ను ఇవ్వాల్సి ఉండగా... చాలా చోట్ల లబ్ధిదారులకు ఒక నెల సొమ్మును మాత్రమే చెల్లించి మిగతా డబ్బును కాజేసినట్లు అధికారులు నిర్వహించిన ర్యాండమ్ సర్వేలో వెల్లడికావడం గమనార్హం. పలు చోట్ల అధికారులు పింఛన్ సొమ్మును బలవంతంగా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటున్నారు. మరోవైపు బయోమెట్రిక్ విధానంలో పింఛన్ల పంపిణీని ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. కానీ తపాలా సిబ్బంది వద్ద ఉన్న పీవోటీడీ యంత్రాలకు ఏపీ ఆన్లైన్ నుంచి పింఛన్‌దారులు, సొమ్ము సమాచారం రాలేదు. అలా వస్తేనే పంపిణీ చేస్తారు. దీనికితోడు బయోమెట్రిక్ సిస్టమ్‌కు ఆన్లైన్ సమస్య వచ్చింది. పింఛన్ కోసం వెళ్లినవారికి ‘మిషన్’ పనిచేయడం లేదని సిబ్బంది చెబుతుండడంతో వెనుదిరుగుతున్నారు. ‘సాంకేతిక’ శాపం.. ఆధార్‌కార్డుల్లో దొర్లిన తప్పులు, సమగ్ర కుటుంబ సర్వేలో దొర్లిన పొరపాట్లు కారణంగా వేలాది మంది అర్హులు పింఛన్లకు దూరమయ్యారు. కళ్లముందే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నా, నడవలేని స్థితిలో ఉన్నా పింఛన్ మంజూరు కాక అధికారుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది కేవలం సాంకేతిక కారణాలవల్ల ‘ఆసరా’కు దూరమైనట్లు అధికారవర్గాల అంచనా. ఏరివేత షురూ: పింఛన్ల అక్రమాలపై నిర్వహించిన ర్యాండమ్ సర్వేలో ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. దాదాపు 50 వేల పైచిలుకు లబ్ధిదారులను అనర్హులుగా తేల్చారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 11,908 మంది బోగస్ లబ్ధిదారులున్నట్లు గుర్తించి.. వారికి పింఛన్లను నిలిపివేశారు. అధికారులు, డాక్టర్లు కుమ్కక్కై అనర్హులకు వేలల్లో సదరం ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు తేలింది. కరీంనగర్ జిల్లాలో అక్రమాలకు బాధ్యుడిని చేస్తూ డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. భిక్షమెత్తుకుంటున్నా కనికరమేది? ఈ వృద్ధురాలి పేరు దెయ్యాల ఎల్లమ్మ(70). మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్‌కు చెందిన ఆమెకు ఒక ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. గతంలో వృద్ధాప్య పింఛన్ అందేది. ఇప్పుడు ‘ఆసరా’ కింద దరఖాస్తు చేసుకున్నా పింఛన్ మంజూరు కాలేదు. దరఖాస్తు ఎందుకు తిరస్కరించారో అధికారులు చెప్పడం లేదు. ఆమెను పట్టించుకునే వారే లేక ఇక్కడి బస్టాండు ప్రాంతంలో భిక్షాటన చేస్తూ పొట్టపోసుకుంటోంది. మాణిక్యమ్మదీ దాదాపు అదే పరిస్థితి. బతికున్నా చంపేశారు! మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన ఎండీ. ఉస్మాన్ (30)కు పుట్టుకతోనే కాళ్లు చచ్చుబడి, చేతులు బలహీనంగా అయిపోయాయి. 89 శాతం వైకల్యం ఉన్నట్లుగా సదరం ధ్రువీకరణ పత్రాన్ని పొంది 2006 నుంచి వికలాంగ పింఛన్ తీసుకుంటున్నాడు. కానీ తరువాత ఉస్మాన్‌ను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధికారులను నిలదీయగా.. మరణించినట్లుగా కంప్యూటర్ జాబితాలో నమోదైందని చెప్పడంతో ఉస్మాన్ ఖిన్నుడయ్యారు. కళ్లకు కన్పిస్తున్నా పట్టించుకోరా? రంగారెడ్డి జిల్లా నల్లవెల్లికి చెందిన జిల్ల రామస్వామికి కొంతకాలం కింద జరిగిన ప్రమాదంలో కుడి కాలిని తీసేశారు. ఆయన భార్య నర్సమ్మకు చెవుడు. ఇద్దరూ సదరం క్యాంపునకు హాజరై పరీక్షలు చేయించుకున్నా.. ఇంతవరకు సర్టిఫికెట్ రాలేదు. తమకు పింఛన్ మంజూరు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. కళ్ల ముందు వైకల్యం కన్పిస్తున్నప్పడు ఇక సర్టిఫికెట్ కోసం ఒత్తిడి చేయడమెందుకని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ అధికారులు విన్పించుకోవడం లేదు. సర్టిఫికెట్ చూపినా పింఛన్ ఇవ్వరా? రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రానికి చెందిన కొత్త ఈశ్వరయ్య ఫ్లోరైడ్ వల్ల కాళ్లు వంకర పోయి వికలాంగుడిగా మారాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈశ్వరయ్యకు వికలాంగ సర్టిఫికెట్ కూడా ఇచ్చినా పింఛన్ మంజూరు కాలేదు. నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా... పింఛన్ వచ్చేది, రానిది కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. పింఛన్ మంజూరు కాకపోతే వృద్ధురాలైన తన తల్లికి భారంగా ఉండేకంటే ఆత్మహత్య చేసుకోవడమే మేలనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ఆసరా హైజాక్ !
అనర్హులకు పింఛన్లు ‘ఆధార్’ ఆధారంగా అక్రమాలు మార్పులు, చేర్పులతో మాయూజాలం దళారులుగా మారిన అధికారులు పలు ప్రాంతాల్లో వారే సూత్రధారులు ఆఫీసర్లు, నాయకులకు వేర్వేరు లెక్కలు మొన్న పరకాల.. ఇటీవల మొగుళ్లపల్లి... తాజాగా మరికొన్ని మండలాలు... ‘ఆసరా’లో అక్రమాల పరంపర ఇలా జిల్లాను చుట్టేస్తోంది. అధికార యంత్రాంగం ఎంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.... అక్రమాలకు అడ్డుకట్ట వేయలేక పోతోంది. కొత్త రకం అడ్డదారులతో అనర్హులు పింఛన్‌దారులుగా నమోదవుతుండగా... అర్హులకు అన్యాయమే ఎదురవుతోంది. కొన్ని చోట్ల మండలాధికారులే దళారుల అవతారం ఎత్తగా... పలు గ్రామాల్లో నాయకులు తమ వాక్చాతుర్యంతో ‘ఆసరా’ను హైజాక్ చేస్తున్నారు. చేసేది ఇలా.. ఆధార్‌కార్డుల్లో వయసు మార్చి... ప్రభుత్వ ఉద్యోగులున్నా ఏమార్చి... చిరునామాలో మార్పు చేసి ఒకే ఇంట్లో ఇద్దరిని చేర్చి... ‘సదరం’లో వైకల్య శాతం పెంచి... వ్యక్తికో రేటు అధికారులైతే ఒక్కరికి మొదటి నెల పింఛన్ నాయకులైతే రూ.2 వేల నుంచి రూ. 5 వేలు హన్మకొండ అర్బన్/పరకాల : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం లక్ష్యం తలకిందులవుతోంది. పింఛన్ల పంపిణీ అర్హులకు అందని ద్రాక్షగా మారగా... అనర్హులకు ఆసరాగా నిలుస్తోంది. అంతేకాదు.. దళారులుగా మారిన మండల అధికారులు, చోటామోటా నాయకులకు ఇది వరంగా మారుతోంది. అక్రమార్కుల చేతివాటంతో ఈ పథకంలో చీకటి కోణాలు అలుముకున్నాయి. తప్పుడు మార్గాల్లో చేతులు తడిపి ఆధార్‌కార్డులు, సదరం సర్టిఫికెట్లలో మార్పులు, చేర్పులు చేస్తుండడంతో ఈ పథకం పక్కదారి పడుతోం ది. పింఛన్ల మంజూరుకు ప్రస్తుత ప్రభుత్వం ఆ ధార్ నంబర్ తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో దళారులు ఆధార్ నుంచే అక్రమ తతంగానికి తెరలేపారు. ఆధార్‌లో ఉన్న వయసు, చిరునా మా మార్చేస్తున్నారు. ఆధార్ మాస్టర్ డాటాతో సంబంధం లేకుండా కొత్తగా మీ సేవా కేంద్రాల నుంచి తీసుకునే ప్రింట్‌పై మాత్రమే ఈ మా ర్పు కనిపిస్తోంది. ఈ విషయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు కీలకంగా పనిచేస్తున్నట్లు సమాచా రం. అధికారులు కూడా ఈ అక్రమ తతంగం గర్తించలేక పోతుండడంతో అనర్హులు... అర్హులుగా మారి పింఛన్ పొందుతున్నారు. ఈ దం దాకు సంబంధించి మీసేవ కేంద్రాల ఆపరేటర్లు ఒక్కొక్కరికి రూ.2 వేల వరకు ముడుతున్నట్లు సమాచారం. ఇటీవల మొగుళ్లపల్లి మండలంలో ని ఓ మీసేవా కేంద్రంపై స్థానిక తహసీల్దార్ చర్యలు తీసుకోవడం ఇందుకు నిదర్శనంగా ని లుస్తోంది. అధికారులైతే ఒక్కరికి మొదటి నెల పింఛన్, నాయకులైతే రూ.2 వేల నుంచి రూ. 5 వేల వరకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. పరకాల నుంచి హన్మకొండకు మారిన కేంద్రం గతంలో పరకాల పట్టణంలో ఓ ఇంటర్నెట్ సెంటర్లో ఆధార్ కార్డుల వయసును మార్చి ఇచ్చే కౌంటర్ ప్రారంభించారు. పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులకు తెలియడంతో నిర్వాహకులను అదుపులోకి తీసుకోని కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కొన్ని సెంటర్లలో నకిలీ ఆధార్‌కార్డుల సృష్టి సాగుతున్నట్లు సమాచారం. పరకాలలో నిఘా ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు హన్మకొండ సుబేదారిలోని ఓ ఇంటర్నెట్ సెంటర్‌కు సీన్ మారింది. రామకృష్ణాపూర్, సీతారాంపురం, కంఠాత్మకూర్ గ్రామాల నుంచి అధికసంఖ్యలో ప్రజలు హన్మకొండకు వచ్చి ఆధార్‌కార్డుల్లో మార్పులు చేసుకుంటున్నారు. సదరంలోనూ ఇదే తీరు. వికలాంగ ధ్రువీకరణలో భాగంగా నిర్వహిస్తున్న సదరం క్యాంపుల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. సదరం క్యాంపులో వికలాంగత్వ శా తం ఎక్కువ వేసేందుకు ఒక్కొక్కరికి రూ. 5వేలు పలుకుతున్నట్లు సమాచారం. 2012 క న్నా ముందు తేదీలతో చాలా వరకు సదరం సర్టిఫికెట్లు కొందరు నకిలీల చేతుల్లో ఉన్నట్లు అ ధికారులు ఇదివరకే గుర్తించారు. తాజాగా మరికొందరు వికలాంగత్వ శాతం పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పరిశీలన లేకుండానే మంజూరు వాస్తవానికి పింఛన్ మంజూరు విషయంలో ఆధార్ కార్డు ఉన్నట్లయితే దాని మాస్టర్ డాటాతో మంజూరు విషయంలో అధికారులు పరిశీలన చేయాలి. ఈపని క్షేత్రస్తాయిలో ఎంపీడీఓ వద్ద గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ జరగాలి. అయితే ఆధార్ కార్డుపై ఉన్న వివరాలే ప్రమాణికంగా అధికారులు మంజూరు ఇస్తున్నారు. లబ్ధిదారులు ఇచ్చిన ఆధార్ వివరాలు... సదరు వ్యక్తి ఆన్లైన్ ఆధార్ వివరాలు సరిచూడకపోవడం వల్ల అక్రమార్కులకు మేలు జరుగుతోంది. ఆధార్ మాస్టర్ డాటా పూర్తి స్థాయిలో అధికారుల వద్ద అందుబాటులో లేక పోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జిల్లాలో సమారు 34 లక్షల మంది ఆధార్ కార్డులు పొందితే... కేవలం 30 లక్షల మంది వివరాలు మాత్రమే మాస్టర్ డాటాలో అధికారుల వద్ద అందుబాటులో ఉన్నారుు. అక్రమార్కులపై చర్యలు తప్పవు ఆధార్ కార్డుల్లో డేట్ ఆఫ్ బర్త్ మార్పుల విషయం కొన్ని చోట్ల మా దృష్టికి వచ్చింది. వాటి విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ మార్చాలంటే తప్పని సరిగా స్థానిక తహసీల్దార్ జారీచేసిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఉండాలి. ఈవిషయంలో తహసీల్దార్లు, మీసేవా నిర్వాహకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక మాస్టర్ డాటాతో సంబంధం లేకుండా చేసే అక్రమాల విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో ఆధార్ మాస్టర్ డాటాతో సరిచూసినప్పుడు ఈ అక్రమాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు బండారం బయట పడుతుంది. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. త్వరలో అక్రమార్కులను వెలికి తీసి, చర్యలు తీసుకుంటాం. - రాము, డీఆర్ డీఏ పీడీ -
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి
వృద్ధ కళాకారుల పిటిషన్ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కౌంటర్ దాఖలుకు ఆదేశం హైదరాబాద్: ఆసరా పథకం కింద కల్లు గీత, చేనేత కార్మికులకు ఇస్తున్న విధంగా తమకూ 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వృద్ధ కళాకారులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, కరీంనగర్, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆసరా పథకం కింద కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నారని, తమకు మాత్రం వృద్ధుల కోటా కింద 65 ఏళ్లకు పెన్షన్ ఇచ్చేవిధంగా జీవో జారీ చేశారని, ఇది అన్యాయమని కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన వృద్ధ కళాకారులు కె.పోచయ్య, దారా సుందరమ్మ, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల పింఛన్ వయో పరిమితిని 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచిందని, దీంతో పలువురు కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా వ్యవహరించడం వివక్ష చూపడమే అవుతుందన్నారు. తమకు కూడా 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
ఆసరా నిబంధనలు సడలించాలి: ఎర్రబెల్లి
పాలకుర్తి: ఆసరా పథకం పింఛన్ల మంజూరులో నిబంధనలను మరింత సడలించాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పాల కుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, రాయపర్తి మండలాల్లో బుధవారం జరిగిన పింఛన్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ వాస్తవంగా వికలాంగులైన వారికి సర్టిఫికెట్ సమర్పించకున్నా... పింఛన్ మంజూరు చేయాలన్నారు. ఆధార్ కార్డులో వాస్తవ వయసు కన్నా... తక్కువ వయసు నమోదు కావడంతో కొందరికి పింఛన్లు మంజూరు కావడం లేదన్నారు. భర్త నిరాదరణకు గురైన వారికి సర్టిఫికెట్ తేవాలనే నిబంధన సరైంది కాదన్నారు. అర్హులైన వారికి సర్టిఫికెట్లు తప్పుగా ఉన్నాయనే నెపంతో మంజూరు నిలిపివేయకుండా.... స్థానిక అధికారులకే విచక్షణాధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఆసరా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఎర్రబెల్లి కోరారు. -
రెన్నెల్లది ఒకేసారి
15లోగా పింఛన్ల పంపిణీ ఇప్పటికే 50 శాతం పూర్తి జిల్లాలో దరఖాస్తులు 5.50 లక్షలు ఎంపికైన లబ్దిదారులు 3.07 లక్షలు ఇప్పటివరకు పంపిణీ 1.68 లక్షలు ఆసరా పథకం కింద అర్హులందరికీ ఈనెల 15లోగా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నేటినుంచి ఐదు రోజుల్లోగా జిల్లాలో లబ్దిదారులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. అక్టోబర్, నవంబర్ రెండు నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులను ఒకేసారి అందించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆసరా పథకంలో అర్హుల గుర్తింపులో అనేక లోపాలు తలెత్తాయి. గతంలో పింఛన్ పొందిన వారితో పాటు వేలాది మంది కొత్త వారిని అనర్హులుగా పేర్కొనడంతో ప్రజల్లో నిరసన పెల్లుబికింది. ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి పెరగడంతో ఆసరా పథకంపై సర్కారు పునరాలోచనలో పడింది. పింఛన్ మార్గదర్శకాలను మార్చడంతో పాటు అర్హులందరినీ లబ్దిదారులుగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం అనర్హులుగా పేర్కొన్న దరఖాస్తులను పునఃపరిశీలించింది. ఈ ప్రక్రియ ఓవైపు కొనసాగుతుండగానే కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తోంది. జిల్లాలో అన్ని రకాల పింఛన్ల కోసం 5.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు ఇందులో 3.07 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో యాభై శాతం మందికి ఇప్పటికే పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,68,415 మంది లబ్దిదారులకు రూ.24.35 కోట్ల నగదును పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 15లోగా పంపిణీ చేయాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 30,068 మంది లబ్దిదారులకు రూ.4.36 కోట్ల పెన్షన్ నగదు అందజేశారు. అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన రెండు నెలల పింఛన్ డబ్బులను ఒకేసారి లబ్దిదారులకు అందించారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు నెలకు రూ.1000, వికలాంగులకు నెలకు రూ.1500 చొప్పున నగదు రూపంలో అందజేశారు. జాబితాలో తిరస్కరించిన వారిని పునఃపరిశీలిస్తున్నారు. అర్హులైనప్పటికీ జాబితాలో చోటు కల్పించలేదంటూ జిల్లాలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అర్హత ఉన్నా జాబితాలో చోటు చేసుకోని వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తామంటున్నారు. -
‘ఆసరా’పై బెంగతో నలుగురు వృద్ధుల మృతి
సాక్షి నెట్వర్క్: ఆసరా పథకం జాబితా విడు దల చేయకపోవడంతో వృద్ధుల్లో ఆందోళన లు పెరుగుతున్నాయి. ఆసరా పథకం తమకు వర్తిస్తుందో.. లేదోనన్న బెంగతో వేర్వేరు జిల్లాల్లో నలుగురు వృద్ధులు మృతి చెందారు. వివరాలు... ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్‌కు చెందిన ఎగ్గడి మల్లయ్య(80) పింఛన్ పథకంలో పేర్లు తొలగిస్తున్నారనే ప్రచారంతో తన పేరు జాబితాలో ఉంటుందో లేదోనని బెంగపెట్టుకున్నాడు. అనారోగ్యానికి గురై వారం రోజు లుగా మంచం పట్టాడు. శనివారం వేకువ జామున మృతి చెందా డు. అయితే, మల్లయ్య కు పింఛన్ మంజూరైం దని ఎంపీడీవో శ్రీనివా స్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మానిక్‌భండార్‌కు చెందిన బెస్త నర్సుబాయి(68)కి పింఛన్ మంజూరైంది. ఈనెల 8 నుంచి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. నర్సుబాయికి డబ్బులు అందకపోవడంతో పింఛన్ వస్తుందో.. రాదోనని బెంగపెట్టుకుంది. శుక్రవారం అర్ధరాత్రి మనోవేదనతో గుండెపోటుతో మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా కీసన మండలం భోగారం గ్రామానికి చెందిన రొండ్ల మాసమ్మ(90)కి 3 నెలలుగా పింఛన్ రావడం లేదు. కొత్త పింఛన్ జాబితాలోనైనా తన పేరు ఉందో లేదోనని మాసమ్మ మనస్తాపం చెందింది. శనివారం వేకువ జామున గుండెపోటుతో మృతి చెందింది. నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం)మండలంలోని కప్రాయపెల్లికి చెందిన తుమ్మల బాల నర్సమ్మ (70) పింఛన్ వస్తుందో.. రాదోననే బెంగతో మృతి చెందింది. -
కొందరికేనా!?
ప్రభుత్వ పథకాలు నకిలీలకు అందకుండా సర్కారు కఠిన చర్యలు తీసుకుంది. ‘సమగ్ర సర్వే’ పేరిట జనాన్ని జల్లెడ పట్టింది. అసలు సిసలు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరించింది. అధికార యంత్రాంగం ఇంటిం టికీ తిరిగి సర్వే జరిపింది. పూర్తిస్థాయి నిఘా నేత్రాన్ని సారించి నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ మున్సి పాలిటీలు, గ్రామీణ ప్రాం తాలలో 2,03,314 మందిని మొదటి విడతగా అర్హులుగా ప్రకటించింది. సామాజిక పింఛన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించింది. అయినా లబ్ధిదారులను సందేహాలు వీడడం లేదు. -సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ ‘ఆసరా’పై అనుమానాలు * దరఖాస్తుదారులలో ఆందోళన * తొలి జాబితాలో చాలా మందికి దక్కని చోటు * మిగతా అర్జీలపై సాగుతున్న విచారణ * గతంతో పోలిస్తే పెరిగిన విన్నపాలు * పంపిణీని ప్రారంభించినా చేతికందని డబ్బులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సామాజిక భద్రత ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని సర్కారు శనివారం అట్టహాసంగా ప్రారంభించింది. అన్ని పథకాలలో నకిలీలను నివారించేందు కు ‘సమగ్ర సర్వే’ ఇంటింటి పరిశీలన తదితర కార్యక్రమాలను నిర్వహించిం ది. గత ప్రభుత్వం హయాంలో చెల్లించి న ఫించన్‌ను పెంచుతూ అర్హులకే అం దజేయాలని నిర్ణయించింది. ఆహార భద్రత, సామాజిక ఫించన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై 300 బృందాలు విచారణ జరిపాయి. ముందుగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనే త, గీత కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 3,78,920 దరఖాస్తులు రాగా 2,03,314 మందితో తొలి జాబితాను ప్రకటించారు. ఇందు లో 300 మందికి శనివారం కలెక్టరేట్ మైదానంలో అర్హత పత్రాలను అందజేశారు. వీరందరికీ ఈ నెల 15 నుంచి ఫించన్లు అందుతాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్ర కటించారు. అయితే, మిగిలిన 1,75,606 మంది పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతంతో పోలిస్తే పెరిగిన దరఖాస్తులు గత ప్రభుత్వం కూడ సామాజిక భద్రత పథకాలను అమలు చేసింది. జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన 2,76,118 మందికి నెల నెలా రూ.7,02,70,100 పంపిణీ చేసింది. ఇందులో పలువురు ‘బోగస్’ లబ్ధిదారులున్నారన్న ఫిర్యాదు లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికార పార్టీకి చెందినవారు ఇష్టారాజ్యంగా వ్య వహరించి అనర్హులకు కూడా లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బోగస్ లబ్ధిదారులను ఏరి వేసేందుకు పూనుకుంది. అందుకే ఫి ంచన్లు పొందుతున్నవారందరూ తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జిల్లావ్యాప్తంగా 3,78,920 దరఖాస్తు లు వచ్చాయి. అంటే, గతంతో పోలిస్తే 1,02,802 అర్జీలు ఎక్కువగా వచ్చాయన్నమాట. అధికారులు సోమవారం ప్ర కటించిన జాబితాలో 2,03,314 మంది ఉన్నారు. దీని ప్రకారం, ఏరివేతకు ముందు వరకు పింఛన్ పొందుతున్నవారితో పోలిస్తే 72,804 మంది తగ్గా రు. ఈ నేపథ్యంలో మిగిలిన 1,75,616 దరఖాస్తుల పరిశీలన అనంతరం ఇం కెంత మందిని అర్హులుగా ప్రకటిస్తారు? ఫింఛన్దారులు తగ్గుతారా? పెరుగుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని, అర్హుల వారు ఎంతమం ది ఉన్నా.. అందరికీ ఫించన్లు అందజేస్తామని చెబుతున్నా సందేహాలు వీడ డం లేదు. సాగుతున్న కసరత్తు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహారభద్రత, సామాజిక భద్రత ఫిం చన్లు తదితర దరఖాస్తుల నుంచి ఇంకా అర్హుల ఎంపికపై కసరత్తు జరుగుతుం దని అధికారులు చెబుతున్నారు. సెప్టెం బర్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ముందుగా చెప్పినా, 20 వరకు కొనసాగించారు. దీంతో ఊహించిన దానికంటే అధికం గా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఆహారభద్రత కింద 7,25,723, సామాజిక భ ద్రత ఫించన్ కోసం 3,78,9200, కుల ధ్రువీకరణకు 1,12,011, ఆదాయం 1,00,531, స్థానికత ధ్రువీకరణ కోసం 93,961 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై విచారణ జరిపేందుకు కలెక్టర్ రోనాల్డ్‌రోస్ 300 బృందాలను రంగలోకి దిం పారు. చాలా వరకు అధికారులు బాగా పని చేసినా, నిజామాబాద్ కార్పొరేషన్ లాంటిచోట అడుగడుగునా జాప్యం, నిర్లక్ష్యం కనిపించింది. సమీక్ష నిర్వహిం చిన కలెక్టర్ కార్పొరేషన్ ఇన్చార్జ్ కమీషనర్ మంగతయారుపై అసంతృప్తి వ్య క్తం చేశారు. ఆర్మూరు, కామారెడ్డి, బో ధన్ మున్సిపాలిటీల అధికారులను కూ డ మందలించారు. ఎట్టకేలకు శుక్రవా రం నాటికి సర్వే ముగిసిందనిపించిన అధికారులు మొదటి విడత జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘ఆసరా’ కొందరికా? అందరికా? అన్న చర్చ జరుగుతోంది. -
పరిగిలో వంద పడకల ఆస్పత్రి
పరిగి, పరిగి రూరల్: వెనుకబడి ఉన్న పరిగిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆసరా పథకంలో బాగంగా నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పరిగి సర్పంచ్ విజయమాల ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో , మండల పరిధిలోని సయ్యద్‌మల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ ప్రారంభ సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ శాఖ మంత్రితో మాట్లాడి పరిగి పంచాయతీ భవనానికి కోటి రూపాయలు మంజూరు చేయిస్తానన్నారు. తెలంగాణా ఆర్టీసీని దేశంలోనే ముందు వరుసలో నిలబెడతామని తెలిపారు. రూ. 150 కోట్లతో 500 బస్సులు, ఇందులో 100 ఏసీ బస్సులు త్వరలో కొనుగోలు చేసి ఆర్టీసీకి అందిస్తామన్నారు. ఈవారంలో పరిగి డిపోకు ఐదు బస్సులు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 1300 గ్రామాలకు రోడ్లులేని కారణంగా బస్సులు నడవడం లేదని గుర్తించామన్నారు. ఆ గ్రామాలన్నింటికి రోడ్లు వేసి బస్సులు నడుపుతామన్నారు. ఆర్అండ్బీ రోడ్ల కోసం రూ. 10 వేల కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్ల కోసం రూ.ఐదు వేలకోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆరు నుంచి తొమ్మిది నెల ల్లో ఈ రోడ్ల పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లాకు చెందిన నాలుగు పశ్చిమ నియెజకవ ర్గాల్లో ఉద్యానవన పంటలతో పాటు పాడి, పౌల్ట్రీ పరిశ్రమలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో చెరువుల పునరుద్దరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు, తాగు నీరు అందిస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో పరిగి నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు. వ్యవసాయానికి , గృహ అవసరాలకు 24 గంటల నిరంతర కరంటు ఇచ్చేవిధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 7కోట్ల రూపాయలను పింఛన్ల కోసం వెచ్చించగా కొత్త పింఛన్లతో రూ.27 కోట్లకు పెంచామన్నారు. జిల్లాలో 2.40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. పేదలకు ఇళ్లు, ‘కళ్యాణ లక్ష్మి’ పథకాలు వెంటనే ప్రారంభమవుతాయన్నారు. -
కొత్తూరుకు నేడు కేసీఆర్ రాక
మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఆసరా’ పథకం కింద చేపట్టిన పింఛన్ల పంపిణీని శనివారం జిల్లాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లాంఛనంగా ప్రారంభిస్తున్నారని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో సీఎం పర్యటనపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొత్తూర్ మండలంలోని నాట్కో ఫార్మా స్కూటికల్ దగ్గర ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశం దగ్గర బారికేడ్లతోపాటు, రోడ్ల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అర్అండ్బీ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్య లేకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లను చూసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్ఈకి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిందిగా అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డికి సూచించారు. సమావేశంలో జేసి ఎల్.శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్వో రాంకిషన్, డీఆర్డీఏ ఇన్చార్జి పీడీ రవీందర్, జెడ్పీ సీఈఓ నాగమ్మతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.