50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి | pension at the age of 50 should be given | Sakshi
Sakshi News home page

50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి

Published Thu, Dec 11 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

pension at the age of 50 should be given

వృద్ధ కళాకారుల పిటిషన్
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కౌంటర్ దాఖలుకు ఆదేశం

 
హైదరాబాద్: ఆసరా పథకం కింద కల్లు గీత, చేనేత కార్మికులకు ఇస్తున్న విధంగా తమకూ 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వృద్ధ కళాకారులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, కరీంనగర్, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆసరా పథకం కింద కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నారని, తమకు మాత్రం వృద్ధుల కోటా కింద 65 ఏళ్లకు పెన్షన్ ఇచ్చేవిధంగా జీవో జారీ చేశారని, ఇది అన్యాయమని కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన వృద్ధ కళాకారులు కె.పోచయ్య, దారా సుందరమ్మ, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల పింఛన్ వయో పరిమితిని 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచిందని, దీంతో పలువురు కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా వ్యవహరించడం వివక్ష చూపడమే అవుతుందన్నారు. తమకు కూడా 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement