ఆసరా అభాసుపాలు!
* పథకం అమల్లో భారీ అవకతవకలు, అక్రమాలు
* 30 లక్షల మందికి మంజూరైనా అర్హులు ఇంకా లక్షల్లోనే
* గత ప్రభుత్వంలో పింఛన్ల లబ్ధిదారులు.. 29.11 లక్షలు
* ‘ఆసరా’కు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు.. 39.62 లక్షలు
* ఇప్పటివరకూ మంజూరైన పింఛన్లు.. 30.76 లక్షలు
* ఇందులో అనర్హుల సంఖ్య 20 % (దాదాపు 6.15 లక్షలు)
* ఒక్క కరీంనగర్ జిల్లాలో బోగస్ లబ్ధిదారులు.. 11,908
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆసరా’ పథకం నిండా అభాసుపాలవుతోంది. ఇంతకుముందు కంటే ఎక్కువ మందికి ‘ఆసరా’ కల్పిస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంటున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. సిబ్బంది కక్కుర్తి, సాంకేతిక తప్పిదాలు, స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో అసలైన అర్హులకు పింఛన్లు అందడం లేదు. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో అనర్హులు పింఛన్లు పొందుతున్నారు. పింఛన్ల మంజూరు, పంపిణీలోనూ తీవ్రంగా అవకతవకలు చోటుచేసుకొంటున్నాయి. తప్పుడు సదరం ధ్రువపత్రాలు ఇస్తూ ప్రభుత్వ వైద్యులూ ఈ అక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ఇప్పటివరకూ 30 లక్షలకుపైగా పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసినా... ఇంకా లక్షల మంది అర్హులకు పింఛన్లు అందకపోవడం పరిస్థితి కళ్లకు కడుతోంది.
- సాక్షి నెట్‌వర్క్
రాష్ట్రంలో ఆసరా పథకం నిండా లోటుపాట్లతో కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అనర్హులు పింఛన్ తీసుకుంటున్నారు. అన్ని అర్హతలున్న వారికి మాత్రం ‘ఆసరా’ అందడం లేదు. దీనిని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలుపుతున్నారు. కొందరైతే కడుపు మండి అధికారులపై దాడులకు దిగుతున్నారు. తనకు పింఛన్ రాకపోవడానికి గ్రామ కారోబారే కారణమంటూ కరీంనగర్ జిల్లా ఖమ్మంపల్లికి చెందిన చంద్రయ్య శివరాత్రి రోజున ఆ కారోబార్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. దీనినిబట్టే పింఛన్ల మంజూరులో గందరగోళం, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లమవుతోంది. ‘ఆసరా’లో తప్పులు దొర్లాయని, తనిఖీ నిర్వహిస్తే 20 శాతానికిపైగా పింఛన్లు పోవడం ఖాయమని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.
సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే...
మెదక్ జిల్లా ములుగు మండలం తున్కిబొల్లారం గ్రామానికి చెందిన మేకల రాములమ్మ భర్త చాలా ఏళ్ల కిందటే చనిపోయాడు. బంధువుల ఇంట్లో వితంతు పింఛన్ ఆధారంగా బతుకు వెళ్లదీస్తోంది. తాజాగా పింఛన్ కోసం వెళ్లిన ఆమెకు పంచాయతీ సిబ్బంది రూ. వెయ్యిలో రూ. 600 తగ్గించుకుని రూ. 400 ఇచ్చారు. ఇదేమిటని అడిగితే ‘ఇంటి పన్ను వసూలు జేసినం.. రశీదు ఇదిగో’ అంటూ చూపారు. అసలు ‘నాకు సొంతిల్లు లేదు.. బంధువుల ఇంట్లో ఉంటున్న గదా?..’ అంటే అధికారులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పరిస్థితి ఇది.
ప్రజాప్రతినిధుల జోక్యం..
స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తీవ్రంగా ఒత్తిడి వస్తుండటంతో విచారణ అధికారులు అనర్హుల తొలగింపుపై తర్జనభర్జన పడుతున్నారు. ప్రజా ప్రతినిధుల జోక్యాన్ని తగ్గిస్తే 20 శాతానికిపైగా అనర్హులను తొలగించవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు అందజేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
సమస్యలివీ!
ఆధార్‌కార్డుల్లో తప్పులు.. లింకేజీ సమస్య సమగ్ర సర్వేలో దొర్లిన పొరపాట్లు సిబ్బంది కక్కుర్తి.. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లు
భారీ సంఖ్యలో అనర్హులకూ పింఛన్లు పన్నుల కింద జమచేసుకుంటున్న అధికారులు బయోమెట్రిక్ యంత్రాలు
సరిగా పనిచేయకపోవడం
ఎన్నో అవకతవకలు..
పింఛన్ల పంపిణీలో చాలా చోట్ల అవకతవకలు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పింఛన్‌లో కొంత మినహాయించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డిసెంబర్, జనవరికి సంబంధించి రెండు నెలల పింఛన్‌ను ఇవ్వాల్సి ఉండగా... చాలా చోట్ల లబ్ధిదారులకు ఒక నెల సొమ్మును మాత్రమే చెల్లించి మిగతా డబ్బును కాజేసినట్లు అధికారులు నిర్వహించిన ర్యాండమ్ సర్వేలో వెల్లడికావడం గమనార్హం. పలు చోట్ల అధికారులు పింఛన్ సొమ్మును బలవంతంగా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటున్నారు. మరోవైపు బయోమెట్రిక్ విధానంలో పింఛన్ల పంపిణీని ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. కానీ తపాలా సిబ్బంది వద్ద ఉన్న పీవోటీడీ యంత్రాలకు ఏపీ ఆన్‌లైన్ నుంచి పింఛన్‌దారులు, సొమ్ము సమాచారం రాలేదు. అలా వస్తేనే పంపిణీ చేస్తారు. దీనికితోడు బయోమెట్రిక్ సిస్టమ్‌కు ఆన్‌లైన్ సమస్య వచ్చింది. పింఛన్ కోసం వెళ్లినవారికి ‘మిషన్’ పనిచేయడం లేదని సిబ్బంది చెబుతుండడంతో వెనుదిరుగుతున్నారు.
‘సాంకేతిక’ శాపం..
ఆధార్‌కార్డుల్లో దొర్లిన తప్పులు, సమగ్ర కుటుంబ సర్వేలో దొర్లిన పొరపాట్లు కారణంగా వేలాది మంది అర్హులు పింఛన్లకు దూరమయ్యారు. కళ్లముందే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నా, నడవలేని స్థితిలో ఉన్నా పింఛన్ మంజూరు కాక అధికారుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది కేవలం సాంకేతిక కారణాలవల్ల ‘ఆసరా’కు దూరమైనట్లు అధికారవర్గాల అంచనా.
ఏరివేత షురూ:
పింఛన్ల అక్రమాలపై నిర్వహించిన ర్యాండమ్ సర్వేలో ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. దాదాపు 50 వేల పైచిలుకు లబ్ధిదారులను అనర్హులుగా తేల్చారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 11,908 మంది బోగస్ లబ్ధిదారులున్నట్లు గుర్తించి.. వారికి పింఛన్లను నిలిపివేశారు. అధికారులు, డాక్టర్లు కుమ్కక్కై అనర్హులకు వేలల్లో సదరం ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు తేలింది. కరీంనగర్ జిల్లాలో అక్రమాలకు బాధ్యుడిని చేస్తూ డీఆర్‌డీఏ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు.
భిక్షమెత్తుకుంటున్నా కనికరమేది?
ఈ వృద్ధురాలి పేరు దెయ్యాల ఎల్లమ్మ(70). మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్‌కు చెందిన ఆమెకు ఒక ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. గతంలో వృద్ధాప్య పింఛన్ అందేది. ఇప్పుడు ‘ఆసరా’ కింద దరఖాస్తు చేసుకున్నా పింఛన్ మంజూరు కాలేదు. దరఖాస్తు ఎందుకు తిరస్కరించారో అధికారులు చెప్పడం లేదు. ఆమెను పట్టించుకునే వారే లేక ఇక్కడి బస్టాండు ప్రాంతంలో భిక్షాటన చేస్తూ పొట్టపోసుకుంటోంది. మాణిక్యమ్మదీ దాదాపు అదే పరిస్థితి.
బతికున్నా చంపేశారు!
మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన ఎండీ. ఉస్మాన్ (30)కు పుట్టుకతోనే కాళ్లు చచ్చుబడి, చేతులు బలహీనంగా అయిపోయాయి. 89 శాతం వైకల్యం ఉన్నట్లుగా సదరం ధ్రువీకరణ పత్రాన్ని పొంది 2006 నుంచి వికలాంగ పింఛన్ తీసుకుంటున్నాడు. కానీ తరువాత ఉస్మాన్‌ను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధికారులను నిలదీయగా.. మరణించినట్లుగా కంప్యూటర్ జాబితాలో నమోదైందని చెప్పడంతో ఉస్మాన్ ఖిన్నుడయ్యారు.
కళ్లకు కన్పిస్తున్నా పట్టించుకోరా?
రంగారెడ్డి జిల్లా నల్లవెల్లికి చెందిన జిల్ల రామస్వామికి కొంతకాలం కింద జరిగిన ప్రమాదంలో కుడి కాలిని తీసేశారు. ఆయన భార్య నర్సమ్మకు చెవుడు. ఇద్దరూ సదరం క్యాంపునకు హాజరై పరీక్షలు చేయించుకున్నా.. ఇంతవరకు సర్టిఫికెట్ రాలేదు. తమకు పింఛన్ మంజూరు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. కళ్ల ముందు వైకల్యం కన్పిస్తున్నప్పడు ఇక సర్టిఫికెట్ కోసం ఒత్తిడి చేయడమెందుకని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ అధికారులు విన్పించుకోవడం లేదు.
సర్టిఫికెట్ చూపినా పింఛన్ ఇవ్వరా?
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రానికి చెందిన కొత్త ఈశ్వరయ్య ఫ్లోరైడ్ వల్ల కాళ్లు వంకర పోయి వికలాంగుడిగా మారాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈశ్వరయ్యకు వికలాంగ సర్టిఫికెట్ కూడా ఇచ్చినా పింఛన్ మంజూరు కాలేదు. నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా... పింఛన్ వచ్చేది, రానిది కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. పింఛన్ మంజూరు కాకపోతే వృద్ధురాలైన తన తల్లికి భారంగా ఉండేకంటే ఆత్మహత్య చేసుకోవడమే మేలనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.