ఆసరా నిబంధనలు సడలించాలి: ఎర్రబెల్లి
పాలకుర్తి: ఆసరా పథకం పింఛన్ల మంజూరులో నిబంధనలను మరింత సడలించాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పాల కుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, రాయపర్తి మండలాల్లో బుధవారం జరిగిన పింఛన్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ వాస్తవంగా వికలాంగులైన వారికి సర్టిఫికెట్ సమర్పించకున్నా... పింఛన్ మంజూరు చేయాలన్నారు.
ఆధార్ కార్డులో వాస్తవ వయసు కన్నా... తక్కువ వయసు నమోదు కావడంతో కొందరికి పింఛన్లు మంజూరు కావడం లేదన్నారు. భర్త నిరాదరణకు గురైన వారికి సర్టిఫికెట్ తేవాలనే నిబంధన సరైంది కాదన్నారు. అర్హులైన వారికి సర్టిఫికెట్లు తప్పుగా ఉన్నాయనే నెపంతో మంజూరు నిలిపివేయకుండా.... స్థానిక అధికారులకే విచక్షణాధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఆసరా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఎర్రబెల్లి కోరారు.