15లోగా పింఛన్ల పంపిణీ
ఇప్పటికే 50 శాతం పూర్తి
జిల్లాలో దరఖాస్తులు 5.50 లక్షలు
ఎంపికైన లబ్దిదారులు 3.07 లక్షలు
ఇప్పటివరకు పంపిణీ 1.68 లక్షలు
ఆసరా పథకం కింద అర్హులందరికీ ఈనెల 15లోగా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నేటినుంచి ఐదు రోజుల్లోగా జిల్లాలో లబ్దిదారులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. అక్టోబర్, నవంబర్ రెండు నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులను ఒకేసారి అందించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆసరా పథకంలో అర్హుల గుర్తింపులో అనేక లోపాలు తలెత్తాయి. గతంలో పింఛన్ పొందిన వారితో పాటు వేలాది మంది కొత్త వారిని అనర్హులుగా పేర్కొనడంతో ప్రజల్లో నిరసన పెల్లుబికింది. ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి పెరగడంతో ఆసరా పథకంపై సర్కారు పునరాలోచనలో పడింది. పింఛన్ మార్గదర్శకాలను మార్చడంతో పాటు అర్హులందరినీ లబ్దిదారులుగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం అనర్హులుగా పేర్కొన్న దరఖాస్తులను పునఃపరిశీలించింది. ఈ ప్రక్రియ ఓవైపు కొనసాగుతుండగానే కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తోంది. జిల్లాలో అన్ని రకాల పింఛన్ల కోసం 5.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు ఇందులో 3.07 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో యాభై శాతం మందికి ఇప్పటికే పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,68,415 మంది లబ్దిదారులకు రూ.24.35 కోట్ల నగదును పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 15లోగా పంపిణీ చేయాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశించారు.
మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 30,068 మంది లబ్దిదారులకు రూ.4.36 కోట్ల పెన్షన్ నగదు అందజేశారు. అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన రెండు నెలల పింఛన్ డబ్బులను ఒకేసారి లబ్దిదారులకు అందించారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు నెలకు రూ.1000, వికలాంగులకు నెలకు రూ.1500 చొప్పున నగదు రూపంలో అందజేశారు. జాబితాలో తిరస్కరించిన వారిని పునఃపరిశీలిస్తున్నారు. అర్హులైనప్పటికీ జాబితాలో చోటు కల్పించలేదంటూ జిల్లాలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అర్హత ఉన్నా జాబితాలో చోటు చేసుకోని వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తామంటున్నారు.
రెన్నెల్లది ఒకేసారి
Published Wed, Dec 10 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM
Advertisement
Advertisement