రెండు, మూడు కుటుంబాల కబంద హస్తాల్లో ఉన్న సినీ పరిశ్రమను రక్షించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్: రెండు, మూడు కుటుంబాల కబంద హస్తాల్లో ఉన్న సినీ పరిశ్రమను రక్షించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర చిత్ర పరిశ్రమ సంఘం ప్రతినిధులు గురువారం సచివాలయంలో వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పన్ను విధానం అశాస్త్రీయంగా ఉందని, అది బలవంతులు, ధనవంతులకే అనుకూలంగా ఉందని, ఈ స్లాబ్ విధానాన్ని తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
టికెట్ల ఆధారంగానే పన్నులు వసూలు చేయాలన్నారు. చిత్ర పరిశ్రమలో కార్పొరేట్ గుత్తాధిపత్యం పోవాలన్నారు. ఒక ప్రత్యేక కమిటీని వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిత్రాలకు, తెలంగాణ కళాకారులతో నిర్మించిన చిత్రాలకు పన్ను రాయితీ కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పరిశ్రమకు అనుకూల ప్రకటన చేయాలని కోదండరాం కోరారు.