రణరంగంగా మారిన జనగామ
జనగామ జిల్లా పోరు ఉద్రిక్తం
జనగామలో జిల్లా పోరు రణరంగంగా మారింది. జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయూలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, వ్యాపార, వాణిజ్య, కార్మిక వర్గాలతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు రహదారిని దిగ్బంధించారు. రాస్తారోకో కొనసాగుతుండగానే నిరసనకారులు ఆర్టీసీ బస్సుకు నిప్పంటించడంతో తీవ్ర అలజడి రేగింది. పోలీసులు లాఠీచార్జి చేసి అందరిని చెదరగొట్టారు. మంటలు ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాన్ని కూడా ఆందోళనకారులు అడ్డుకోవడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నిరసనలతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.
- జనగామ
* జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం
* బస్సుకు నిప్పంటించిన నిరసనకారులు
* 20 వాహనాలు ధ్వంసం.. పోలీసుల లాఠీచార్జి
జనగామ : జనగామను జిల్లాగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఇందులో భాగం గా జేఏసీ ఆధ్వర్యాన శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వగా.. ఉద్యమకారుల ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఏసీ తో పాటు వివిధ సంఘాల నాయకులు, స్థానికులు పెద్దసంఖ్యలో రోడ్డుపైకి చేరుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై నాలుగున్నర గంటల పాటు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
తొలుత ప్రకటించిన నూతన జిల్లాల జాబితాలో లేకున్నా నిర్మల్ జిల్లాకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉద్యమ కారుల ఆవేశం కట్టలు తెంచుకుంది. బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినా పెద్దసంఖ్యలో రహదారిపైకి చేరుకున్నారు. అలాగే, పోలీసుల కన్నుగప్పి ఉద్యమ చౌక్‌కు చేరుకున్న జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి ఆధ్వర్యాన రాస్తారోకోకు బైఠాయించారు.
ఇంతలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు చేరుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ మేరకు ఉద్యమ కారులు హైదరాబాద్ రహదారిలో ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటి వైపు పరుగులు తీయగా.. తేరుకున్న పోలీసులు వారిని నిలువరించేందుకు యత్నించారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి, సీఐ చెన్నూరి శ్రీనివాస్, తిరుపతి ఆధ్వర్యంలో ఎస్సైలు సంతోషం రవీందర్, శ్రీనివాస్‌తో పాటు సబ్ డివిజన్‌లోని పోలీసు బలగాలు అడ్డుకునేందుకు రాగా ఉద్యమకారులు వినకపోవడంతో లాఠీచార్జీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
మంటలు.. రాళ్లు
ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మేరకు జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ఇరవైకి పైగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే, జనగామ డిపోకు చెందిన బస్సు(ఏపీ 29జెడ్ 3141)కు నిప్పుపెట్టారు. హైదరాబాద్ బాలాజీ నగర్‌కు వెళ్లి వస్తున్న ఈ బస్సును రాస్తారోకో కారణంగా సాయినగర్ కాలనీ వద్ద నిలపగా.. గుర్తు తెలియని వ్యక్తులు బస్సులో పెట్రోలు డబ్బా విసిరేసి అంటించినట్లు డ్రైవర్ సీ.లక్ష్మారెడ్డి, కండక్టర్ సతీష్ తెలిపారు. అలాగే, జనగామ సీఐ శ్రీనివాస్ వాహనం అద్దాలతో పాటు నల్లగొండ జిల్లా నూతనకల్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ రజాక్ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. ఇంకా పలు ప్రైవేట్, ప్రభుత్వ వాహనాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.
ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసు బలగాలు
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటిని ముట్టడిస్తారని జేఏసీ ప్రకటించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులు మొహరించారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ఉద్యమకారులు రెండుసార్లు ప్రయత్నించారు. ఆర్టీసీ చౌరస్తా నుంచి కిలోమీటరున్నర దూరంలో ఉన్న ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టేందుకు ఉద్యమకారులు పరుగులు తీస్తుండగా పోలీసులు మరోసారి లాఠీలకు పని చెప్పారు. దీంతో యువకులు పక్కనే ఉన్న మల్లన్న ఆలయం వైపు వెళ్తుండగా పోలీసులు ద్విచక్రవాహనాలపై వెంబడించడంతో వారు పట్టాల వైపు వెళ్లారు.
ఇక ఎమ్మెల్యే ఇంటి వెనక నుంచి ముట్టడించేందుకు ఉద్యమ కారులు ప్రయత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు అటువైపు నిఘా వేయడంతో ఎవరూ ముందుకు వెళ్లలేకపోయారు. కాగా, జనగామను జిల్లా చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా శనివారం బంద్‌కు పిలుపునిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి తెలిపారు. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘనపురం, దేవరుప్పుల మండలాలతో పాటు మిగతా అన్ని మండలాల్లో బంద్ పాటించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.