separate district
-
ఉద్రిక్తంగా ‘పరకాల జిల్లా పోరాటం’.. పోలీసుల దాడి
పరకాల: రజాకార్లను తరిమికొట్టిన పోరాటాల గడ్డగా పేరొందిన పరకాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ‘పరకాల జిల్లా సాధన సమితి’ ప్రతినిధులు శనివారం ఆందోళన కొనసాగించారు. పది రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులు శనివారం పరకాల బంద్‌కు పిలుపునిచ్చారు. అఖిలపక్షం కూడా మద్దతు ప్రకటించింది. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. బంద్‌లో భాగంగా పరకాలలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ సందర్భంగా పోలీసులు వారిపై దాడులు చేశారు. వారి నిరసనను తీవ్రంగా అణచివేస్తున్న దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నారు. అఖిలపక్ష నాయకులను పిడిగుద్దులు గుద్దుతూ పోలీస్‌స్టేషన్‌కు లాకెళ్లారు. పోలీసుల దౌర్జన్యంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ మహేందర్ రెడ్డి తీరు సర్వత్రా ఆగ్రహం తెప్పిస్తోంది. ఉద్యమం నేపథ్యం పరకాల డివిజన్‌ను కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతోందని పరకాలవాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా అనుమకొండ జిల్లా ప్రస్తావన తెరపైకి వచ్చిన తర్వాత పరకాల రెవెన్యూ డివిజన్లో ఉన్న ఆత్మకూరు, శాయంపేట మండలాలను హనుమకొండలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మిగిలింది పరకాలలో దామెర, నడికూడా మండలాలు మాత్రమే. ఈ రెండు మండలాలతో పరకాలను రెవెన్యూ డివిజన్‌గా కొనసాగించడం సాధ్యపడుతుందా లేదా డివిజన్ కూడా కనుమరుగు చేస్తారా అనే అనుమానం ఏర్పడింది. ఈ సమయంలోనే రాష్ట్రంలో మళ్లీ జిల్లాల విభజన వార్తలు రావడంతో పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని ఉద్యమం చేస్తున్నారు. గతంలోనూ ఉద్యమం చేయగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లలేదనే ఆరోపణ ఉంది. అప్పట్లో కేవలం రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ హుజురాబాద్ జిల్లా ప్రకటిస్తారనే వార్తలు రావడంతో పరకాల జిల్లా ఉద్యమం ఊపందుకున్నది. అందులో భాగంగానే శనివారం పరకాల బంద్‌కు పిలుపునిచ్చారు. -
సిరిసిల్లలో ఉద్రిక్తత
సిరిసిల్ల: సిరిసిల్లను ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలు తీవ్రతరం దాల్చుతున్నాయి. సిరిసిల్లను జిల్లా కేంద్రం చేయాలని అన్ని పార్టీలు కదం తొక్కుతున్నాయి. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమకారులు ఐటీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉద్యమకారులను అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా.. తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
‘టీఆర్ఎస్ నేతలు రాజీనామా చేయాలి’
సిరిసిల్ల: సిరిసిల్లను జిల్లాగా వెంటనే ప్రకటించాలంటూ ఆందోళనలు ముమ్మరమయ్యాయి. టీఆర్ఎస్ నేతలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలంటూ గురువారం జిల్లా సాధన సమితి నేతలు సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ ఇంటిని ముట్టడించారు. అనంతరం స్థానిక మహాకాళి ఆలయం వద్దకు బోనాలతో తరలివెళ్లారు. కాగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పినట్లు సమాచారం రావడంతో ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. -
జనగామ జిల్లా కోరుతూ ర్యాలీ
జనగామ: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన 27 జిల్లాల జాబితాలో జనగామ పేరు లేకపోవడంతో.. ఆగ్రహించిన స్థానికులు ఆందోళనల బాటపట్టారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం అఖిలపక్షం ఆధ్యర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి జనగామను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ.. ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ఈ ర్యాలీలో అన్ని పార్టీల నాయకులతో పాటు న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ప్రశాంతంగా జనగామ బంద్
జనగామ: జనగామ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు మంగళవారం పట్టణంలో బంద్ విజయవంతంగా జరుగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. బంద్ కారణంగా జనగామ రోడ్లు నిర్మానుష్యంగా మరాయి. పార్టీల నేతలు, కార్యకర్తలు ర్యాలీలు, రాస్తోరోకోలు నిర్వహించారు. -
దద్దరిల్లిన కార్మికక్షేత్రం
సిరిసిల్ల: సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. జిల్లా కావాలని కోరుతూ.. అధికార, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు పోటాపోటీగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీంతో సిరిసిల్ల స్తంభించిపోయింది. నిరసన కారుల ప్రదర్శనలతో కార్మిక క్షేత్రం దద్దరిల్లింది. -
వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌జామ్
యాదగిరిగుట్ట : ఎన్‌హెచ్9 పై మంగళవారం భారీగా ట్రాఫిక్ జాం అయింది. జిల్లాల, మండలాల పునర్విభజన భాగంగా ప్రభుత్వం సోమవారం జిల్లాలతో కూడిన ముసాయిదాను విడుదల చేసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా యాదగిరిగుట్ట మండలం మూటకొండూరు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేశారు. మూటకొండూరు మండలంలో చిన్న కందకూరు గ్రామాన్ని కలపవద్దంటూ చిన్నకందకూరు గ్రామస్తులు వరంగల్-హైదరాబాద్ జాతీయరహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వారితో మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పుష్కరాలకు వెళ్లే వాహనాలకు దీని వల్ల ఇబ్బంది తలెత్తింది. -
కొనసాగుతున్న జనగామ బంద్
జనగామ: జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో శనివారం పట్టణంలో బంద్ కొనసాగుతోంది. వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. అధికార టీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీలు, సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. స్థానికంగా భారీ ర్యాలీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు చేపట్టారు. పట్టణంతో పాటు నియోజకవర్గంలోని బచ్చన్నపేట, మద్దూరు, నర్మెటలో కూడా బంద్ పాటిస్తున్నారు. -
సిరిసిల్లలో ఉద్రిక్తం
-
సిరిసిల్లలో ఉద్రిక్తం
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. సిరిసిల్ల పట్టణ బంద్ శనివారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆందోళన కారులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలను దహనం చేశారు. దీంతో పలువురు ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పట్టణంలోని వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు మూతబడ్డాయి. -
కావాలి..! వద్దు..!!
నిర్మల్‌ను జిల్లా చేయాల్సిందేనని కొందరు.. ప్రతిపాదన విరమించుకోవాలని మరికొందరు.. సీఎం నిర్ణయానికే కట్టుబడాలని నిర్ణయం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనని కొందరు.. నిర్మల్ జిల్లా ప్రతిపాదనను విరమించుకోని పక్షంలో ఆదిలాబాద్ ప్రాంతం మరింత వెనుకబడిపోతుందని మరికొందరు.. ఏజెన్సీ మండలాలతో కలిపి ఆసిఫాబాద్ కేంద్రంగా నాలుగో జిల్లా చేయాలని ఇంకొందరు.. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీ నేతలు తమ అభిప్రాయాలు, విజ్ఞప్తులను మంత్రివర్గ ఉపసం ఘం సమావేశంలో వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల స్థానిక డిమాండ్ల మేరకు నేతలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలుండడం గమనార్హం. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి వర్గ ఉపసంఘం పలు జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిర్మల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శోభాసత్యనారాయణగౌడ్, ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ప్రతిపాదనను విరమించుకోవాలని, ఆదిలాబాద్ నుంచి నిర్మల్‌ను విడదీయడంతో ఇక్కడి ప్రాంతం అభివృద్ధి మరింత కుంటుపడుతుందని మంత్రి జోగు రామన్న మంత్రివర్గ ఉప సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ మండలాలతో ఆసిఫాబాద్ కేంద్రంగా నాలుగో జిల్లా చేయాలని విజ్ఞప్తి కూడా ఉపసంఘం ముందుకు వచ్చింది. మండలాల సర్దుబాటుపైనా.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా మండలాల సర్దుబాటు, కొత్త మండలాల ఏర్పాటు అంశంపై ఉపసంఘం ముందు ప్రస్తావనకు వచ్చింది. జన్నారం మండలాన్ని నిర్మల్ జిల్లా పరిధిలోకి తేవాలనే ప్రతిపాదనను విరమించుకుని, మంచిర్యాల(కొమురంభీం) జిల్లాలో కలపాలని అభిప్రాయం వ్యక్తమైంది. కొమురంభీం నడయాడిన సిర్పూర్(యూ) మండలాన్ని కొమురంభీం జిల్లాలో కాకుండా, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉంచడం సరికాదని, ఈ మండలాన్ని మంచిర్యాల పరిధిలోకి తేవాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఖానాపూర్ నియోజకవర్గాన్ని రెండు, మూడు ముక్కలు చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌ను మొత్తంగా రెండు జిల్లాలకే పరిమితం చేయాలనే అభిప్రాయం ఎక్కువ మంది ప్రజాప్రతినిదులు, నేతలు వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం నిర్ణయానికి కట్టుబడాలని.. ఎవరికి వారు తమ అభిప్రాయాలు, విజ్ఞప్తులను వెల్లడించిన ప్రజాప్రతినిధులు, నేతలు జిల్లాల ఏర్పాటు, మండలాల సర్దుబాటు తదితర అంశాలపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిర్ణయానికి వదిలేయలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు అందరు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉంటామని మంత్రివర్గ ఉపసంఘం ముందు వెల్లడించారు. జ్ఞానసరస్వతీ జిల్లాగా పేరుపెట్టాలి భైంసా : కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్న నిర్మల్‌కు జ్ఞానసరస్వతీ జిల్లాగా నామకరణం చేయాలని ముథోల్ ఎమ్మెల్యే విఠ ల్‌రెడ్డి అభిప్రాయం వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్నారు. నిర్మల్‌ను జిల్లాగా చేసేందుకు ఉన్న కారణాలను వెల్లడించారు. ముథోల్ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్మల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. -
జనగామలో మరోసారి ఉద్రిక్తత
జనగామ: జనగామను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. తాజాగా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళనకు దిగిన జేఏసీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం కళ్లకు గంతలు కట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న స్పీకర్ మధుసూదనా చారి కాన్వాయ్‌ని అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నేటి నుంచి 48 గంటల జనగామ నిరవధిక బంద్ నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
నెరవేరనున్న‘నిర్మల్’ కల
మూడో జిల్లాగా సీఎం సుముఖం నిర్మల్‌రూరల్ : ఎట్టకేలకు నిర్మల్ జిల్లా కల నెరవేరనుంది. స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రాంగం.. నిర్మల్ సాధన సమితి పోరాటం ఫలించనుంది. ఈ ప్రాంత వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మూడో జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తంచేయడంపై సర్వత్రా హర్షం నెలకొంది. మరోవైపు దసరా నుంచే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాలని కేసీఆర్ పేర్కొనడంతో విభజన ప్రక్రియ వేగవంతమైంది. చారిత్రక ఖిల్లాగా, రాజకీయ కేంద్రంగా పేరొందిన నిర్మల్ నూతన జిల్లాగా కొత్తరూపు దిద్దుకోనుంది. ఇదివరకే కలెక్టర్ జగన్మోహన్, సీఎస్ రాజీవ్‌శర్మ ఇచ్చిన నివేదికలతోపాటు స్వయంగా గూగుల్ మ్యాప్ ద్వారా నిర్మల్ ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. ఈ మేరకు భౌగోళికంగా నిర్మల్‌ను జిల్లా చేయాల్సిన అవసరముందని గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కొత్తగా ఏర్పడనున్న కొమురంభీం(మంచిర్యాల) జిల్లా కేంద్రం ఈ ప్రాంతవాసులకు దూరభారం అవుతోంది. ఈ నేపథ్యంలో ముథోల్, ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాలతో పాటు బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ మండలాన్ని కలిపి మూడో జిల్లాగా నిర్మల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుబాటులోకి జిల్లా కేంద్రం.. మొదటి నుంచీ నిర్మల్ ప్రాంతవాసులకు జిల్లాకేంద్రం దూరభారంగానే ఉంది. ప్రధానంగా ముథోల్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆదిలాబాద్ వెళ్లాలంటే దాదాపు 160-180 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఏ చిన్నపనికైనా రెండురోజుల సమయం వృథా అవుతోంది. దీంతో అధికారిక కార్యక్రమాలు మినహాయించి ఏ పనికైనా ముథోల్వాసులు నిజామాబాద్‌కు వెళ్తుంటారు. ఇక్కడి నుంచి నిజామాబాద్ కేవలం 35-50 కిలోమీటర్లు మాత్రమే. అందువల్లే నిర్మల్‌ను జిల్లా చేయని పక్షంలో తమను నిజామాబాద్‌లో కలుపాలని స్థానికులు డిమాండ్ చేశారు. జోనల్ వ్యవస్థ పరంగా నిజామాబాద్ ఆరో జోన్లో వస్తుండడం, బాసర ప్రాంతాన్ని పక్కజిల్లాలో కలిపితే వచ్చే వ్యతిరేకతల నేపథ్యం కూడా నిర్మల్ జిల్లా ఏర్పాటుకు కలిసి వచ్చింది. ప్రధానంగా ముథోల్ నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే నిర్మల్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు కానుంది. జిల్లా కార్యాలయాల పరిశీలన.. గతకొన్ని రోజులుగా నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ఊహాగానాలు వస్తుండడం, ప్రభుత్వం సైతం ఆ దిశగా సూచనలు ఇస్తుండడంతో స్థానిక అధికారులు ముందుగానే జిల్లా కార్యాలయాల ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టరేట్ కోసం పరిశీలించారు. ఇక ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు నిర్మల్‌లోనే ఉన్నాయి. పంచాయతీ రాజ్, నీటిపారుదల, మత్స్యశాఖ, భూగర్భ జలవనరుల శాఖ, పే అండ్ అకౌంట్స్ తదితర శాఖల జిల్లా కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఇటీవలే రూ.మూడున్నర కోట్లతో ఆధునాతనంగా నిర్మించిన ఆర్డీఓ కార్యాలయం సైతం అందుబాటులో ఉంది. -
జనగామలో కొనసాగుతున్న బంద్
జనగామ: వరంగల్ జిల్లాలోని జనగామను ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా జేఏసీ పిలుపు మేరకు రెండో రోజు శనివారం కూడా బంద్ కొనసాగుతోంది. జిల్లా జేఏసీ ఆందోళనలో భాగంగా శుక్రవారం పట్ఠణంలో జరిగిన కార్యక్రమాల్లో ఆందోళనకారులు ఆర్టీసి బస్సును దహనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీఐ చెన్నూరి శ్రీనివాస్ తెలిపారు. బంద్ నేపథ్యంలో పట్టణంలోని వాణిజ్య, వ్యాపార సంస్థలతో పాటు విద్యాసంస్థలు కూడా మూతబడ్డాయి. యశ్వంత్‌పూర్ శివారులోని వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై పరిసర గ్రామాల ప్రజలు రాస్తారోకో చేశారు. దీంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళకారులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో సబ్‌డివిజన్‌లోని పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. శుక్రవారం జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు వరంగల్, మహబూబాబాద్, నర్సంపేట నుంచి అదనంగా పోలీసు బలగాలను జనగామకు రప్పించారు. దీంతో ఈ రోజు కూడా ఉత్కంఠ నెలకొంది. -
జనగామ జిల్లా పోరు ఉద్రిక్తం
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నం - లాఠీచార్జి... ఆర్టీసీ బస్సును తగలబెట్టిన ఉద్యమకారులు జనగామ: వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లా చేయాలన్న ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన జనగామ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ముందుస్తు అరెస్టులతో మరింత వేడి రగిలి, రణరంగంగా మారింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయూలని డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వచ్చారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, వ్యాపార, వాణిజ్య, కార్మిక వర్గాలతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు రహదారిని దిగ్బంధించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ఒక్కసారిగా ఉద్రిక్తం... శాంతియుతంగా జరుగుతున్న ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమకారులు కొంత మంది హైదరాబాద్ రహదారిలో ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుంటూ ఎమ్మెల్యే ఇంటివైపు వెళుతుండడంతో పోలీసులు పలుమార్లు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. జేఏసీ ప్రతినిధి ఆకుల సతీశ్‌ను బలవంతంగా జీపులో ఎక్కించుకున్న పోలీసులు... మరికొందరు యువకులను లాక్కెళ్లారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆందోళన కొనసాగుతుండగానే గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్ రోడ్డుపైనున్న జనగామ డిపో ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. మంటలా ర్పేందుకు వచ్చిన ఫైరింజన్‌ను మున్సిపల్ చైర్మన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, టీఆర్ఎస్, జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బస్సు పూర్తిగా తగలబడిపోయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ట్రాఫిక్ పెద్దఎత్తున నిలిచిపోరుుంది. కాగా, ఉద్యమకారులపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా శనివారం జనగామ నియోజకవర్గ బంద్ నిర్వహించనున్నట్టు జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి తెలిపారు. -
రణరంగంగా మారిన జనగామ
జనగామ జిల్లా పోరు ఉద్రిక్తం జనగామలో జిల్లా పోరు రణరంగంగా మారింది. జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయూలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, వ్యాపార, వాణిజ్య, కార్మిక వర్గాలతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు రహదారిని దిగ్బంధించారు. రాస్తారోకో కొనసాగుతుండగానే నిరసనకారులు ఆర్టీసీ బస్సుకు నిప్పంటించడంతో తీవ్ర అలజడి రేగింది. పోలీసులు లాఠీచార్జి చేసి అందరిని చెదరగొట్టారు. మంటలు ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాన్ని కూడా ఆందోళనకారులు అడ్డుకోవడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నిరసనలతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. - జనగామ * జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం * బస్సుకు నిప్పంటించిన నిరసనకారులు * 20 వాహనాలు ధ్వంసం.. పోలీసుల లాఠీచార్జి జనగామ : జనగామను జిల్లాగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఇందులో భాగం గా జేఏసీ ఆధ్వర్యాన శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వగా.. ఉద్యమకారుల ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఏసీ తో పాటు వివిధ సంఘాల నాయకులు, స్థానికులు పెద్దసంఖ్యలో రోడ్డుపైకి చేరుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై నాలుగున్నర గంటల పాటు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తొలుత ప్రకటించిన నూతన జిల్లాల జాబితాలో లేకున్నా నిర్మల్ జిల్లాకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉద్యమ కారుల ఆవేశం కట్టలు తెంచుకుంది. బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినా పెద్దసంఖ్యలో రహదారిపైకి చేరుకున్నారు. అలాగే, పోలీసుల కన్నుగప్పి ఉద్యమ చౌక్‌కు చేరుకున్న జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి ఆధ్వర్యాన రాస్తారోకోకు బైఠాయించారు. ఇంతలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు చేరుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ మేరకు ఉద్యమ కారులు హైదరాబాద్ రహదారిలో ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటి వైపు పరుగులు తీయగా.. తేరుకున్న పోలీసులు వారిని నిలువరించేందుకు యత్నించారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి, సీఐ చెన్నూరి శ్రీనివాస్, తిరుపతి ఆధ్వర్యంలో ఎస్సైలు సంతోషం రవీందర్, శ్రీనివాస్‌తో పాటు సబ్ డివిజన్లోని పోలీసు బలగాలు అడ్డుకునేందుకు రాగా ఉద్యమకారులు వినకపోవడంతో లాఠీచార్జీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మంటలు.. రాళ్లు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మేరకు జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ఇరవైకి పైగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే, జనగామ డిపోకు చెందిన బస్సు(ఏపీ 29జెడ్ 3141)కు నిప్పుపెట్టారు. హైదరాబాద్ బాలాజీ నగర్‌కు వెళ్లి వస్తున్న ఈ బస్సును రాస్తారోకో కారణంగా సాయినగర్ కాలనీ వద్ద నిలపగా.. గుర్తు తెలియని వ్యక్తులు బస్సులో పెట్రోలు డబ్బా విసిరేసి అంటించినట్లు డ్రైవర్ సీ.లక్ష్మారెడ్డి, కండక్టర్ సతీష్ తెలిపారు. అలాగే, జనగామ సీఐ శ్రీనివాస్ వాహనం అద్దాలతో పాటు నల్లగొండ జిల్లా నూతనకల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ రజాక్ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. ఇంకా పలు ప్రైవేట్, ప్రభుత్వ వాహనాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసు బలగాలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటిని ముట్టడిస్తారని జేఏసీ ప్రకటించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులు మొహరించారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ఉద్యమకారులు రెండుసార్లు ప్రయత్నించారు. ఆర్టీసీ చౌరస్తా నుంచి కిలోమీటరున్నర దూరంలో ఉన్న ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టేందుకు ఉద్యమకారులు పరుగులు తీస్తుండగా పోలీసులు మరోసారి లాఠీలకు పని చెప్పారు. దీంతో యువకులు పక్కనే ఉన్న మల్లన్న ఆలయం వైపు వెళ్తుండగా పోలీసులు ద్విచక్రవాహనాలపై వెంబడించడంతో వారు పట్టాల వైపు వెళ్లారు. ఇక ఎమ్మెల్యే ఇంటి వెనక నుంచి ముట్టడించేందుకు ఉద్యమ కారులు ప్రయత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు అటువైపు నిఘా వేయడంతో ఎవరూ ముందుకు వెళ్లలేకపోయారు. కాగా, జనగామను జిల్లా చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా శనివారం బంద్‌కు పిలుపునిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి తెలిపారు. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘనపురం, దేవరుప్పుల మండలాలతో పాటు మిగతా అన్ని మండలాల్లో బంద్ పాటించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. -
జనగామలో ఉద్రిక్తత
హైదరాబాద్: వరంగల్ జిల్లా జనగామలో ఉద్రిక్తత నెలకొంది. జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని గత కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం కొంతమంది ఆందోళనకారులు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అదుపు తప్పిన ఆందోళ కారులు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటలో పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై నిరసనకారులు భైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిపోయాయి. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
జనగామ జిల్లా కోసం మహాధర్నా
- రోడ్డుపై భైఠాయిస్తున్న ఉద్యమ కారులు - పదికిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు జనగామ: వరంగల్ జిల్లా జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో అధికారపార్టీ నేతలతో పాటు విపక్షాల నేతలు. వ్యాపార వర్గాలు, కార్మిక, విద్యార్థివర్గాలతో పాటు పలు సంఘాలు పాల్గొన్నాయి. జిల్లా ప్రకటించాలని దాదాపు పదివేల మంది సకల జనులు భారీ ర్యాలీగా జనగామ చౌరస్తా వద్దకు వచ్చారు. క్రమ క్రమంగా పెద్ద ఎత్తున జనం రావడంతో జాతీయ రహదారిపై మూడు గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు పది కిలో మీటర్ల మీర వాహనాలు నిలిచిపోయాయి. మాజీ టీసీసీపీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రోడ్డుపై బైటాయించారు. జనగామను జిల్లాగా ప్రకటించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మహాధర్నా భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు దశలవారీగా పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. -
శంషాబాద్‌ను జిల్లాగా ప్రకటించకుంటే..
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ భారీ ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు ఎయిర్పోర్ట్ దారిలో బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. శంషాబాద్‌ను జిల్లాగా ప్రకటించకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నాయకులు హెచ్చరించారు. -
మిర్యాలగూడను నల్గొండలోనే ఉంచాలి
వేములపల్లి: నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఉంచాలంటూ అఖిలపక్ష నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వేములపల్లిలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సంఘట నాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
కొనసాగుతున్నములుగు బంద్
ములుగు: వరంగల్ జిల్లా ములుగును జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్‌తో మంగళవారం ములుగులో బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా సాధన సమితి, అఖిలపక్షం, అన్ని కుల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ములుగు బంద్ జరుగుతోంది. వ్యాపారసంస్థలు, సినిమాహాళ్లు, హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
గద్వాల బంద్ ప్రశాంతం
గద్వాల: ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గద్వాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు పనిచేయటం లేదు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని గద్వాల జిల్లా సాధన సమితి నేతలు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి, నినాదాలు చేస్తున్నారు. -
రెండు నాల్కలు
జిల్లాలో అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరికి తోచినది వారు మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై ఒకే పార్టీ ప్రజాప్రతినిధులు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి నెట్టేయడం ఎంతవరకూ సమంజసమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదికూడా ఓ ప్రాంతానికి చెందిన మెజారిటీ ప్రజల మనోగతానికి సంబంధించిన అంశంపై తమకు నచ్చినట్టు మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. ఏమైనా అంటే తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారే కానీ, ప్రజాభిప్రాయాన్ని గౌరవించరా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఇటీవల కాలంలో అధికార తెలుగుదేశం పార్టీలో ఈ వింతపోకడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామం కోనసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్ విషయంలో స్పష్టమైంది. కోనసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్ అసెంబ్లీలో మంగళవారం రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రస్తావించారు. ఈ డిమాండ్‌పై సుమారు 20 నిమిషాల సేపు అనర్గళంగా మాట్లాడారు. కోనసీమలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ఆ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక జిల్లా అవసరమని, ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని సూచిస్తూ అసెంబ్లీలో తన వాణిని వినిపించారు. సరిగ్గా ఆ సమయానికి కొద్దిగా అటుఇటుగా అదే పార్టీకి చెందిన లోక్‌సభలో టీడీపీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం కోనసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తన పార్లమెంటరీ పరిధిలో అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోనసీమకు ప్రత్యేక జిల్లా అవసరం లేదని కుండబద్ధలు కొట్టారు. ‘విభజన’ అనంతరం ‘నియోజకవర్గాల పునర్విభజన’తో పెరిగే నియోజకవర్గాలతో ప్రత్యేక జిల్లాల అవసరం ఉండదని సూత్రీకరించారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే కానీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోదని కూడా చెప్పుకొచ్చారు. ఇలా ఓ ప్రధాన అంశంపై ఇరువురు నేతలు పరస్పర విరుద్ధంగా మాట్లాడడంపై పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.అసలు కోనసీమ ప్రత్యేక జిల్లా అనే డిమాండ్ ఇప్పటి మాట కాదు. దాదాపు ఒకటిన్నర దశాబ్దాలుగా ఇది నలుగుతూనే ఉంది. కోనసీమలోని 16 మండలాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్ 1999లో ప్రధానంగా తెరపైకి వచ్చింది. అంతకుముందు కూడా దీనిపై చర్చ జరిగినప్పటికీ, ఉద్యమరూపం దాల్చింది మాత్రం దివంగత జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా ఉండగానే. అప్పట్లో కోనసీమ అభివృద్ధి పేరుతో ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు ఈ ఉద్యమాన్ని తన భుజస్కందాలపై వేసుకొని కొంతకాలం నడిపించారు. 15 రోజుల పాటు ఉద్యమాన్ని నడిపించి, ఆమరణ దీక్ష ప్రకటించి బాలయోగి జోక్యంతో ఆనక విరమించుకున్న విషయం కోనసీమ వాసులకు గుర్తుండే ఉంటుంది. అనంతరం కాలగర్భంలో కలిసిపోయిన ఆ డిమాండ్ ఇటీవల తెలంగాణ నుంచి ఏడు మండలాలు ఆంధ్రలో విలీనమైన నేపథ్యంలో రంపచోడవరం కేంద్రంగా మన్యసీమ జిల్లా తెరపైకి రావడంతో మరోసారి చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఉభయ గోదావరి జిల్లాల్లో విలీన మండలాల్లో కలెక్టర్లు ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిచేసి, నివేదికను ప్రభుత్వానికి పంపిన అనంతరం జరిగిన కేబినెట్ భేటీలో ప్రత్యేక జిల్లా ప్రస్తావనంటూ ఏదీ లేదని సీఎం చంద్రబాబు కొట్టిపారేశారు. అంతటి ప్రక్రియ పూర్తయిన మన్య సీమ జిల్లా డిమాండే పక్కకుపోగా, ఇప్పుడు అకస్మాత్తుగా ఎమ్మెల్యే గొల్లపల్లి కోనసీమ జిల్లా డిమాండ్‌ను అసెంబ్లీలో ప్రస్తావించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రత్యేక జిల్లా డిమాండ్ తెరపైకి వచ్చి 1999లో గొల్లపల్లి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఉద్యమ రూపం దాల్చినప్పుడు కానీ, తాజాగా కోనసీమలో మరోసారి ఆందోళనకు సిద్ధపడినప్పుడు కానీ పెదవి విప్పని గొల్లపల్లి ఇంత అకస్మాత్తుగా అసెంబ్లీలో తన వాణి వినిపించడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రక్రియ అంతా పూర్తయిన మన్యసీమ జిల్లానే సీఎం కాదన్న తర్వాత ప్రభుత్వ స్థాయిలో ఎటువంటి ప్రతిపాదన లేని కోనసీమ జిల్లాపై గొల్లపల్లి లేవనెత్తిన డిమాండ్ అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. 1999లో ఆందోళనను ముందుండి నడిపించిన మెట్ల, తొలిసారి గొంతువిప్పిన గొల్లపల్లి ఇటీవల కోనసీమ జిల్లా కోసం ‘దగాపడ్డ చర్మకారుల మహాసభ’ అధ్యక్షుడు ఈతకోట తుక్కేశ్వరరావు అమలాపుంలో 72 గంటల దీక్ష చేపట్టినప్పుడు ఏమయ్యారని కోనసీమవాసులు ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి మెట్ల ప్రత్యేక జిల్లా కోసం తాజాగా ఆందోళనకు సిద్ధపడడం, మెట్లకు స్వయానా అల్లుడైన ఎంపీ తోట నరసింహం ప్రత్యేక జిల్లా అవసరం లేదనడం, అదే పార్టీ ఎమ్మెల్యే గొల్లపల్లి ప్రత్యేక జిల్లా కోసం అసెంబ్లీలో మాట్లాడడంపై కోనసీమవాసులు విస్మయానికి గురవుతున్నారు. ఒకేపార్టీలో ఉన్న వారంతా ఓ కీలకాంశంపై భిన్నమైన వాదనలు వినిపించడం కంటే, కోనసీమ మనోగతాన్ని ఆవిష్కరించే రీతిలో ఏకాభిప్రాయానికి రాకుండా అయోమయానికి గురి చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. -
‘మన్యసీమ’ జిల్లాకు సర్కార్ జెల్ల!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మన్యసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్ పదిహేనేళ్లుగా నలుగుతోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలన్నిటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని గిరిజనం డిమాండ్ చేస్తున్నారు. ఆయా జిల్లాల పరిధిలోని పార్వతీపురం, సీతంపేట, పాడేరు, భద్రాచలం, రంపచోడవరం, కేఆర్ పురం ఐటీడీఏలను విలీనం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే మావోయిస్టుల ప్రభావం నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై పాలకులు ఆసక్తి చూపలేదు. కానీ పోలవరం ముంపు మండలాల విలీనం నేపథ్యంలోనైనా తమ చిరకాల వాంఛ నెరవేరుతుందనుకున్నామని, ఇప్పుడూ తమ ఆశలపై నీళ్లు చల్లారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్యసీమ జిల్లా ఏర్పాటుకు సంబంధించి చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కొద్ది రోజుల కిందట ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. తూర్పుగోదావరి నుంచి మన్యసీమ జిల్లాకు ప్రజాభిప్రాయం సానుకూలంగా లభించిందని కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రభుత్వానికి నివేదించారు కూడా. ఇంత జరిగాక అసలు ఈ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనే తనకు తెలియదన్నట్టు సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్ భేటీలో పేర్కొనడంపై గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు తెలియకుండా సీఎస్ ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేపడతారనే ప్రశ్న ఈ సందర్భంగా వినిపిస్తోంది. ఆ మూడు మండలాలే.. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మైదాన ప్రాంతంలో ఉన్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాలను కూడా మన్యసీమ జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదించారు. గిరిజనేతరులు ఎక్కువగా ఉన్న ఈ మండలాలనే సాకుగా చూపించి మన్యసీమ జిల్లాకు అడ్డం పడ్డారని గిరిజన ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట ప్రతిపాదనలో లేని మైదాన ప్రాంత మండలాలను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకురావడం ద్వారా అసలు మన్యసీమ జిల్లానే లేకుండా చేశారని మన్యం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాల్లోని 10 గిరిజన మండలాలు, తెలంగాణ నుంచి గోదావరి జిల్లాల్లో విలీనమైన ఏడు మండలాలతో కలిపి 17 మండలాలతో మన్యసీమ జిల్లా ఏర్పాటు చేయాలనేది తొలి ప్రతిపాదన. కాగా తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ సబ్‌ప్లాన్ ఏరియాలోని శంఖవరం, కోటనందూరు, రౌతులపూడి మండలాలను దీనికి కలిపి, మొత్తం మండలాలను 20కి పెంచారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి మైదాన ప్రాంత మండలాలైన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురాలను కూడా ఆకస్మికంగా కలపడం.. మన్యసీమ జిల్లా ప్రతిపాదనలను నిర్వీర్యం చేయాలనే పాలకపక్ష నేతల ఎత్తుగడలో భాగమేనని గిరిజనులు విమర్శిస్తున్నారు. గిరిజనేతరుల్లో ఆందోళన మైదాన ప్రాంత మండలాలను మన్యసీమ జిల్లాలో కలిపితే ఆ పరిధిలోని భూములన్నీ ప్రత్యేక చట్టాల పరిధిలోకి వెళతాయి. తద్వారా గిరిజనేతరులు భూములపై హక్కులు కోల్పోతారు. 1/70 చట్టం అమలులోకి వచ్చి గిరిజనేతరులకు భూ బదలాయింపులు చెల్లుబాటు కావు. ఈ ఆందోళనతోనే గిరిజనేతరులు అక్కడి మంత్రి పీతల సుజాత సహా అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా సర్కార్‌పై ఒత్తిడి తీసుకువచ్చారని, తద్వారా మన్యసీమ జిల్లా ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోకుండా కేబినెట్‌ను ప్రభావితం చేయగలిగారని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో గిరిజన జనాభా 54 వేలు కాగా, గిరిజనేతరుల జనాభా లక్షా 65 వేలు ఉంది. కాగా, మైదాన ప్రాంతంలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లో 3.10 లక్షల జనాభా ఉండగా, అందులో 2 శాతం మాత్రమే గిరిజనులున్నారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా మైదాన ప్రాంత మండలాలు మూడింటినీ ప్రతిపాదిత మన్యసీమ జిల్లాలో విలీనం చేసేందుకు ఎలా ప్రతిపాదించారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద తమ 15 ఏళ్ల కల సాకారమవుతుందన్న ఆశ రాజకీయ ఎత్తుగడతో ఇంతలోనే ఆవిరైపోయిందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. -
గళం విప్పిన ‘ప్రత్యేక కోనసీమ’
అమలాపురం : కోనసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు రాజకీయ నేతలకు మాత్రమే పరిమితమైన ఈ డిమాండ్ జనబాహుళ్యంలోకి చొచ్చుకు వెళుతోంది. అన్నివర్గాల వారు కోనసీమను ‘ప్రత్యేక’ జిల్లా చేయాలని గళం విప్పుతున్నారు. ఉద్యమానికీ సై అంటున్నారు. మన్యసీమ పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీని తరువాత కోనసీమ జిల్లాను ఏర్పాటు చేయాలనే నినాదం మరింత విస్తృతమవుతోంది. తూర్పుగోదావరి జిల్లాను రాజకీయంగా, ఆర్థికంగా శాసించే స్థాయిలో ఉన్న కోనసీమను ప్రత్యేక జిల్లా చేయాలనేది ఈ ప్రాంతవాసుల దశాబ్దాల నాటి కల. ప్రత్యేక జిల్లాగా ఏర్పడితేనే రైల్వేలైన్ వస్తుందని, పారిశ్రామికాభివృద్ధి జరిగి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ డిమాండ్‌ను గత ప్రభుత్వాలు చెవికెక్కించుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు తెరపైకి రావడంతో కోనసీమ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరిగింది. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు, ఇసుక రీచ్‌ల వల్ల జిల్లాకు వస్తున్న ఆదాయంలో కోనసీమ వాటా 40 శాతం వరకు ఉంటుందని అంచనా. కృష్ణా గోదావరి బేసిన్ (కేజీ) బేసిన్ ద్వారా ప్రముఖ చమురు సంస్థల కార్యకలాపాలు కోనసీమ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి రూ.1250 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు విదేశాలకు జరుగుతాయి. ఇదే కాకుండా రూ.250 కోట్ల విలువైన వరి, కొబ్బరి, ఇతర వాణిజ్య పంటల ఎగుమతి జరుగుతోంది. ఇవి కాకుండా ఇసుక రీచ్‌ల ద్వారా కూడా ఇబ్బుడిముబ్బడిగా ఆదాయం వస్తోంది. జిల్లాలో సుమారు 51 లక్షల మంది జనాభా ఉండగా, కోనసీమలో సుమారు 15 లక్షల మంది వరకు ఉన్నారు. గతంలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, నియోజకవర్గ పునర్విభజనలో ఇవి ఐదుకు పరిమితయ్యాయి. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో మండలమైన తాళ్లరేవు, కొత్తపేట నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఆలమూరు కోనసీమ ఆవలివైపు ఉన్నాయి. ప్రత్యేక దీవిగా ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లా చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే పూర్తిగా ఒక పార్లమెంట్ నియోజకవర్గం కూడా కాని ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయలేమని ఇతర ప్రాంత నేతలు వాదిస్తున్నారు. దీని వెనుక ఆదాయం కోల్పోతామనే భయమే ఎక్కువుగా ఉందని కోనసీమవాసుల వాదన. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయని, జిల్లాకు 25 వరకు స్థానాలు పెరిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అంటే జిల్లాలో ఇప్పుడున్నదానికన్నా అదనంగా ఆరు పెరుగుతాయి. ఈ విధంగా చూస్తే కోనసీమలో మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో కోనసీమను ప్రత్యేక జిల్లా చేసే అవకాశాలున్నాయని కోనసీమ వాసులు చెబుతున్నారు. మన్యసీమతో... ప్రత్యేక కోనసీమకు ఊపురాష్ట్ర పునర్విభజ చట్ట సవరణ ద్వారా పోలవరం ముంపు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపిన విషయం తెలిసిందే. ఈ మండలాలను తూర్పులోని రంపచోడవరం డివిజన్, పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం డివిజన్ కలిపి మన్యసీమగా కొత్త జిల్లా ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రత్యేక కోనసీమ డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. దశాబ్దాలుగా ఉన్న కోనసీమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అవసరమైతే ఉద్యమించాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటివరకు రాజకీయ నేతల ప్రకటనలకే పరిమితమైన ఈ డిమాండ్ ఇప్పుడు ఉద్యమం రూపం దాలుస్తోంది. అన్నివర్గాలవారు దీనిపై గళమెత్తుతున్నారు. అమలాపురంలో ఆదివారం కోనసీమ ప్రత్యేక జిల్లా సాధనా సమితి ఆవిర్భవించింది. ఇప్పటి వరకు దీనిపై విడివిడిగా ఉద్యమిస్తున్న సంఘా లు ఏకతాటిపైకి వస్తున్నాయి. మన్యసీమ ఏర్పడిన తరువాత ఈ ఉద్యమం ఉద్ధృతమయ్యే అవకాశముంది.