‘మన్యసీమ’ జిల్లాకు సర్కార్ జెల్ల! | Tribal Demand separate district | Sakshi
Sakshi News home page

‘మన్యసీమ’ జిల్లాకు సర్కార్ జెల్ల!

Aug 13 2014 12:49 AM | Updated on Aug 17 2018 8:01 PM

‘మన్యసీమ’ జిల్లాకు సర్కార్ జెల్ల! - Sakshi

‘మన్యసీమ’ జిల్లాకు సర్కార్ జెల్ల!

మన్యసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్ పదిహేనేళ్లుగా నలుగుతోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలన్నిటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి అల్లూరి సీతారామరాజు

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :మన్యసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్ పదిహేనేళ్లుగా నలుగుతోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలన్నిటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని గిరిజనం డిమాండ్ చేస్తున్నారు. ఆయా జిల్లాల పరిధిలోని పార్వతీపురం, సీతంపేట, పాడేరు, భద్రాచలం, రంపచోడవరం, కేఆర్ పురం ఐటీడీఏలను విలీనం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే మావోయిస్టుల ప్రభావం నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై పాలకులు ఆసక్తి చూపలేదు. కానీ పోలవరం ముంపు మండలాల విలీనం నేపథ్యంలోనైనా తమ చిరకాల వాంఛ నెరవేరుతుందనుకున్నామని, ఇప్పుడూ తమ ఆశలపై నీళ్లు చల్లారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 మన్యసీమ జిల్లా ఏర్పాటుకు సంబంధించి చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కొద్ది రోజుల కిందట ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. తూర్పుగోదావరి నుంచి మన్యసీమ జిల్లాకు ప్రజాభిప్రాయం సానుకూలంగా లభించిందని కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రభుత్వానికి నివేదించారు కూడా. ఇంత జరిగాక అసలు ఈ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనే తనకు తెలియదన్నట్టు సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్ భేటీలో  పేర్కొనడంపై గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు తెలియకుండా సీఎస్ ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేపడతారనే ప్రశ్న ఈ సందర్భంగా వినిపిస్తోంది.
 
 ఆ మూడు మండలాలే..
 పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మైదాన ప్రాంతంలో ఉన్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాలను కూడా మన్యసీమ జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదించారు. గిరిజనేతరులు ఎక్కువగా ఉన్న ఈ మండలాలనే సాకుగా చూపించి మన్యసీమ జిల్లాకు అడ్డం పడ్డారని గిరిజన ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట ప్రతిపాదనలో లేని మైదాన ప్రాంత మండలాలను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకురావడం ద్వారా అసలు మన్యసీమ జిల్లానే లేకుండా చేశారని మన్యం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాల్లోని 10 గిరిజన మండలాలు, తెలంగాణ నుంచి గోదావరి జిల్లాల్లో విలీనమైన ఏడు మండలాలతో కలిపి 17 మండలాలతో మన్యసీమ జిల్లా ఏర్పాటు చేయాలనేది తొలి ప్రతిపాదన. కాగా తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ సబ్‌ప్లాన్ ఏరియాలోని శంఖవరం, కోటనందూరు, రౌతులపూడి మండలాలను దీనికి కలిపి, మొత్తం మండలాలను 20కి పెంచారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి మైదాన ప్రాంత మండలాలైన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురాలను కూడా ఆకస్మికంగా కలపడం.. మన్యసీమ జిల్లా ప్రతిపాదనలను నిర్వీర్యం చేయాలనే పాలకపక్ష నేతల ఎత్తుగడలో భాగమేనని గిరిజనులు విమర్శిస్తున్నారు.
 
 గిరిజనేతరుల్లో ఆందోళన
 మైదాన ప్రాంత మండలాలను మన్యసీమ జిల్లాలో కలిపితే ఆ పరిధిలోని భూములన్నీ ప్రత్యేక చట్టాల పరిధిలోకి వెళతాయి. తద్వారా గిరిజనేతరులు భూములపై హక్కులు కోల్పోతారు. 1/70 చట్టం అమలులోకి వచ్చి గిరిజనేతరులకు భూ బదలాయింపులు చెల్లుబాటు కావు. ఈ ఆందోళనతోనే గిరిజనేతరులు అక్కడి మంత్రి పీతల సుజాత సహా అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా సర్కార్‌పై ఒత్తిడి తీసుకువచ్చారని, తద్వారా మన్యసీమ జిల్లా ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోకుండా కేబినెట్‌ను ప్రభావితం చేయగలిగారని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో గిరిజన జనాభా 54 వేలు కాగా, గిరిజనేతరుల జనాభా లక్షా 65 వేలు ఉంది. కాగా, మైదాన ప్రాంతంలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లో 3.10 లక్షల జనాభా ఉండగా, అందులో 2 శాతం మాత్రమే గిరిజనులున్నారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా మైదాన ప్రాంత మండలాలు మూడింటినీ ప్రతిపాదిత మన్యసీమ జిల్లాలో విలీనం చేసేందుకు ఎలా ప్రతిపాదించారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద తమ 15 ఏళ్ల కల సాకారమవుతుందన్న ఆశ రాజకీయ ఎత్తుగడతో ఇంతలోనే ఆవిరైపోయిందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement