జనగామ జిల్లా పోరు ఉద్రిక్తం
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నం
- లాఠీచార్జి... ఆర్టీసీ బస్సును తగలబెట్టిన ఉద్యమకారులు
జనగామ: వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లా చేయాలన్న ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన జనగామ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ముందుస్తు అరెస్టులతో మరింత వేడి రగిలి, రణరంగంగా మారింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయూలని డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వచ్చారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, వ్యాపార, వాణిజ్య, కార్మిక వర్గాలతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు రహదారిని దిగ్బంధించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది.
ఒక్కసారిగా ఉద్రిక్తం...
శాంతియుతంగా జరుగుతున్న ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమకారులు కొంత మంది హైదరాబాద్ రహదారిలో ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుంటూ ఎమ్మెల్యే ఇంటివైపు వెళుతుండడంతో పోలీసులు పలుమార్లు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. జేఏసీ ప్రతినిధి ఆకుల సతీశ్‌ను బలవంతంగా జీపులో ఎక్కించుకున్న పోలీసులు... మరికొందరు యువకులను లాక్కెళ్లారు.
ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆందోళన కొనసాగుతుండగానే గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్ రోడ్డుపైనున్న జనగామ డిపో ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. మంటలా ర్పేందుకు వచ్చిన ఫైరింజన్‌ను మున్సిపల్ చైర్మన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బస్సు పూర్తిగా తగలబడిపోయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ట్రాఫిక్ పెద్దఎత్తున నిలిచిపోరుుంది. కాగా, ఉద్యమకారులపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా శనివారం జనగామ నియోజకవర్గ బంద్ నిర్వహించనున్నట్టు జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి తెలిపారు.