జనగామ: వరంగల్ జిల్లాలోని జనగామను ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా జేఏసీ పిలుపు మేరకు రెండో రోజు శనివారం కూడా బంద్ కొనసాగుతోంది. జిల్లా జేఏసీ ఆందోళనలో భాగంగా శుక్రవారం పట్ఠణంలో జరిగిన కార్యక్రమాల్లో ఆందోళనకారులు ఆర్టీసి బస్సును దహనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీఐ చెన్నూరి శ్రీనివాస్ తెలిపారు. బంద్ నేపథ్యంలో పట్టణంలోని వాణిజ్య, వ్యాపార సంస్థలతో పాటు విద్యాసంస్థలు కూడా మూతబడ్డాయి.
యశ్వంత్‌పూర్ శివారులోని వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై పరిసర గ్రామాల ప్రజలు రాస్తారోకో చేశారు. దీంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళకారులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో సబ్‌డివిజన్‌లోని పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. శుక్రవారం జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు వరంగల్, మహబూబాబాద్, నర్సంపేట నుంచి అదనంగా పోలీసు బలగాలను జనగామకు రప్పించారు. దీంతో ఈ రోజు కూడా ఉత్కంఠ నెలకొంది.