అఖిలపక్ష నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
పరకాల: రజాకార్లను తరిమికొట్టిన పోరాటాల గడ్డగా పేరొందిన పరకాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ‘పరకాల జిల్లా సాధన సమితి’ ప్రతినిధులు శనివారం ఆందోళన కొనసాగించారు. పది రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులు శనివారం పరకాల బంద్‌కు పిలుపునిచ్చారు. అఖిలపక్షం కూడా మద్దతు ప్రకటించింది. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. బంద్‌లో భాగంగా పరకాలలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ సందర్భంగా పోలీసులు వారిపై దాడులు చేశారు. వారి నిరసనను తీవ్రంగా అణచివేస్తున్న దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నారు. అఖిలపక్ష నాయకులను పిడిగుద్దులు గుద్దుతూ పోలీస్‌స్టేషన్‌కు లాకెళ్లారు. పోలీసుల దౌర్జన్యంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ మహేందర్ రెడ్డి తీరు సర్వత్రా ఆగ్రహం తెప్పిస్తోంది.
ఉద్యమం నేపథ్యం
పరకాల డివిజన్‌ను కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతోందని పరకాలవాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా అనుమకొండ జిల్లా ప్రస్తావన తెరపైకి వచ్చిన తర్వాత పరకాల రెవెన్యూ డివిజన్‌లో ఉన్న ఆత్మకూరు, శాయంపేట మండలాలను హనుమకొండలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మిగిలింది పరకాలలో దామెర, నడికూడా మండలాలు మాత్రమే. ఈ రెండు మండలాలతో పరకాలను రెవెన్యూ డివిజన్‌గా కొనసాగించడం సాధ్యపడుతుందా లేదా డివిజన్ కూడా కనుమరుగు చేస్తారా అనే అనుమానం ఏర్పడింది. ఈ సమయంలోనే రాష్ట్రంలో మళ్లీ జిల్లాల విభజన వార్తలు రావడంతో పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని ఉద్యమం చేస్తున్నారు. గతంలోనూ ఉద్యమం చేయగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లలేదనే ఆరోపణ ఉంది. అప్పట్లో కేవలం రెవెన్యూ డివిజన్గా ప్రకటించి సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ హుజురాబాద్ జిల్లా ప్రకటిస్తారనే వార్తలు రావడంతో పరకాల జిల్లా ఉద్యమం ఊపందుకున్నది. అందులో భాగంగానే శనివారం పరకాల బంద్‌కు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment