‘ఒక్కటి’గానే గ్రేటర్ వరంగల్ | public opinion on greater warangal | Sakshi
Sakshi News home page

‘ఒక్కటి’గానే గ్రేటర్ వరంగల్

Published Thu, Sep 15 2016 2:27 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

public opinion on greater warangal

సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం 
వరంగల్ రూరల్ జిల్లాపై గందరగోళం 
ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

 సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన ముసాయిదా నివేదికపై అభ్యంతరాలు, సూచనలకు తుది గడువు సమీపిస్తున్నా వరంగల్ జిల్లా విభజనపై అయోమయం వీడలేదు. జిల్లాను వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి (జయశంకర్), మహబూబాబాద్ పేరిట 4 జిల్లాలుగా విభజించాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ముసాయిదా జారీ చేసింది. అయినా రెండుగా విభజించడంపై జిల్లాలో వ్యతిరేకత పెల్లుబికింది. పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అధికార టీఆర్‌ఎస్‌లోని మెజారిటీ ప్రజాప్రతినిధులు కూడా ఈ నిర్ణయంపై బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేశారు.

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆగస్టు 25న స్పీకర్, జిల్లా మంత్రి, ఎంపీలు, జెడ్పీ చైర్‌పర్సన్, గ్రేటర్ వరంగల్ మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ కొండా మురళీ, టీఆర్‌ఎస్ నర్సంపేట నియోజకవర్గ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి మినహా మిగతా నేతలంతా వరంగల్, హన్మకొండలను ఒకే జిల్లాగా ఉంచాలన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకొని వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించినా చిక్కుముడి వీడలేదు. దీంతో వరంగల్ జిల్లాలో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని నిర్ణయించిన సీఎం, అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

ఆ మేరకు వివిధ ప్రభుత్వ విభాగాలతో 4 అంశాలపై క్షేత్రస్థాయి  సమాచారం సేకరించారు. వరంగల్, హన్మకొండ జిల్లాలను ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎక్కువమంది సూచించి నట్లు తెలిసింది. మహబూబాబాద్, భూపాలపల్లి, యాదాద్రి, సిద్ధిపేటలో జిల్లాల్లో కలిపే మండలాల్ని మినహాయించి వరంగల్ ను ఒకే జిల్లాగా కొనసాగించాలని మెజారిటీ అభిప్రాయం వ్యక్తమైంది. వరంగల్, హన్మకొండ, కాజిపేట ప్రాంతాలు ఒకే జిల్లాలో ఉండాలని చాలామంది చెప్పినట్లు సమాచారం.

వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తినట్టు తెలిసింది. పాకాల పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, ధర్మారం కేంద్రంగా చేయాలని పరకాల నియోజకవర్గం, వర్ధన్నపేట లేదా మామునూరు కేంద్రం గా ఉండాలని వర్ధన్నపేట ప్రజలు కోరినట్టు తెలిసింది. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల ఏర్పాటుపై ఎక్కువ మంది హర్షం వెలిబుచ్చినట్టుతెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement