రాష్ట్రంలో పంజాబ్‌ బృందం పర్యటన  | Punjab team tour in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పంజాబ్‌ బృందం పర్యటన 

Published Fri, Nov 17 2017 1:37 AM | Last Updated on Fri, Nov 17 2017 1:37 AM

Punjab team tour in the state - Sakshi

గురువారం సచివాలయంలో కడియం శ్రీహరిని కలసిన చరణ్‌జీత్‌ సింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాంకేతిక విద్యా సంస్థల నియంత్రణపై అధ్యయనానికి పంజాబ్‌ సాంకేతిక విద్యా శాఖ మంత్రి చరణ్‌జీత్‌ సింగ్, అధికారుల బృందం రాష్ట్రానికొచ్చింది. ఉన్నత విద్యా మండలి, ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ, యూనివర్సిటీల వైస్‌చాన్స్‌లర్లతో గురువారం హైదరాబాద్‌లో సమావేశమైంది. రాష్ట్రంలో ప్రైవేటు సాంకేతిక విద్యా సంస్థల నియంత్రణకు చేపడుతున్న చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణలో విద్యా విధానం బాగుందని, ఇక్కడి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుందని కితాబిచ్చారు. తమ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 8 విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్‌ రంగంలో 23 యూనివర్సిటీలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్‌ రంగంలోని యూనివర్సిటీలు పూర్తిగా స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయని, అక్కడ ఎలాంటి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు అమలు చేయట్లేదని చెప్పారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి చాలామంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్తున్నారని, దీంతో తమ రాష్ట్రంలో 20 శాతం పాఠశాలలను మూసేసినట్లు చెప్పారు.  

తెలంగాణలో పక్కాగా నియంత్రణ 
ఈ సందర్భంగా కడియం శ్రీహరి రాష్ట్రంలో పరిస్థితులను ఆ బృందానికి వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రైవేటు కాలేజీలపై పక్కాగా నియంత్రణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుకు బయోమెట్రిక్‌ అమలు చేస్తున్నామన్నారు. ఇంజనీరింగ్‌ పరీక్షలు రాయాలంటే విద్యార్థులకు కచ్చితంగా 75 శాతం హాజరు శాతం ఉండాలనే నిబంధన విధించామని, మొదటి సంవత్సరంలో కనీసం 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణత పొందితేనే రెండో సంవత్సరానికి అనుమతినిస్తున్నట్లు చెప్పారు. ఫీజు లను నియంత్రించేందుకు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో కమిటీ ఉందన్నారు. ఏటా రాష్ట్రం నుంచి వివిధ జాతీయ స్థాయి సంస్థల్లో పోటీ పరీక్షల ద్వారా అడ్మిషన్లు పొందే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. బృందంలో ఆ రాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి. వజ్రలింగం, ఎస్‌.కె సందు, కార్యదర్శి వికాస్‌ ప్రతాప్‌ ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement