సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గోదావరి పుష్కరాల పనులను సకాలంలో పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జూలై 14 నుంచి 25 వరకు జరుగనున్న పుష్కరాల పనుల విషయంలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ నిర్మాణాలపై దృష్టి సారించారు.
కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నేతృత్వంలో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్ రెడ్డి, ఏజేసీ రాజారాం తదితరులు వివిధ శాఖల అధికారులతో కలిసి పుష్కర ఘాట్ల నిర్మాణం, మరమ్మతు పనులను మంగళవారం పరిశీలించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి తదితర ప్రాంతాలను వారు సందర్శించారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆయూ శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఏఈపై సీరియస్...
సాటాపూర్ గ్రామం వద్ద బస్సులు, ఇతర వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి బస్సుల రాకపోకలకు రోడ్డు సౌకర్యం కల్పించాని ఆర్టీసీ డీఎం గంగాధర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ సత్యమూర్తి తదితరులను కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయటానికి కూడా స్థలాన్ని, కందకుర్తి నుండి బోర్గాం వరకు మట్టి రోడ్డు నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు.
నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు మధ్యలో కల్వర్టు నిర్మాణ పనులు సక్రమంగా లేకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్, పంచాయతీరాజ్ ఏఈ మహేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. పనులు నిబంధనల ప్రకారం లేవని అసహనం వ్యక్తం చేశారు. అనాలోచితంగా కల్వర్టు, రోడ్డు నిర్మాణ పనులు చేయడం పట్ల తీవ్రంగా మందలించారు. పనుల్లో వెంటనే మార్పు చేయూలని, లేకుంటే సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఏఈని హెచ్చరించారు. కల్వర్టు సమీపంలో ఉన్న పంటలకు ఎలాంటి నష్టం కలుగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు.
ప్రణాళికబద్ధంగా పుష్కరాల పనులు..
పుష్కర ఘాట్ల నిర్మాణం, మరమ్మతు పనులు పరిశీలించిన అనంతరం కలెక్టర్ రొనాల్డ్‌రోస్ కందకుర్తిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లాలో కందకుర్తి, తాడ్‌బిలోలి, పోచంపాడ్, తడ్‌పాకల్, ఉమ్మెడ, తుంగుని, కోస్లి, బినాల, సావెల్, గుమ్మిర్యాల్, దోమచెంద్ మొత్తం 11 ప్రాంతాలలో 18 ఘాట్ల వద్ద వివిధ పనులు చేపడుతున్నామని వివరించారు.
పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రణాళిక ప్రకారం భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్ల పార్కింగ్‌కు స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భద్రత చర్యలు కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటామని అన్నారు. ఈ పర్యటనలో బోధన్ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, పీఆర్ ఎస్‌ఈ సత్యమూర్తి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.మధుసూదన్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రభాకర్, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
పుష్కరాలపై అప్రమత్తం
Published Wed, May 20 2015 4:03 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement
Advertisement