Pushkar works
-
పుష్కర పనులపై ఏసీబీ కన్ను
పుష్కరాల సందర్భంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ కన్నేసింది. నామినేటెడ్ పద్ధతిలో పనులు కేటాయించి అందిన కాడికి దోచుకుతిన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన మొదలుపెట్టారు. టీడీపీ నేతలు, అధికారులు కలిసి పనులు పలహారంగా ఆరిగించిన వైనంపై ఏసీబీ విచారణ చేపట్టడంతో కార్పొరేషన్ ఇంజినీరింగ్ శాఖలోకలకలం నెలకొంది. అమరావతి బ్యూరో/పటమట : కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర పనుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే విమర్శల నేపథ్యంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. పనులు నాణ్యత కనీసంగా కూడా పట్టించుకోకుండా కాంట్రాక్టర్ల నుంచి మామూళ్లు పుచ్చుకున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. పుష్కరాల సందర్భంగా నగరంలోని 220 ప్రాంతాల్లో చేసిన పలు అభివృద్ధి పనులైన బీటీ రోడ్లు, సీసీ రోడ్ల, డ్రైయిన్లు, కల్వర్టులు, ఘాట్ల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని, అవసరం లేకపోయినా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారని, అంచనాల కంటే ఎక్కువగా నిధులు మంజూరయ్యాయని, ఎస్సీ, ఎస్టీలు ఉండే ఏరియాల్లో వినియోగించాల్సిన సబ్‌ప్లాన్ నిధులు పక్కదోవ పట్టించి బడాబాబులు ఉండే ప్రాంతాల్లో అభివృద్ధికి వెచ్చించారని వచ్చిన ఆరోపణలతో ఇంజినీరింగ్ విభాగంపై ఏసీబీ కన్నేసింది. ఇందులో భాగంగానే ఏసీబీ విభాగం, క్వాలిటీ కంట్రోల్ టీం, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు బుధవారం ఆ విభాగంలో ఎంబుక్స్, ఎస్టిమేషన్ కాపీలు స్వాధీనం చేసుకున్నారు నగరంలోని çపడమట, సత్యనారాయణపురంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తొలుత సర్కిల్–2 పరిధిలలోని సత్యనారాయణపురం, సర్కిల్–3 పరిధిలోని పటమట భద్రయ్యనగర్‌లో నిర్మించిన సీసీ రోడ్లను తనిఖీ చేశారు. ఆయా ప్రాంతల్లో రోడ్లకు డ్రిల్లింగ్ చేసి శాంపిల్స్ సేకరించారు. భద్రయ్యనగర్‌లో అంచనాల కంటే ఎక్కువగా మందంలో రోడ్లు వేసినట్లు అధికారులు శాంపిల్స్ ద్వారా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన అధికారుల తనిఖీలో ఏసీబీ డీఎస్పీ ఎస్.వి.వి. ప్రసాదరావు, సీఐ ఎస్. వెంకటేశ్వరారవు, ఆర్అండ్బీ విభాగం నుంచి డీఈ వైవీ కిషోర్ బాబ్జీ, ఏఈఈలు డీవీఎన్ భూషణŠ , ఏ. శ్రీకాంత్; క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి చంద్రశేఖర్; సర్కిల్–3 ఈఈ ప్రభాకర్, సర్కిల్–2 ఈఈ శ్రీనివాస్ బృందం తనిఖీలు చేశారు. తొలిరోజు తనిఖీలివే... బుధవారం పటమటలోని భద్రయ్య నగర్లో, సత్యనారాయణ పురంలో పుష్కరాల సందర్భంగా నిర్వహించిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డుకు డ్రిల్లింగ్ చేసి రోడ్డు శాంపిల్స్‌ను సేకరించారు. గురువారం భవానీపురంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ పుష్కరాల సందర్భంగా జరిగిన పలు అభివృద్ధి పనులపై నెల రోజుల పాటు ఏసీబీ ప్రత్యేక తనిఖీలు నిర్వహించనుంది. 31 రోజుల పాటు ప్రతిపనిని క్షుణ్ణంగా తినిఖీచేసి, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపనున్నారు. ఎవరినీ వదిలేది లేదు సివిల్ పనులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. రూ.200 కోట్లతో పుష్కరాల పనులు చేపట్టారు. నగరంలో ఆయా ప్రాంతాల్లో 220 పనులు జరిగాయి. పనుల్లో చోటుచేసుకున్న అవకతవకలు వెలికితీస్తాం. ఇందులో అధికారులు, రాజకీయ పర్సనాలిటీల ప్రమేయం ఉందని సమాచారం. తనిఖీల అనంతరం నివేదికల ఆధారంగా వారిపై చట్టపరమైన, శాఖాపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం. –ప్రసాదరావు, ఏసీబీ డీఎస్పీ -
పుష్కర పనుల్లో బాలకార్మికులు!
మంగళగిరి(గుంటూరు):ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో కార్మిక చట్టాలను పాతరేస్తూ కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తోందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఎంత ఘోషిస్తున్నా పట్టించుకోకపోగా పుష్కర పనుల్లోనూ తిరిగి అదే తప్పు చేస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాజధాని నిర్మాణంలో కార్మిక చట్టాలను ఉల్లంఘించి పనులు చేయిస్తుండడంతో కొంత మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది వికలాంగులుగా మారిన విషయం విదితమే. అయినా తీరుమార్చుకోని ప్రభుత్వం ఇప్పుడు పుష్కర పనులను హడావుడిగా చేయించేందుకు పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల నుంచి 15 ఏళ్ల వయస్సు దాటని పిల్లలను తరలించడం చూస్తుంటే కాంట్రాక్టర్లు తప్పుచేసినా ప్రభుత్వం ఏమీ చేయదనే భరోసానిచ్చినట్లుగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాల నేపథ్యంలో విద్యుద్దీకరణ, ఘాట్లలో టైల్స్ పనులు నిర్వహించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా కార్మికులను రైళ్లల్లో తరలిస్తున్నారు. కార్మికులను తరలించడంలో తప్పు లేకపోయినా 14, 15 ఏళ్ల వయస్సుగల పిల్లలను పనులకు తీసుకురావడం బాధాకరం. గురువారం మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి వాహనాల్లో కార్మికులను తరలిస్తుండగా అందులో బాలకార్మికులను సాక్షి పలుకరించగా తాము పశ్చిమబెంగాల్ వాసులమని, విద్యుత్ పనుల కోసం రోజుకు రూ.300 కూలి ఇస్తామని చెప్పడంతో వచ్చినట్లు పేర్కొన్నారు. అందేది రూ.600.. దక్కేది రూ.300 కార్మికులను తరలిస్తున్న దళారి ‘వారితో మీకేంటి మాటలు’ అంటూ బాలకార్మికులను గద్దించి ఆటో ఎక్కించారు. అయితే కార్మికులకు రోజుకు రూ.600లు ఇస్తున్నామని దళారి చెప్పడం విశేషం. ఇలా ఒక్కో కార్మికుడి నుంచి రూ.300 దళారి జేబులోకి వెళతాయని దీనిని బట్టి ఇట్టే అర్థమవుతోంది. చేసిన కష్టానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వకుండా కార్మికులను దళారులు దోచుకుంటున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. -
సర్కారుదే నిర్లక్ష్యం
♦ పుష్కరాలకు పది రోజుల ముందు హడావుడి ♦ ఆలస్యంగా కళ్లు తెరిచిన సర్కారు ♦ టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పనులతోనే జాప్యం ♦ ఆలస్యంగా ఫిబ్రవరి నుంచి అనుమతులు ♦ అవసరం లేని పనులూ చేపట్టిన యంత్రాంగం ♦ అసలు పనులకు బదులు ‘కొసరు’కు ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: గతంలో జరిగిన గోదావరి పుష్కరాలకు అధికార యంత్రాంగం 11 నెలల ముందుగా పనులు ప్రారంభించి నెల రోజుల ముందుగానే పూర్తి చేసింది. ఇప్పుడు పట్టుమని పది రోజులు కూడా లేని సమయంలో పుష్కరాల ఏర్పాట్ల పనులు పూర్తి కాకపోవడానికి కారణం ఎవరు? ముమ్మాటికి ప్రభుత్వ పెద్దలదేనని అధికార యంత్రాంగం చెబుతోంది. ఆగస్టులోనే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పేరుతో కమిటీలంటూ హడావుడి చేసిన ప్రభుత్వ పెద్దలు ఆ తరువాత జిల్లాల నుంచి వచ్చిన పనుల ప్రతిపాదనలను నెలలు తరబడి పక్కన పెట్టారు. సెప్టెంబర్‌లోనే ప్రతిపాదనలు వచ్చినా అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేశారు. పనులు చేయండి.. తరువాత అనుమతులిస్తామని టెండర్లను ఆహ్వానిస్తే ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు పుష్కరాలతో సంబంధం లేని పనులనూ అధికార టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పేరుతో పుష్కరాల పనులతో కలిపేశారు. అసలు పనులు పక్కకు.. ప్రధానంగా పుష్కర స్నానాలు రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం, ధవళేశ్వరంలలో ఆచరిస్తారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన స్నానాలఘాట్‌లు, మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ పనులతో పాటు ఆలయాలకు వెళ్లే రహదారుల నిర్మాణం చేపట్టాలి. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పనులూ జోడు కావడంతో అసలు పనులకు బదులు ఎమ్మెల్యేల సిఫార్సులతో మంజూరైన పనులకు జిల్లా అధికార యంత్రాంగం ప్రాధాన్యత ఇచ్చింది. ఏదో విధంగా పుష్కరాల్లో పనులు పూర్తి చేస్తే బిల్లులు పెట్టి డబ్బులు దండుకోవచ్చనే ఓ ఎమ్మెల్యే కక్కుర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. రాజమండ్రిలోని కోటిలింగాల్లో ప్రధాన పుష్కరఘాట్ల నిర్మాణ పనులను కేవలం 20 రోజుల క్రితమే ప్రారంభించారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.240 కోట్ల విలువైన పుష్కర పనులకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంజూరు ఇచ్చారు. కేవలం మూడు నెలల్లో ఇన్ని పనులు చేపట్టడం ఎలా సాధ్యమని జిల్లా అధికార యంత్రాంగం ప్రశ్నిస్తోంది. రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ నుంచి తాడితోట వరకు గల రహదారి నుంచే స్నానాల కోసం భక్తులు రాకపోకలు సాగిస్తారు. రూ.3కోట్ల వ్యయంతో ఆలస్యంగా చేపట్టిన ఈ రహదారి విస్తరణ పనులు ఇప్పటికీపూర్తి కాలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో 265 స్నానఘాట్ల నిర్మించాల్సి ఉండగా.. ఇందులో ఏ ఒక్కటీ పూర్తి కాలేదు. కృత్రిమ మరుగుదొడ్లను ఇప్పటికిప్పుడు ఢిల్లీ నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి ద్రాక్షారామం వర కు గల 30 కి.మీ. రహదారి అంతా ఇప్పటికీ గుంతలతో నిండి ఉంది. పుష్కర పనులకు, టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పనులకు కలిపి మొత్తం 2,000కు పైగా పనులకు రూ.1,500 కోట్లకు అనుమతులు ఫిబ్రవరిలో మంజూరు చేశారు. అనుమతుల మంజూరులో నెలకొన్న జాప్యంతో పనులు చేపట్టడంలోనూ మరింత ఆలస్యం జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దలే అనుమతులివ్వడంలో జాప్యం చేసి ఇప్పుడు అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎలా అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ముందుగానే ఆదేశాలు ఇస్తే పూర్తయ్యేవి పట్టుమని పది రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు జరగలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు. పుష్కరాలకు సంబంధించిన రూ.960 కోట్ల పనులు మినహా మిగతావి చేపట్టొద్దంటూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆదేశాలు ముందుగానే ఇచ్చి ఉంటే ఇప్పటికే పనులు పూర్తయ్యేవని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మంత్రులతో, అధికారులతో కమిటీలు వేస్తూ ప్రచారం కోసం పాకులాడటం తప్ప పనుల మీద శ్రద్ధ చూపలేదని అధికారులే పేర్కొంటున్నారు. నాసిరకంగా పనులు చేశారని, పుష్కరాల నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనే ప్రణాళికను దెబ్బతీశారంటూ అధికారులపై ముఖ్యమంత్రి మండిపడటం గమనార్హం. -
పుష్కరాలపై అప్రమత్తం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గోదావరి పుష్కరాల పనులను సకాలంలో పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జూలై 14 నుంచి 25 వరకు జరుగనున్న పుష్కరాల పనుల విషయంలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ నిర్మాణాలపై దృష్టి సారించారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నేతృత్వంలో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్ రెడ్డి, ఏజేసీ రాజారాం తదితరులు వివిధ శాఖల అధికారులతో కలిసి పుష్కర ఘాట్ల నిర్మాణం, మరమ్మతు పనులను మంగళవారం పరిశీలించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి తదితర ప్రాంతాలను వారు సందర్శించారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆయూ శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. ఏఈపై సీరియస్... సాటాపూర్ గ్రామం వద్ద బస్సులు, ఇతర వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి బస్సుల రాకపోకలకు రోడ్డు సౌకర్యం కల్పించాని ఆర్టీసీ డీఎం గంగాధర్, పంచాయతీరాజ్ ఎస్ఈ సత్యమూర్తి తదితరులను కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయటానికి కూడా స్థలాన్ని, కందకుర్తి నుండి బోర్గాం వరకు మట్టి రోడ్డు నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు మధ్యలో కల్వర్టు నిర్మాణ పనులు సక్రమంగా లేకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్, పంచాయతీరాజ్ ఏఈ మహేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. పనులు నిబంధనల ప్రకారం లేవని అసహనం వ్యక్తం చేశారు. అనాలోచితంగా కల్వర్టు, రోడ్డు నిర్మాణ పనులు చేయడం పట్ల తీవ్రంగా మందలించారు. పనుల్లో వెంటనే మార్పు చేయూలని, లేకుంటే సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఏఈని హెచ్చరించారు. కల్వర్టు సమీపంలో ఉన్న పంటలకు ఎలాంటి నష్టం కలుగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రణాళికబద్ధంగా పుష్కరాల పనులు.. పుష్కర ఘాట్ల నిర్మాణం, మరమ్మతు పనులు పరిశీలించిన అనంతరం కలెక్టర్ రొనాల్డ్‌రోస్ కందకుర్తిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లాలో కందకుర్తి, తాడ్‌బిలోలి, పోచంపాడ్, తడ్పాకల్, ఉమ్మెడ, తుంగుని, కోస్లి, బినాల, సావెల్, గుమ్మిర్యాల్, దోమచెంద్ మొత్తం 11 ప్రాంతాలలో 18 ఘాట్ల వద్ద వివిధ పనులు చేపడుతున్నామని వివరించారు. పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రణాళిక ప్రకారం భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్ల పార్కింగ్‌కు స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భద్రత చర్యలు కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటామని అన్నారు. ఈ పర్యటనలో బోధన్ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, పీఆర్ ఎస్ఈ సత్యమూర్తి, ఆర్అండ్బీ ఎస్ఈ బి.మధుసూదన్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రభాకర్, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.