పుష్కరాల సందర్భంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ కన్నేసింది. నామినేటెడ్ పద్ధతిలో పనులు కేటాయించి అందిన కాడికి దోచుకుతిన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన మొదలుపెట్టారు. టీడీపీ నేతలు, అధికారులు కలిసి పనులు పలహారంగా ఆరిగించిన వైనంపై ఏసీబీ విచారణ చేపట్టడంతో కార్పొరేషన్ ఇంజినీరింగ్ శాఖలోకలకలం నెలకొంది.
అమరావతి బ్యూరో/పటమట : కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర పనుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే విమర్శల నేపథ్యంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. పనులు నాణ్యత కనీసంగా కూడా పట్టించుకోకుండా కాంట్రాక్టర్ల నుంచి మామూళ్లు పుచ్చుకున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. పుష్కరాల సందర్భంగా నగరంలోని 220 ప్రాంతాల్లో చేసిన పలు అభివృద్ధి పనులైన బీటీ రోడ్లు, సీసీ రోడ్ల, డ్రైయిన్లు, కల్వర్టులు, ఘాట్‌ల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని, అవసరం లేకపోయినా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారని, అంచనాల కంటే ఎక్కువగా నిధులు మంజూరయ్యాయని, ఎస్సీ, ఎస్టీలు ఉండే ఏరియాల్లో వినియోగించాల్సిన సబ్‌ప్లాన్ నిధులు పక్కదోవ పట్టించి బడాబాబులు ఉండే ప్రాంతాల్లో అభివృద్ధికి వెచ్చించారని వచ్చిన ఆరోపణలతో ఇంజినీరింగ్ విభాగంపై ఏసీబీ కన్నేసింది.
ఇందులో భాగంగానే ఏసీబీ విభాగం, క్వాలిటీ కంట్రోల్ టీం, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు బుధవారం ఆ విభాగంలో ఎంబుక్స్, ఎస్టిమేషన్ కాపీలు స్వాధీనం చేసుకున్నారు నగరంలోని çపడమట, సత్యనారాయణపురంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తొలుత సర్కిల్–2 పరిధిలలోని సత్యనారాయణపురం, సర్కిల్–3 పరిధిలోని పటమట భద్రయ్యనగర్‌లో నిర్మించిన సీసీ రోడ్లను తనిఖీ చేశారు. ఆయా ప్రాంతల్లో రోడ్లకు డ్రిల్లింగ్ చేసి శాంపిల్స్ సేకరించారు. భద్రయ్యనగర్‌లో అంచనాల కంటే ఎక్కువగా మందంలో రోడ్లు వేసినట్లు అధికారులు శాంపిల్స్ ద్వారా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన అధికారుల తనిఖీలో ఏసీబీ డీఎస్పీ ఎస్.వి.వి. ప్రసాదరావు, సీఐ ఎస్. వెంకటేశ్వరారవు, ఆర్‌అండ్‌బీ విభాగం నుంచి డీఈ వైవీ కిషోర్ బాబ్జీ, ఏఈఈలు డీవీఎన్ భూషణŠ , ఏ. శ్రీకాంత్; క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి చంద్రశేఖర్; సర్కిల్–3 ఈఈ ప్రభాకర్, సర్కిల్–2 ఈఈ శ్రీనివాస్ బృందం తనిఖీలు చేశారు.
తొలిరోజు తనిఖీలివే...
బుధవారం పటమటలోని భద్రయ్య నగర్‌లో, సత్యనారాయణ పురంలో పుష్కరాల సందర్భంగా నిర్వహించిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డుకు డ్రిల్లింగ్ చేసి రోడ్డు శాంపిల్స్‌ను సేకరించారు. గురువారం భవానీపురంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్
పుష్కరాల సందర్భంగా జరిగిన పలు అభివృద్ధి పనులపై నెల రోజుల పాటు ఏసీబీ ప్రత్యేక తనిఖీలు నిర్వహించనుంది. 31 రోజుల పాటు ప్రతిపనిని క్షుణ్ణంగా తినిఖీచేసి, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపనున్నారు.
ఎవరినీ వదిలేది లేదు
సివిల్ పనులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. రూ.200 కోట్లతో పుష్కరాల పనులు చేపట్టారు. నగరంలో ఆయా ప్రాంతాల్లో 220 పనులు జరిగాయి. పనుల్లో చోటుచేసుకున్న అవకతవకలు వెలికితీస్తాం. ఇందులో అధికారులు, రాజకీయ పర్సనాలిటీల ప్రమేయం ఉందని సమాచారం. తనిఖీల అనంతరం నివేదికల ఆధారంగా వారిపై చట్టపరమైన, శాఖాపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం. –ప్రసాదరావు, ఏసీబీ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment