పుష్కర పనుల్లో బాలకార్మికులు!
పుష్కర పనుల్లో బాలకార్మికులు!
Published Thu, Aug 4 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
మంగళగిరి(గుంటూరు):ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో కార్మిక చట్టాలను పాతరేస్తూ కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తోందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఎంత ఘోషిస్తున్నా పట్టించుకోకపోగా పుష్కర పనుల్లోనూ తిరిగి అదే తప్పు చేస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాజధాని నిర్మాణంలో కార్మిక చట్టాలను ఉల్లంఘించి పనులు చేయిస్తుండడంతో కొంత మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది వికలాంగులుగా మారిన విషయం విదితమే. అయినా తీరుమార్చుకోని ప్రభుత్వం ఇప్పుడు పుష్కర పనులను హడావుడిగా చేయించేందుకు పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల నుంచి 15 ఏళ్ల వయస్సు దాటని పిల్లలను తరలించడం చూస్తుంటే కాంట్రాక్టర్‌లు తప్పుచేసినా ప్రభుత్వం ఏమీ చేయదనే భరోసానిచ్చినట్లుగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాల నేపథ్యంలో విద్యుద్దీకరణ, ఘాట్‌లలో టైల్స్ పనులు నిర్వహించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా కార్మికులను రైళ్లల్లో తరలిస్తున్నారు. కార్మికులను తరలించడంలో తప్పు లేకపోయినా 14, 15 ఏళ్ల వయస్సుగల పిల్లలను పనులకు తీసుకురావడం బాధాకరం. గురువారం మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి వాహనాల్లో కార్మికులను తరలిస్తుండగా అందులో బాలకార్మికులను సాక్షి పలుకరించగా తాము పశ్చిమబెంగాల్ వాసులమని, విద్యుత్ పనుల కోసం రోజుకు రూ.300 కూలి ఇస్తామని చెప్పడంతో వచ్చినట్లు పేర్కొన్నారు.
అందేది రూ.600.. దక్కేది రూ.300
కార్మికులను తరలిస్తున్న దళారి ‘వారితో మీకేంటి మాటలు’ అంటూ బాలకార్మికులను గద్దించి ఆటో ఎక్కించారు. అయితే కార్మికులకు రోజుకు రూ.600లు ఇస్తున్నామని దళారి చెప్పడం విశేషం. ఇలా ఒక్కో కార్మికుడి నుంచి రూ.300 దళారి జేబులోకి వెళతాయని దీనిని బట్టి ఇట్టే అర్థమవుతోంది. చేసిన కష్టానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వకుండా కార్మికులను దళారులు దోచుకుంటున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.
Advertisement
Advertisement