సర్కారుదే నిర్లక్ష్యం
♦ పుష్కరాలకు పది రోజుల ముందు హడావుడి
♦ ఆలస్యంగా కళ్లు తెరిచిన సర్కారు
♦ టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పనులతోనే జాప్యం
♦ ఆలస్యంగా ఫిబ్రవరి నుంచి అనుమతులు
♦ అవసరం లేని పనులూ చేపట్టిన యంత్రాంగం
♦ అసలు పనులకు బదులు ‘కొసరు’కు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: గతంలో జరిగిన గోదావరి పుష్కరాలకు అధికార యంత్రాంగం 11 నెలల ముందుగా పనులు ప్రారంభించి నెల రోజుల ముందుగానే పూర్తి చేసింది.
ఇప్పుడు పట్టుమని పది రోజులు కూడా లేని సమయంలో పుష్కరాల ఏర్పాట్ల పనులు పూర్తి కాకపోవడానికి కారణం ఎవరు? ముమ్మాటికి ప్రభుత్వ పెద్దలదేనని అధికార యంత్రాంగం చెబుతోంది. ఆగస్టులోనే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పేరుతో కమిటీలంటూ హడావుడి చేసిన ప్రభుత్వ పెద్దలు ఆ తరువాత జిల్లాల నుంచి వచ్చిన పనుల ప్రతిపాదనలను నెలలు తరబడి పక్కన పెట్టారు. సెప్టెంబర్‌లోనే ప్రతిపాదనలు వచ్చినా అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేశారు. పనులు చేయండి.. తరువాత అనుమతులిస్తామని టెండర్లను ఆహ్వానిస్తే ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు పుష్కరాలతో సంబంధం లేని పనులనూ అధికార టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పేరుతో పుష్కరాల పనులతో కలిపేశారు.
అసలు పనులు పక్కకు..
ప్రధానంగా పుష్కర స్నానాలు రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం, ధవళేశ్వరంలలో ఆచరిస్తారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన స్నానాలఘాట్‌లు, మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ పనులతో పాటు ఆలయాలకు వెళ్లే రహదారుల నిర్మాణం చేపట్టాలి. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పనులూ జోడు కావడంతో అసలు పనులకు బదులు ఎమ్మెల్యేల సిఫార్సులతో మంజూరైన పనులకు జిల్లా అధికార యంత్రాంగం ప్రాధాన్యత ఇచ్చింది. ఏదో విధంగా పుష్కరాల్లో పనులు పూర్తి చేస్తే బిల్లులు పెట్టి డబ్బులు దండుకోవచ్చనే ఓ ఎమ్మెల్యే కక్కుర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అధికార యంత్రాంగం పేర్కొంటోంది.
రాజమండ్రిలోని కోటిలింగాల్లో ప్రధాన పుష్కరఘాట్‌ల నిర్మాణ పనులను కేవలం 20 రోజుల క్రితమే ప్రారంభించారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.240 కోట్ల విలువైన పుష్కర పనులకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంజూరు ఇచ్చారు. కేవలం మూడు నెలల్లో ఇన్ని పనులు చేపట్టడం ఎలా సాధ్యమని జిల్లా అధికార యంత్రాంగం ప్రశ్నిస్తోంది. రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ నుంచి తాడితోట వరకు గల రహదారి నుంచే స్నానాల కోసం భక్తులు రాకపోకలు సాగిస్తారు. రూ.3కోట్ల వ్యయంతో ఆలస్యంగా చేపట్టిన ఈ రహదారి విస్తరణ పనులు ఇప్పటికీపూర్తి కాలేదు.
ఉభయ గోదావరి జిల్లాల్లో 265 స్నానఘాట్‌ల నిర్మించాల్సి ఉండగా.. ఇందులో ఏ ఒక్కటీ పూర్తి కాలేదు. కృత్రిమ మరుగుదొడ్లను ఇప్పటికిప్పుడు ఢిల్లీ నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి ద్రాక్షారామం వర కు గల 30 కి.మీ. రహదారి అంతా ఇప్పటికీ గుంతలతో నిండి ఉంది. పుష్కర పనులకు, టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పనులకు కలిపి మొత్తం 2,000కు పైగా పనులకు రూ.1,500 కోట్లకు అనుమతులు ఫిబ్రవరిలో మంజూరు చేశారు. అనుమతుల మంజూరులో నెలకొన్న జాప్యంతో పనులు చేపట్టడంలోనూ మరింత ఆలస్యం జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దలే అనుమతులివ్వడంలో జాప్యం చేసి ఇప్పుడు అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎలా అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ముందుగానే ఆదేశాలు ఇస్తే పూర్తయ్యేవి
పట్టుమని పది రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు జరగలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు. పుష్కరాలకు సంబంధించిన రూ.960 కోట్ల పనులు మినహా మిగతావి చేపట్టొద్దంటూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఆదేశించారు.
ఈ ఆదేశాలు ముందుగానే ఇచ్చి ఉంటే ఇప్పటికే పనులు పూర్తయ్యేవని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మంత్రులతో, అధికారులతో కమిటీలు వేస్తూ ప్రచారం కోసం పాకులాడటం తప్ప పనుల మీద శ్రద్ధ చూపలేదని అధికారులే పేర్కొంటున్నారు. నాసిరకంగా పనులు చేశారని, పుష్కరాల నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనే ప్రణాళికను దెబ్బతీశారంటూ అధికారులపై ముఖ్యమంత్రి మండిపడటం గమనార్హం.