భద్రాచలం : గోదావరి పుష్కరాల కోసమని చేపడుతున్న పనుల్లో ఎటువంటి పురోగతి కనిపించటం లేదు. జులై 14 నుంచి 25 వరకూ జరిగే గోదావరి పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నా అధికార యంత్రాంగం ఇందుకనుగణంగా ఏర్పాట్లు చేయటంలో తగిన శ్రద్ధ చూపటం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా నిర్వహించే గోదావరి పుష్కరాలను కుంభమేళాను తలపించే విధంగా చేపట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
భద్రాచలం వద్ద గోదావరి నదిలో పుష్కర స్నానమాచరించేందుకు హిమాలయాల నుంచి కూడా స్వాములు, దిగంబరులు వస్తారని సమాచారం ఉంది. రోజుకు 5.68 లక్షల మంది భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేస్తారని జిల్లా అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. 12 రోజుల పాటు నిర్వహించే గోదావరి పుష్కరాల్లో 88.94 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించ వచ్చని అధికారులు భావిస్తున్నప్పటికీ, ఈ సంఖ్య కోటి దాటిపోయే అవకాశాలు లేకపోలేదు.
ఒక్క భద్రాచలంలోనే రోజుకు సుమారుగా 5 లక్షల మంది భక్తులు పుష్కర స్నానం చేస్తారని అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసమని జిల్లాలోని గోదావరి తీరంలో 6 పుష్కర ఘాట్‌లను గుర్తించారు. ప్రధానంగా పుష్కర ఘాట్ నిర్మాణంతో పాటు, భక్తులకు తగిన మౌలిక సౌకర్యాల కల్పన, రహదారులు మెరుగుపరచటం తదితర పనుల కోసం వివిధ శాఖలకు ఇప్పటికే నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దేవాదాయ, ఇరిగేషన్,పంచాయతీరాజ్.,ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ వంటి శాఖల ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. కానీ ఆయా శాఖల ద్వారా చేపడుతున్న పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు.
ఇబ్బడిముబ్బడిగా నిధులు..
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ఇప్పటికే వివిధ శాఖలకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పుష్కర ఘాట్‌ల నిర్మాణం కోసం ఇరిగేషన్ శాఖకు రూ. 10.86 కోట్లు మంజూరు చేశారు. ఇరిగేషన్‌శాఖ అధికారుల మధ్య పనుల పంపకాల లొల్లితో ఘాట్‌ల నిర్మాణంలో పురోగతి కనిపించటం లేదు. భద్రాచలం, పర్ణశాల మినహా మిగతా చోట్ల పుష్కరఘాట్ నిర్మాణం నత్తనడన సాగుతున్నాయి. పంచాయితీ రాజ్‌శాఖకు 14 పనులకు గాను రూ.3.87 కోట్లు ఇప్పటికే మంజూరు అయ్యాయి.
మణుగూరు మండలం రామానుజవరం, చినరాయిగూడెంలకు మరో రూ.44 లక్షలతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం కోసమని ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.1.23 కోట్లు కేటాయించారు. దేవాదాయశాఖ ద్వారా వివిధ ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.70 కోట్లు మంజూరయ్యాయి. ట్రాన్స్‌కో రూ.1.11 కోట్లు మంజూరు కాగా మరో రూ.11 లక్షలకు ప్రతిపాదనలు పంపించారు. పంచాయతీల శానిటేషన్ ఇతర కార్యక్రమాలకు జిల్లాకు రూ.1.70 కోట్లు, ఆరోగ్యశాఖకు రూ.71లక్షలతో ప్రతిపాదనలు పంపించారు.
శాఖల మధ్య సమన్వయం లోపం..
ఒకే సారి వివిధ శాఖల ద్వారా పుష్కరాల పనులు జరుగుతుండటంతో ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణాధికారి తీరుతో ఇక్కడి అధికారులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
పంచాయతీరాజ్ శాఖ వారు చేపడుతున్న పనుల విషయమై ట్రాన్స్‌కో అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవటంతో విద్యుత్ స్తంభాలు రహదారి మధ్యలోనే ఉంచి నిర్మాణాలు చేపడుతున్నారు. దేవాదాయశాఖ ద్వారా పనులు టెండర్‌లు పూర్తి చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా ఇంకా పనులు ప్రారంభించలేదు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మూడు రోజుల క్రితం పుష్కర ఘాట్‌లను పరిశీలించారు. జిల్లా అధికారులు మాత్రం ఇప్పటి వరకూ వీటిపై పెద్దగా దృష్టి సారించకపోవటం విమర్శలకు తావిస్తోంది.
ముందు చూపు ఏదీ..
సరిగ్గా 60 రోజులకు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. జూన్ నెలాఖరునాటికి పనులను పూర్తి చేయాలని ఆయా శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అడ పా దడపా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు బాగా పడితే పుష్కరాల పనులకు తీవ్ర ఆటకం ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా కొన్ని శాఖల అధికారుల్లో చలనం లేకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాల ప్రారంభానికి ముందు ఏదో హడావుడిగా పనులు చేపట్టి మమ అనిపించి, నిధులను కొల్లగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. పుష్కరాల ఏర్పాట్లపై తొలిసారిగా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతున్నందున ఆయా శాఖలను అప్రమత్తం చేయాలని భక్తులు కోరుతున్నారు.
పురోగతిలేని పుష్కర ఘాట్‌లు
Published Thu, May 14 2015 4:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM