మొగిలిపూలు పూయిస్తా.. | Puyista mogilipulu .. | Sakshi
Sakshi News home page

మొగిలిపూలు పూయిస్తా..

Published Sun, Feb 15 2015 2:54 AM | Last Updated on Thu, Aug 9 2018 8:30 PM

Puyista mogilipulu ..

నారాయణపేట : ‘మొగుల్‌మడ్కను ఎంపీగా దత్తత తీసుకున్నా.. బ్యాంకును ఏర్పాటుచేస్తా.. వైఫై సిస్టం తీసుకొస్తా.. రోడ్లు నిర్మిస్తా.. పాఠశాల భవనాలు కడతాం.. గ్రంథాలయం.. ఆరోగ్యకేంద్రం.. తాగునీటి కుళాయిలు.. పశువుల దవాఖానా.. చెరువును పునరుద్ధరిస్తాం. రైతులకు సాగునీరు అందిస్తాం. నాడు మొగల్‌మడ్క గ్రామచివరలో మొగిలిపూలు పూసేవట.. అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి మొగిలిపూలు పూసేలా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తా..’ అని ఎంపీ జితేందర్‌రెడ్డి భరోసాఇచ్చారు.
 
  సంసద్ ఆదర్శగ్రామ యోజన పథకం కింద ఎంపీ దత్తత తీసుకున్న దామరగిద్ద మండలంలోని మొగుల్ మడ్క గ్రామంలో ఆయన శుక్రవారం రాత్రి బసచేసి శనివారం ఉదయం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘ఇప్పుడు ఎలక్షన్లు లేవ్.. ఊర్లోకొచ్చాం.. ఈ గ్రామంలో నిద్రపోయాం.. గ్రామంలో తీరిగి సమస్యలు తెలుసుకున్నాం..’అని అన్నారు. గ్రామాన్ని దేశప్రజాప్రతినిధులు వచ్చి చూసి మురిసిపోయి ఆదర్శంగా తీసుకునేలా అభివృద్ధిపరుస్తామన్నారు. గ్రామంలో అధికారులు సర్వే చేపట్టి 866 కుటుంబాలు, 3659 జనాభా ఉన్నట్లు గుర్తించారన్నారు. అందులో 404మందికి ఇళ్లులేని వారికి ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తామన్నారు.
 
 చెరువు పునరుద్ధరణకు నిధులు
 మండలంలోని ఆశన్‌పల్లి, లోకూర్తి, నర్సపూర్, మొగుల్‌మడ్కరోడ్లకు నిధులు మంజూరుచేయించేందుకు మంత్రి కేటీఆర్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఉళ్లో పెద్ద చెరువును పునరుద్ధరించి ఆరొందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా చర్యలు చేపడతామన్నారు. జయమ్మ చెరువు బ్యాక్‌వాటర్ ద్వారా దామరగిద్దలో ఉన్న చెరువుల్లో నీరునింపే విధంగా భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యవంతంగా ఉండేలా గ్రామస్తులే సూపర్‌వైజర్‌లుగా వ్యవహరించాలన్నారు. అధికారులు ఎవరైనా అమ్యామ్యాలకు పాల్పడితే సహించేదిలేదన్నారు. కాకతీయ మిషన్ పథకం కింద  ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు రూ.1190కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి కుంభం శివకుమార్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ,  జెడ్పీ కోఆప్షన్‌సభ్యుడు మహ్మద్‌గౌస్, జిల్లా నాయకులు బెక్కం జనార్దన్, మాజీ ఎంపీపీలు వెంకట్‌రెడ్డి, సదాశివారెడ్డి, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ చిట్టెం కేశవర్ధన్‌రెడ్డి ఉన్నారు.
 
 మంచి ప్రధాని వచ్చారు
 ‘మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించారు.. ప్రజాభిమానంతో దేశప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ, దేశప్రజల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేయడం హర్షణీయం’ అని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ ప్రతిపక్షనేత, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కితాబునిచ్చారు. యూపీఏ సర్కార్ టాప్ టూ బాటమ్ ప్రణాళికలను తయారుచేయగా మోదీ పాలన దానికి విరుద్ధంగా బాటమ్ టూ టాప్ ప్రణాళికలు తయారుచేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు.  ‘టీం ఇండియా’ చైర్మన్‌గా ప్రధాని నరేంద్రమోదీ 29 రాష్ట్రాల్లో పార్టీలకతీతంగా అభివృద్ధి పర్చేందుకు కంకణబద్దులుకావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement