రద్దు చేస్తారా.. ఆదరిస్తారా?
- తీవ్ర ఆవేదనలో 9 లక్షల మంది ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు
సాక్షి, హైదరాబాద్: అధికారికంగా ఇళ్లు మంజూరయ్యాయి.. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.. ఒక్క ఇటుక కూడా పడలేదు.. ఇదంతా ఎన్నికలకు ముందటి ముచ్చట. కానీ అధికారుల లెక్కల ప్రకారం వారంతా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులే...! ఇంతలో కొత్తగా వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో అక్రమాల వెలికితీత పేరుతో పాత పథకానికి నిధుల విడుదలను పూర్తిగా నిలిపివేసింది.
దీంతో ఈ లబ్ధిదారులంతా.. ఇంకా ఇళ్ల నిర్మాణం ప్రారంభించనందున తమను కొత్త పథకంలోకైనా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ సర్కారు నుంచి స్పష్టత కరువైంది. దీంతో తాము రూ.75 వేల యూనిట్ కాస్ట్ ఉన్న పాత పథకానికే పరిమితమవుతామా లేక రూ.3.50 లక్షలున్న కొత్త పథకంలోకి మారతామా అన్నది వారికి అంతు చిక్కడంలేదు. దీంతో వారంతా తీవ్ర మానసికక్షోభకు గురవుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 లక్షల కుటుంబాల వేదన ఇది.
అయోమయం.. గందరగోళం..
పేదల గృహ నిర్మాణ పథకం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతుండడం తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణంలో గతంలో అక్రమాలు జరిగాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం సీఐడీ తో దర్యాప్తు చేయిస్తోంది. అది తేలిన తర్వాతే రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని వేగిరం చేయాలని భావి స్తోంది. కానీ ఆ దర్యాప్తు ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించటం లేదు. దీంతో పేదల ఇళ్ల విషయంలో తీవ్ర అయోమయం నెల కొంది.
ఉమ్మడి రాష్ట్రంలో సీఎం పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడానికి కొద్దిరోజుల ముందు ఏకంగా 13.65 లక్షల మం దికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్రం విడిపోవటంతో నిధులు విడుదల కాక ఆ ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. దానికంటే ముందు కేటాయించినవి కూడా వివిధ కారణాలతో మొదలుకాలేదు. వెరసి తెలంగాణవ్యాప్తంగా 9 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదని అధికారులు తాజాగా లెక్కతేల్చారు.
అనుమతి వద్దు.. తర్వాత చూద్దాం!
ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దంటూ జిల్లా అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే పనులు మొదలైన ఇళ్లకు మాత్రమే బిల్లులు విడుదల చేస్తామని అందులో స్పష్టంచేశారు. ప్రస్తుతం 4.69 లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలై వివిధ దశల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడం కోసం రూ.147 కోట్లను విడుదల చేసేం దుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పనులు మొదలుపెట్టని 9 లక్షల ఇళ్లకు సంబంధించిన జాబితాను తాత్కాలికంగా పక్కనపెట్టారు. అయితే వాటిని అలాగే రద్దు చేస్తారా లేక కొత్త పథకంలోకి మారుస్తారా.. ఇందిరమ్మ పథకం కిందనే కొనసాగి స్తారా అన్న విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఆ తొమ్మిది లక్షల మందిని లబ్ధిదారులు కేటాయింపులను రద్దు చేసి రెండు పడక గదుల ఇళ్ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిం చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు.