డిగ్గీ వర్సెస్ డీఎస్!
హైదరాబాద్: ఇద్దరు కీలక నేతల మధ్య తలెత్తిన విభేదాలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. ఆదివారం గాంధీభవన్లో నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 94వ జయంత్యోత్సవం ఇందుకు వేదికయింది.
తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ అయిన దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ)పై మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ డీ. శ్రీనివాస్ గుర్రుగా ఉన్నట్లు, అందుకే డిగ్గీ ముఖ్యఅతిథిగా హాజరైన పీవీ జయంతి కార్యక్రమానికి డీఎస్ హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న దిగ్విజయ్ స్వయంగా డీఎస్ ఇంటికి వెళ్లి సర్దిచెప్పాలనుకున్నారు. కానీ, అందుకు డీఎస్ అంగీకరించలేదని, దీంతో డిగ్గీ తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం.
అయితే డీఎస్ ఆగ్రహం కేవలం డిగ్గీపైనేగానీ ఇతర అధిష్టానం పెద్దలపై కాదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ విషయంపై పెద్దలెవ్వరికీ డీఎస్ ఫిర్యాదు చేయలేదని, ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ను విజయపథంలో నడిపించడంపైనే ఆయన దృష్టి సారించారని పేర్కొన్నారు.