మండలిలో ప్రశ్నోత్తరాలు
సాదా బైనామాలకు 11,19,203 దరఖాస్తులు
మండలిలో వెల్లడించిన మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామాల ఆధారంగా పట్టాల మార్పిడికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా 11,19,203 దరఖాస్తులు వచ్చాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వాటిలో 11,518 మార్పిడి చేసినట్లు, 1,93,330 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. బ్రోకర్ల నివారణ కోసం దీన్ని కఠినతరం చేశామని, అర్హతలున్న వారికి త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల్లోని ఇళ్ల నిర్మాణాలను క్రమబద్ధీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఈటల చెప్పారు. జీవో 58, 59 కింద ఆయా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కు చెందిన మమతా మెడికల్ కాలేజీకి 11 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఏ విధంగా క్రమబద్ధీకరిస్తారని కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్, పొంగులేటి ప్రశ్నించారు. స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు.
విజయ డైరీ విస్తరణ: తలసాని
ఏపీ విజయ డైరి పేరును వాడరాదని నోటీసు ఇవ్వడంతో తెలంగాణ విజయ డైరీగా మార్చినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డైరీ విస్తరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రైతులకు రూ.నాలుగు ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాలు పోసే 31 వేల మంది రైతుల సంఖ్య 50 వేలకు పెరిగిందని వివరించారు. టీఆర్‌ఎస్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, హెరిటేజ్ పాలల్లో రసాయనాలు కలుపుతున్నారని తేలడంతో కేరళ వంటి రాష్ట్రాల్లో రద్దు చేశారని, మన రాష్ట్రంలో ఇలాంటివి ఏమైనా బయటపడ్డాయా అని ప్రశ్నించారు.
మార్చి నాటికి పరికరాల కొనుగోలు
వచ్చే మార్చి నాటికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన వస్తువులు, పరికరాలను కొనుగోలు చేస్తామని, మంచాలు, బెడ్లు, దుప్పట్లు, ఇతర వసతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని కొన్ని మెడికల్ షాపులు, క్లినిక్‌లలో ఉపసంహరించిన పోలియో ట్రైవాలెంట్ వాక్సిన్లను కలిగి ఉండటంతో చర్యలు తీసుకున్నట్లు లక్ష్మారెడ్డి చెప్పారు. పోలియో పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. గత ఏప్రిల్ నుంచి ట్రైవాలెంట్ నుంచి బైవాలెంట్‌గా మారిందని, ట్రైవాలెంట్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.
పిల్లాయపల్లి వద్ద కాలువ మరమ్మతులు: హరీశ్
యాదాద్రి భువనగిరి జిల్లాలో పిల్లాయిపల్లి కాలువ పునరుద్ధరణ కోసం రూ.133.35 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సాంకేతిక మంజూరు టెం డర్లను పిలిచే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఒప్పంద షరతు ప్రకారం, ఒప్పందం తేదీ నుంచి 18 నేలల్లో పనులు పూర్తి చెయాలని నిర్ణయించినట్లు తెలిపారు.