
పులి, ఎద్దుతో నాగలి కడతారా?
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీలో కలుపుతామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు తాను వ్యతిరేకించలేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీసీ నాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య స్పందించారు. మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... కాపులను బీసీలో కలుపుతామని 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఒక జీవో జారీ చేస్తే దానిపై హైకోర్టు వెళ్లాయమని, ఆ జీవోను హైకోర్టు కొట్టేసిన విషయం పవన్ కల్యాణ్ తెలుసుకొని మాట్లాడాలన్నారు. అదే విధంగా 1998, 2000 సంవత్సరంలో జాతీయ కమిషన్ వచ్చినప్పుడూ అడ్డుకున్నామన్నారు.
కాపులను బీసీలో కలపడం అంటే ఒక పులి, ఎద్దుతో నాగలి కట్టడమేనని వ్యాఖ్యానించారు. బీసీ జాబితాలో కలుపాలంటే కొన్ని అర్హతలుండాలని వివరించారు. బీసీ జాబితాలో కాపులను కలపడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. బీసీ ఏమైనా ధర్మ సత్రమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కాపు కులస్తుల్లోనే పేదవాళ్లు లేరని.. భారతదేశమే పేద దేశమని, అదే విధంగా అన్ని కులాల్లో పేదవాళ్లు ఉన్నారన్నారు. కాపులకు కోసం ఏదైనా ఎకనామిక్ స్కీమ్ పెడితే ఎలాంటి అభ్యంతరంలేదని తేల్చి చెప్పారు. కాపులకు రిజర్వేషన్ అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మాట్లాడని కృష్ణయ్య ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని పవన్ కళ్యాణ్ నిన్న అన్నారు.