వివక్ష మానకపోతే.. బీసీల సత్తా చూపుతాం
బీసీ సంఘం నేత , ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా.. ప్రభుత్వం వివక్ష చూపుతూ ఇబ్బందుల పాలుచేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ గత సంవత్సరం ఫీజు బకాయిలు రూ. 1200 కోట్లు ఇంకా చెల్లించలేదని, మరో నాలుగు నెలల్లో ముగిసే ఈ విద్యా సంవత్సరానికి కూడా ఇంకా దరఖాస్తులు తీసుకోలేదని, రెన్యూవల్స్ కూడా ఇవ్వడంలేదని వాపోయారు.
బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసిస్తే దొరల ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందన్నారు. ప్రభుత్వం వారంలోగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, లేదంటే బీసీల సత్తా ఏమిటో చూపుతామన్నారు. ధర్నాలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, విక్రమ్‌గౌడ్, బీసీ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, పాండు, కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు రామలింగం తదితరులు పాల్గొన్నారు.
ఫీజులు చెల్లించకుంటే పరీక్షలు జరగనివ్వం
ఈ విద్యా సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ జనవరిలోగా రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు పూర్తిచేయాలని, లేదంటే పరీక్షలు జరగనివ్వబోమని కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఆయన అసెంబ్లీ ఆవరణ లో మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి, ఆ కాపీలను కేంద్ర ప్రభుత్వానికి పోస్టులో పంపించారని ఆయన విమర్శించారు. బీసీలంటే అంత అలు సా అని ప్రశ్నించారు. దీనిపై ఇరు ప్రభుత్వాలూ అఖిలపక్షం వేసి, ఢిల్లీకి తీసుకువెళ్లాలని, నేరుగా ప్రధానికి తీర్మాన కాపీలివ్వాలని కోరారు.