బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ,
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీల అగ్రనేతలు తరలిరానున్నారు. అధినేతల పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. వీరి రాకతో ప్రచారం మరింత హోరెత్తనుంది. బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జిల్లాలో పలుచోట్ల ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. పోటాపోటీగా ప్రధాన పార్టీల నాయకులు జిల్లా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అడుగులు వేస్తున్నారు.
ప్రచారానికి మరో 12 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఈ స్వల్ప సమయంలోనే వీలైనంత మంది ఓటర్లను ప్రభావితం చేసేలా పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇప్పటికే మహాకూటమి తరఫున మేడ్చల్‌లో గురువారం కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రాకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. దీన్ని పోలింగ్ వరకు తీసుకెళ్లాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
25న కేసీఆర్ సభలు
ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఒక్కరోజే ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఇందుకోసం టీఆర్‌ఎస్ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు జిల్లా నాయకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
28న తాండూరుకు రాహుల్‌గాంధీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తొలిసారిగా జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఈనెల 28న తాండూరుకు ఆయన రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న యువ నాయకుడు పైలెట్ రోహిత్‌రెడ్డికి మద్దతుగా బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు రోహిత్ శాయశక్తులా కృషిచేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు రాహుల్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్ నుంచి ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.
2న అమిత్‌షా
కల్వకుర్తి నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన తల్లోజు ఆచారికి మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. వచ్చే నెల 2న ఆమనగల్లులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పరిధిలో కనీసం ఒకటి రెండు సీట్లయినా గెలుచుకోవడం లక్ష్యంగా అమిత్‌షా పర్యటన సాగనుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment