సభలో మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజాకూటమి ఎన్నికల బహిరంగ సభ కూటమి శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో జిల్లాకు సంబంధించిన పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై సంధించిన విమర్శనాస్త్రాలు ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేయాల్సిన పనులకు సంబంధించి విభజన చట్టంలో పలు అంశాలను రూపొందించిందని, ఇందులో భాగంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని సంకల్పించిందని, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని చట్టంలో రూపొందించినా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వీటి అమలు కోసం ఏమాత్రం దృష్టి పెట్టలేదని రాహుల్ విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అన్ని అంశాల్లో మద్దతు ఇస్తున్న కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నోరు మెదపకపోవడంపై రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. రైతులకు అండగా ఉంటామని, 17 రకాల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని రాహుల్‌గాంధీ చెప్పారు. రాహుల్ సభకు కాంగ్రెస్ శ్రేణులతోపాటు టీడీపీ, సీపీఐ శ్రేణులు సైతం కదిలి రావడంతో కూటమి భాగస్వామ్య పక్షాల్లో సంతృప్తి వ్యక్తమైంది. కేసీఆర్ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించిన రాహుల్‌గాంధీ ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమ కార్యక్రమాలకు కేసీఆర్ సర్కార్ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు విభజన చట్టం ప్రకారం చేయాల్సిన పనులను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసి తీరుతుందన్నారు.
3 గంటలకు ఖమ్మం చేరుకున్న రాహుల్ దాదాపు గంటన్నరకు పైగా సభా వేదికపై గడిపారు. సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఖమ్మం అభివృద్ధిలో తన పాత్ర ఉందని, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఖమ్మానికి మమత మెడికల్ కళాశాల వచ్చిందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి చేశానన్న సంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు. అలాగే తన పట్ల కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. చేస్తున్న విమర్శలపై సభికుల నుంచి మద్దతు కోరే ప్రయత్నం చేశారు. సభలో రాహుల్‌గాంధీ, చంద్రబాబు నాయుడు వంటి ముఖ్య నేతలు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ప్రజాకూటమి తరఫున ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మాత్రమే మాట్లాడే అవకాశం లభించింది. సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ప్రజా గాయకుడు గద్దర్, మంద కృష్ణమాదిగ తదితరులు కేసీఆర్ విధానాలపై విరుచుకుపడ్డారు. అయితే కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, శాసన మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సభలో ప్రసంగించడానికి ప్రయత్నం చేసినా.. సమయాభావం వల్ల అవకాశం చిక్కకపోవడంతో వారు మాట్లాడలేదు.
ప్రాజెక్టుల ఊసెత్తని బాబు..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటూ.. కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు రాసిన చంద్రబాబు నాయుడు దీనిపై సమాధానం చెప్పాలని.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయడం ద్వారా ఖమ్మం జిల్లా అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో.. వివరించాలంటూ మంగళవారం టీఆర్‌ఎస్ నేతలు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. అయితే టీఆర్‌ఎస్ నేతలు చేసిన డిమాండ్లపై కానీ.. ఆ అంశాలపై సభలో ఏ ఒక్కరూ ఊసెత్తలేదు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు మాత్రం ఈ అంశాలను సభలో రాహుల్, చంద్రబాబు సమక్షంలో ప్రస్తావించారు. ప్రాజెక్టులను అడ్డుకునే అవసరం టీడీపీకి లేదని, తెలంగాణ కావాలని కోరుకున్న వారిలో.. తెలంగాణకు అనుకూలంగా ఓటు వేసింది తానేనని ఆయన చెప్పుకొచ్చారు. సీతారామ ప్రాజెక్టుతోపాటు తెలంగాణ ప్రాజెక్టులపై లేఖలు రాసిన అంశంపై టీఆర్‌ఎస్ నేతల డిమాండ్లను మాత్రం సభలో మిగతా నేతలు ఎవరూ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించేందుకు.. తాను తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం లేదని చెప్పేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment