ఇందూరు ‘స్టేషన్‌’లో ఇక్కట్లు..?  | Railway Facilities Are Not There In Nizamabad Railway Station | Sakshi
Sakshi News home page

ఇందూరు ‘స్టేషన్‌’లో ఇక్కట్లు..? 

Published Thu, Apr 11 2019 3:58 PM | Last Updated on Thu, Jul 11 2019 8:52 PM

Railway Facilities Are Not There In Nizamabad Railway Station - Sakshi

మూసి ఉంచిన రెండో రైల్వేస్టేషన్, ప్రధాన రైల్వేస్టేషన్‌లో బుకింగ్‌ కౌంటర్‌ వద్ద ప్రయాణికుల క్యూ

నిజామాబాద్‌ సిటీ: ‘ఏ గ్రేడ్‌’ రైల్వేస్టేషన్‌ స్థాయికి ఎదిగిన నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఇప్పటికి ప్రయాణికుల ఇబ్బందులు తొలగడంలేదు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ మీదుగా నిత్యం 45–50 రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాదిగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే వారి ఇబ్బందులను తీర్చడంలో రైల్వే అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ఇక్కట్లు తీర్చేందుకు, ఏడాది క్రితం రెండో రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. ఈ స్టేషన్‌కు వెనుకాల గల నాందేవ్‌వాడ, హమాల్‌వాడి, దుబ్బ, సుభాష్‌నగర్, కంఠేశ్వర్‌ ప్రాంతాల ప్రజలకు ఈ రైల్వేస్టేషన్‌ ఉపయోగపడుతుందని భావించారు. 

రెండో రైల్వేస్టేషన్‌లో బుకింగ్‌ కౌంటర్‌ ఏర్పాటు ద్వారా ప్రధాన రైల్వేస్టేషన్‌లో బుకింగ్‌ కౌంటర్లపై భారం తగ్గుతుందని సైతం భావించారు. తద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. దీంతో పై ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మొదటి రైల్వేస్టేషన్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులు టిక్కెట్ల కోసం పెద్ద సంఖ్యలో క్యూలో ఉండటం, ఆ సమయంలో తాము ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుండటం నిత్యం జరుగుతోంది. అయితే రెండో రైల్వేస్టేషన్‌లో సిబ్బంది కొరత కారణంగా దాదాపుగా మూసి ఉంచుతున్నారు. 

గూడ్స్‌ రైలు వస్తే స్టేషన్‌ బంద్‌..  
నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌కు గూడ్స్‌ రైలు వచ్చిందంటే చాలు రెండో రైల్వేస్టేషన్‌కు తాళం పడుతోంది. రెండో రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహించే సిబ్బందే గూడ్స్‌ రైలులో సరుకులు నింపే పనులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఇక్కడకు టిక్కెట్ల కోసం వచ్చేవారికి తిప్పలు తప్పడంలేదు. ప్రధాన స్టేషన్‌లో టిక్కెట్ల కోసం క్యూలో నిలబడాల్సి వస్తుందని వాపోతున్నారు. నిజామాబాద్‌ మీదుగా సుదూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ, నాందేడ్‌ మార్గాలకు ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తుంటాయి.

దీంతో సామాన్య ప్రజలు తక్కువ ధరకు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్యాసింజర్‌ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. గతంలో నిజామాబాద్‌ ప్రధాన రైల్వేస్టేషన్‌లో టిక్కెట్టు కౌంటర్లు మూడు ఉండగా ఇవి ఏ మాత్రం సరిపోక ప్రైవేట్‌గా టిక్కెట్లు ఇచ్చే మిషన్లు ఏర్పాటు చేశారు. దీంతో కొద్దివరకు సమస్య తీరింది. రైలు నిజామాబాద్‌ స్టేషన్‌కు చేరుకునే కొద్ది నిమిషాల ముందు ప్రయాణికుల సంఖ్య బాగా ఉండడంతో బుకింగ్‌ కౌంటర్లన్ని కిటికిటలాడుతుంటాయి. రెండో స్టేషన్‌లో బుకింగ్‌ కౌంటర్‌ పనిచేయక ప్రయాణికుల బాధలు మరింత పెరుగుతున్నాయి.   

అవగాహన కల్పించకపోవడంతోనే..  
నిజామాబాద్‌ రెండో రైల్వేస్టేషన్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించకనే అది నిరుపయోగంగా మారుతోంది. ప్రధాన స్టేషన్‌లో బుకింగ్‌ కౌంటర్‌ వద్ద రెండో రైల్వేస్టేషన్‌లో బుకింగ్‌ కౌంటర్‌ ఉన్నట్లు ప్రచారం చేయకపోవటం, ప్రజల్లో అవగాహన కల్పించక ప్రజలంతా ప్రధాన రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్నారు. తద్వారా అక్కడ టిక్కెట్ల కోసం ప్రయాణికుల తోపులాట ఆగటంలేదు. రెండో రైల్వేస్టేషన్‌ నిరంతరం పనిచేసేలా సిబ్బందిని నియమించి, బుకింగ్‌ కౌంటర్‌పై అవగాహన కల్పిస్తే దుబ్బ, నాందేవ్‌వాడ, హమాల్‌వాడీ, కంఠేశ్వర్, సుభాష్‌నగర్‌ ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. రైల్వే అధికారులు రెండో రైల్వేస్టేషన్‌ నిరంతరంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement