హైదరాబాద్ సిటీ: ఎంఎంటీఎస్ రైళ్లలో పోకిరీలు, అక్రమ ప్రయాణికుల బెడద మళ్లీ మొదటికొచ్చింది. బుధవారం నగరంలోని వివిధ మార్గాల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) నిర్వహించిన దాడుల్లో ఏకంగా 134 మంది పట్టుబడ్డారు. వీరిలో అనేక మంది మహిళలు, వికలాంగుల బోగీల్లో ప్రయాణిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. మరి కొందరు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ అరెస్టయ్యారు.
నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి, సికింద్రాబాద్-నాంపల్లి రూట్లలో ఆర్‌పీఎఫ్ విస్తృత తనిఖీలు నిర్వహించింది.అనంతరం పట్టుబడిన వారందరి పైన కేసులు నమోదు చేసి సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్‌ల కింద రూ.30 వేల వరకు జరిమానా విధించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు.అలాగే స్టేషన్‌లలో, రైళ్లలో పరిసరాల అపరిశుభ్రతకు పాల్పడుతూ పట్టుబడిన మరో 22 మంది ప్రయాణికుల పై కోర్టు ఆదేశాల మేరకు రూ.6550 జరిమానా విధించారు.