* మండలిలో మంత్రి హరీశ్‌రావు
* కల్తీని నిరోధించేందుకు విజిలెన్స్ దాడులు నిర్వహిస్తాం
* బొగ్గు అక్రమాలను ప్రస్తావించిన పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి నుంచి బొగ్గును తరలించే క్రమంలో రైలు వ్యాగన్లలో బొగ్గును కల్తీ చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. దీన్ని నియంత్రించేందుకు విజిలెన్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలో భారీ కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బుధవారం శాసన మండలిలో లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి హరీశ్ పై విధంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు, బొగ్గు అక్రమాలపై పొంగులేటితో పాటు ఇతర కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలపై సుమారు గంటన్నర పాటు సుదీర్ఘ చర్చ జరిగింది.
అంతకుముందు పొంగులేటి మాట్లాడుతూ.. నాణ్యత లేని నాసిరకం బొగ్గును రాష్ట్రంలోని విద్యుదుత్పాదన ప్లాంట్లకు అంటగట్టి కోట్ల రూపాయలను కొల్లగొట్టుతున్నారని ఆరోపించారు. దీనిలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల హస్తముందన్నారు. నాణ్యత లేని బొగ్గు వల్లే తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందన్నారు. విదేశాల నుంచి నాసిరకం బొగ్గుతో వైజాగ్ పోర్టుకు తరలివచ్చిన ఎంవీ-ఫుల్బియా అనే నౌకను నవంబర్ 1న అధికారులు పట్టుకున్న విషయాన్ని పొంగులేటి ప్రస్తావించారు. దీనిపై మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి రాష్ట్రానికి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయించుకుంటున్నామని తెలిపారు. విదేశాల నుంచి బొగ్గును రాష్ట్రానికి దిగుమతి చేసుకోవడం లేదని స్పష్టంచేశారు.
మూడేళ్లలో మిగులు విద్యుత్: హరీశ్
రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధిస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికలను ఆయన సభలో వెల్లడించారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన 4 వేల మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరుతూ ఇప్పటికే సీఎం కేసీఆర్ కేంద్రంలో ప్రధాని, విద్యుత్ మంత్రి, ఎన్టీపీసీ చైర్మన్లను కలిశారని గుర్తుచేశారు. కేవలం నాలుగు నెలల కాలంలో ఏ ప్రభుత్వం సాధించలేని పురోగతిని ఎన్టీపీసీ ప్రాజెక్టుల విషయంలో సాధించామని వివరించారు. తమ పార్టీ అధినేత్రి సోనియా తెలంగాణకు కేటాయించిన ఎన్టీపీసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చొరవచూపడం లేదని కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ అనడంతో మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా కోరుతూ ఇటీవలే టెండర్లు పిలిచామని, పలు ప్రైవేటు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని మంత్రి చెప్పారు. యూనిట్‌కు రూ.6.45 నుంచి రూ.6.99తో సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థల బిడ్లను పరిశీలించే యోచనలో ఉన్నామన్నారు.
45 నిమిషాలు కావాలి..
‘సుమారు 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉండగా.. వ్యవసాయానికి 7 గంటల కరెంట్ సరఫరా చేసే అవకాశమున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? రాష్ట్రంలో 400 మంది రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఎందుకు కారణమైంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి అడిగిన ప్రశ్న సభలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. గత కాంగ్రెస్ పాలకుల పాపాల వల్లే రైతు ఆత్మహత్యలు జరిగాయని.. రైతులను ఎవరు చంపిండ్రు.. చంపడానికి కారణాలేమిటీ.. ఈ విషయాలపై సమాధానమివ్వడానికి కనీసం 45 నిమిషాల సమయం పడుతుందంటూ మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
గిరిజనులకు అన్యాయం: ఎమ్మెల్సీ రాములు నాయక్
సమైక్య రాష్ట్రంలో గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలను అమ్ముకునే స్థితికి గిరిజనుల స్థితిగతులు దిగజారాయన్నారు. సినిమాల్లో అందంగా చూపించడానికి, బిల్ క్లింటన్ లాంటి విదేశీ అతిథుల పర్యటన సందర్భంగా వారి మెప్పు కోసమే గిరిజన ఆడపడుచులతో సంప్రదాయ నృత్యాలు చేయించారని వ్యాఖ్యానించారు. గిరిజన సంస్కృతి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను తెలపాలంటూ బుధవారం ఆయన శాసన మండలిలో ప్రశ్నించారు.
‘ఓ లంబాడోళ్ల పిల్ల.. ఎంత బాగున్నావ్’ అంటూ కించపరిచే రీతిలో గిరిజన యువతులపై సినిమా తీశారని వాపోయారు. అదే గిరిజన యువతులను సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశం ఇవ్వకుండా వివక్ష చూపించారన్నారు. గిరిజన యువతులకు సినిమాల్లో అవకాశమిస్తే మేకప్ ఆర్టిస్టులతో పని ఉండదని, దీంతో వారంతా ఉపాధిని కోల్పోతారని ఓ సినీ దర్శకుడు తనతో చెప్పాడని రాములు నాయక్ పేర్కొన్నారు. గిరిజన తండాల్లో ప్రతి ఇంట్లో సినీ హీరోలాగా అందమైన ఓ యువకుడు ఉంటాడని పేర్కొన్నారు.
సంస్కృతిని పరిరక్షిస్తాం: ఈటెల
గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు హైదరాబాద్ నెహ్రూ శతాబ్ది గిరిజన మ్యూజియం, మన్ననూర్(మహబూబ్‌నగర్)లో చెంచులక్ష్మీ మ్యూజియంలను ఏర్పాటు చేశామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. త్వరలో వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క సారక్క మ్యూజియం, ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌లో కొమురం భీం మ్యూజియం, భద్రాచలంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. దీపం పథకం కింద సాచురేషన్ విధానంలో ఆడపడుచులందరికీ వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక తయారు చేస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అమరవీరులకు అరకొర నిధులా: అరికెల
మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ జరిగింది. ప్రభుత్వం బడ్జెట్‌లో అమరవీరుల కుటుంబాలకు అరకొర నిధులు కేటాయించిందని టీడీపీ సభ్యుడు అరికెల నర్సారెడ్డి ఆక్షేపించారు. అమరుల సంఖ్యను 450కు కుదించడం శోచనీయమన్నారు. రెండు పడక గదుల ఇళ్లు, ఇరిగేషన్ విభాగాలకు అరకొరగా కేటాయించారన్నారు. ఎంఐఎం సభ్యుడు సయ్యద్ అల్తాఫ్ మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయాలని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని, ఆ శాఖను ఏపీ, తెలంగాణ విభాగాలుగా విభజించాలని కోరారు.
తెలంగాణ ద్రోహుల పార్టీ: నాయిని
అరికెల తన ప్రసంగంలో ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిసారీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కల్పించుకొని తనదైన శైలిలో చమక్కులు విసిరారు. తమది నాలుగు నెలల శిశువు లాంటి సర్కారు అని, అప్పుడే డ్యాన్స్ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. టీడీపీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని, వారికి అమరుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1969 నుంచి అసువులు బాసిన అమరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
రైలు వ్యాగన్లలో బొగ్గు కల్తీ
Published Thu, Nov 13 2014 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement