సిద్దిపేట టౌన్: సిద్దిపేటలో ఆదివారం రాఖీ పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అన్నాచెల్లెళ్లు సిద్దిపేటకు రావడం, సిద్దిపేట నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో బస్టాండ్ రద్దీగా మారింది. ఇంటింటా పండుగ సంబురాలు జరిగాయి. సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి సోదరీమణులు మురిసారు. వారికి కానుకలు అందించి, వారి నుంచి ఆశీస్సులు అందుకున్నారు.
మనగుడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆలయాల్లో రక్షాబంధన్‌లకు పూజలు నిర్వహించి భక్తులకు వాటిని పూజారులు కట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహాగణపతి ఆలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం, సంతోషిమాత గుడి, షిరిడి సాయిబాబా, వీరహనుమాన్ దేవాలయాలతో పాటు అన్ని ఆలయాల్లో దేవతామూర్తులను అలంకరించారు. విశేష పూజలు నిర్వహించారు. సంతోషిమాత గుడిలో మంత్రి హరీష్‌రావుకు రాఖీని కట్టి పూజరులు ఆశీర్వదించారు.
క్షీరాభిషేకంలో పాల్గొన్న మంత్రి...
సంతోషిమాత గుడిలో ఆదివారం అమ్మవారి జన్మదినోత్సవం కన్నుల పండువగా జరిగింది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఆలయంలో అమ్మవారి మూర్తికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆయనతో పాటు భక్తులు ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ వృషాధీశ్వర్‌రెడ్డి, ఆలయ ప్రధాన పూజారి రామకృష్ణచార్యులు, మాజీ చైర్మన్లు కాచం కాశీనాథ్, తమ్మిశెట్టి వీరేశం, బండెపల్లి కిష్టయ్య మంత్రికి ఘన స్వాగతం పలికారు. శాలువాతో మంత్రిని సన్మానించారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కాగా, మంత్రి హరీష్‌కు ఆదివారం ఆయన ఇంట్లో పార్టీ నాయకురాళ్లు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పీఆర్‌టీయూ సమావేశంలో మహిళా ఉపాధ్యాయులు మంత్రికి రాఖీలు కట్టి అభినందనలు తెలిపారు.
వైభవంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
Published Sun, Aug 10 2014 11:58 PM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM
Advertisement