
చిలుకూరు బాలాజీ దేవాలయంలో మహిళా భక్తులకు రాఖీలు అందిస్తున్న అర్చకుడు రంగరాజన్
మొయినాబాద్(చేవెళ్ల) : ప్రస్తుత సమాజంలో స్త్రీజాతికి పూర్వ గౌరవం రావాలనే సంకల్పంతో చిలుకూరు బాలాజీ దేవాలయంలో చేపట్టిన ‘రక్షా బంధనం’ ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకుడు రంగరాజన్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అర్చకులు రాఖీలతో ప్రదక్షిణ చేసి ప్రధాన ఆలయం ఎదుట ఉన్న మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. సూర్య భగవానుడికి, అమ్మవారికి అష్టోత్తరంతో అర్చన నిర్వహించారు. పూజాకార్యక్రమాల అనంతరం రాఖీలను ఆలయానికి వచ్చిన మహిళా భక్తులకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో వారు ముక్కుమొఖం తెలియని కొత్త వ్యక్తులకు రాఖీలు కట్టారు.
ఈ కార్యక్రమమంతా కనులపండగలా జరిగింది. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరిపై అదే భావన కలిగే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త వ్యక్తులకు రాఖీలు కట్టే కార్యక్రమం చేపట్టామన్నారు. సమాజంలో మార్పుకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని.. ఇప్పటితో ఇది ఆగిపోదన్నారు. మహిళల ఆత్మగౌరవం పెరిగే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. సమాజంలో అందరూ సోదరభావంతో మెలగా ల్సిన అవసరం ఉందని రంగరాజన్ అభిప్రా యపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు కన్నయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment