
టీ-టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా రమణ
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి
కన్వీనర్‌గా మోత్కుపల్లి
‘రావుల’ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక కమిటీలంటూ కొద్దిరోజులుగా ఊరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎట్టకేలకు సోమవారం రెండు కమిటీలను ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల కమిటీని, ఎన్నికల మేనిఫెస్టో కమిటీలను ఆయన ఏర్పాటు చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ముఖ్య నాయకులందరికీ స్థానం లభించేలా ఎన్నికల కమిటీలో కొత్త కొత్త పోస్టులను సృష్టించారు. తెలంగాణ ఎన్నికల కమిటీలో అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, కన్వీనర్ అంటూ మూడు పేర్లతో ఒకే స్థాయి పోస్టులను ముగ్గురు నాయకులకు అప్పగించడం విశేషం. మూడు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన నాయకులతో వీటిని భర్తీ చేశారు. సీనియర్ నేత, ఎంపీ టి.దేవేందర్‌గౌడ్‌కు సలహాదారు అనే కొత్త పదవిని అప్పగించారు. ఇక మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా వనపర్తి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు పార్టీ తెలంగాణ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించాలని భావించినప్పటికీ, ఆయన ఇంకా పార్టీలో చేరలేదు. దీంతో ఈ కమిటీని ప్రకటించలేదు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల ప్రణాళికను కూడా బాబు విడుదల చేశారు. కాగా పదేళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే బీజేపీ బలంలో అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ తెలంగాణ ఎన్నికల కమిటీ: అధ్యక్షుడుగా ఎల్. రమణ(కరీంనగర్), వర్కింగ్ ప్రెసిడెంట్: ఎర్రబెల్లి దయాకర్ రావు(వరంగల్), కన్వీనర్: మోత్కుపల్లి నర్సింహులు(నల్లగొండ), సలహాదారుడు: టి. దేవేందర్‌గౌడ్(రంగారెడ్డి), ప్రధాన కార్యదర్శులు: రమేష్ రాథోడ్(ఆదిలాబాద్), తలసాని శ్రీనివాస్ యాదవ్(హైదరాబాద్), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (వరంగల్), నామా నాగేశ్వర్‌రావు(ఖమ్మం), సభ్యులు: మండవ వెంకటేశ్వర్‌రావు (నిజామాబాద్), టి. ప్రకాశ్‌గౌడ్(రంగారెడ్డి), అలీ మస్కతి (హైదరాబాద్), పి. రాములు (మహబూబ్‌నగర్), ఏలేటి అన్నపూర్ణమ్మ (నిజామాబాద్), రేవంత్‌రెడ్డి(మహబూబ్‌నగర్), యెగ్గె మల్లేశం(రంగారెడ్డి), రావులపాటి సీతారామారావు(ఖమ్మం).
తెలంగాణ మేనిఫెస్టో కమిటీ: కన్వీనర్: రావుల చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు: తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, ఉమా మాధవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, కొత్తకోట దయాకర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, అరవింద్‌కుమార్ గౌడ్, వేం నరేందర్‌రెడ్డి, అల్లాడి రాజ్‌కుమార్, సయ్యద్ యూసఫ్ అలీ, ఇ.పెద్దిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, చిలివేరు కాశీనాథ్, సఫన్‌దేవ్, జి. సాయన్న. అయితే, తెలంగాణలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు నామమాత్రమైనవేనని నేతలు అభిప్రాయపడుతున్నారు.